నెల్లూరులో దారుణం జరిగింది. సైనస్ సమస్యతో ముక్కు ఆపరేషన్ చేయించుకున్న 11 ఏళ్ల బాలిక చనిపోయింది. డాక్టర్ల నిర్లక్ష్యమేనంటూ తల్లిదండ్రులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. దీంతో నెల్లూరులోని పద్మావతి హాస్పిటల్ ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది..
అసలేం జరిగింది..?
అనంతసాగరం మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి, స్వప్న దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చార్మి 14 ఏళ్లు, చరిష్మా 11 ఏళ్లు. పెద్ద పాపకు టాన్సిల్స్ సమస్య ఉంది, చిన్న పాపకు సైనస్ సమస్య ఉంది. వీరిద్దర్నీ ఇటీవల నెల్లూరులోని పద్మావతి ఆస్పత్రికి తీసుకొచ్చారు తల్లిదండ్రులు. ఇద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించిన ఈఎన్టీ డాక్టర్ గంగా ప్రభంజన్ కుమార్.. ఆపరేషన్ చేయాలని చెప్పారు. పెద్దపాపకు టాన్సిల్స్ ఆపరేషన్ జరిగింది. చిన్న పాపకు మాత్రం ముక్కు దూలం సవరించేందుకు ఆపరేషన్ చేశారు. అయితే ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది. ఆపరేషన్ తర్వాత పాప అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయింది.
అప్పటి వరకు ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
అప్పటి వరకు తల్లిదండ్రులతో ఉల్లాసంగా ఉంది చిన్న పాప చరిష్మా. తండ్రితో వీడియో కాల్ కూడా మాట్లాడింది. అదే ఆమె మాట్లాడిన చివరి వీడియో కాల్. ఆ తర్వాత ఆమెను చూసేందుకు ఆస్పత్రికి వచ్చిన తండ్రికి శవమే కనిపించింది. బంగారం లాంటి కూతుర్ని ఆస్పత్రికి తీసుకొచ్చి చేతులారా ప్రాణం తీసుకున్నామని రోదిస్తున్నారు తల్లిదండ్రులు, బంధువులు. డాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు.
వైద్యుల నిర్లక్ష్యం..
అప్పటి వరకు ఆరోగ్యంగానే ఉన్న చిన్నారి ఒక్కసారిగా ఎందుకు చనిపోయింది..? ముక్కు ఆపరేషన్ తర్వాత గుండె ఆగిపోయిందని ఎందుకు చెబుతున్నారు..? ఆస్పత్రి సిబ్బంది, డాక్టర్లు పొంతన లేని సమాధానాలు చెబుతుండటంతో తల్లిదండ్రుల ఆవేదనకు అంతే లేకుండా పోయింది. ఆస్పత్రి వద్ద వారు ఆందోళనకు దిగారు.
గతంలో కూడా రెండు సందర్భాల్లో రోగులు చనిపోతే.. వారి బంధువులు ఇదే ఆస్పత్రి వద్ద వైద్యుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన సందర్భాలున్నాయి. ఈ దఫా మరోసారి ఇలాంటి సంఘటనే జరిగింది. చలాకీగా ఉన్న 11 ఏళ్ల బాలిక చనిపోవడంతో అనంతసాగరం మండలం ఉప్పలపాడులో విషాద ఛాయలు అలముకున్నాయి.
Also Read: వనమా రాఘవ అరెస్టు... హైదరాబాద్‌కు వస్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు
Also Read: రామకృష్ణ కేసులో పురోగతి.. పోలీసుల అదుపులో నలుగురు..? రహస్య ప్రదేశంలో విచారణ!