చిన్నప్పుడు చందమామ రావే జాబిల్లిరావే అని అమ్మ పాడే పాటతో మనకు పరిచయమౌతుంది చందమామ. ఈ అనంతమైన విశ్వంలో మనిషి భూమిని దాటి అడుగు పెట్టిన ఏకైక ప్రదేశం చంద్రుడు. భూమికి సుమారుగా 3లక్షల 84వేల కిలోమీటర్ల దూరంలో ఉండే చంద్రుడు..ఆల్మోస్ట్ భూమి ఏర్పడినప్పటి నుంచి ఉంది. ఓ చిన్నసైజు గ్రహం భూమిని ఎప్పుడో 4 బిలియన్ సంవత్సరాల క్రితం అమాంతం ఢీ కొట్టడం ద్వారా చందమామ ఏర్పడి ఉండవచ్చనేది ఒకవాదన. భూమికి సహజ ఉపగ్రహంలా ఓ నిర్దిష్ట కక్ష్యలో భూమి చుట్టూ తిరుగతూ భూమిపై సముద్రంలో అలలు ఏర్పడటానికి, వాతావరణాన్ని ప్రభావితం చేయటానికి కారణమౌతుంది చందమామ. మరి అలాంటి చందమామ పై ప్రయోగాలు ఎప్పటి నుంచో మొదలయ్యాయో తెలుసా? ఈ నెల 13న మన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రయాన్ 3 ప్రయోగాన్ని చంద్రుడిపైకి చేస్తున్న ఈ టైమ్ లో చంద్రుడి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు, చంద్రయాన్ మిషన్ ఉద్దేశాలు వరుస కథనాల రూపంలో ఏబీపీ దేశం మీకు అందిస్తుంది.




చంద్రుడి మీద ప్రయోగాలు మొదలైంది 1959లో. అప్పటి రష్యన్ సోవియట్ యూనియన్ తొలిసారిగా మనుషులు లేకుండా లూనా 2  అనే స్పేస్ క్రాఫ్ట్ ని చంద్రుడి మీదకు పంపించింది. ఆ తర్వాత తామెమన్నా తక్కువ తిన్నామా అని రష్యాకు పోటీగా అమెరికా అపోలో ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేసి ఏకంగా మనుషులనే చంద్రుడి మీదకు పంపించింది. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడి మీద అడుగుపెట్టింది మొదలు 1969-72 మధ్య కాలంలో ఏకంగా 12 మంది నాసా ఆస్ట్రోనాట్స్ చంద్రుడి మీదకు వెళ్లి వచ్చారు. వస్తూ వస్తూ అక్కడి నుంచి పరిశోధనల కోసం రాళ్లు, మట్టి లాంటి వాటిని సేకరించుకువచ్చారు. 1972 తర్వాత అమెరికా చంద్రుడిపైకి మనుషులను అర్థాంతరంగా ఆపేసింది. దీనికి అనేక కారణాలున్నాయి. రష్యాతో అన్నింటిలో పోటీపడి ముందుండాలని అంతరిక్ష ప్రయోగాలపై అమెరికా చేస్తున్న ఖర్చుపై సొంత దేశం నుంచే విమర్శలు వచ్చాయి. మేం పన్నులు కడుతుంటే మీరు ఆ డబ్బంతా తీసుకెళ్లి చంద్రుడి మీద తగలేస్తున్నారంటూ ఆందోళనలు చెలరేగాయి. దీంతో నిన్న మొన్నటి వరకూ ఆర్టెమిస్ ప్రయోగం వరకూ నాసా చంద్రుడి ఊసు ఎత్తటం మానేసింది. 


 కానీ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో మెల్ల మెల్లగా అంతరిక్షంపై పట్టు సాధించటం మొదలు పెట్టింది. చిన్నపాటి రాకెట్ విజయాలతో మొదలైన మన ఇస్రో జర్నీ... చంద్రుడిపై ప్రయోగాలు చేసే వరకూ వెళ్లింది. అలా మొదలైందే చంద్రయాన్ ప్రోగ్రామ్. 2003 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తొలిసారిగా అప్పటి మన ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్  చంద్రయాన్ ప్రయోగం గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. దేశంలో వివిధ విభాగాలకు 100 మంది పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు చంద్రయాన్ ప్రయోగం ఎలా చేయాలో తమ తమకు తెలిసిన రోడ్ మ్యాప్ ఇచ్చారు. అలా చంద్రయాన్ ప్రయోగానికి అంతా సిద్ధమై కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది.


2008లో చంద్రయాన్ 1 ను ప్రయోగించింది ఇస్రో. చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్ 1 ను ప్రవేశపెట్టడంతో పాటు ఓ ఇంపాక్టర్ ను చంద్రుడి మీద ప్రయోగించి మూన్ మినరాలజీ మ్యాప్ ను తయారు చేసింది. చంద్రయాన్ 1 కి కొనసాగింపుగా 2019లో చంద్రయాన్ 2 ను ప్రయోగించింది ఇస్రో. ఈ సారి ఓ ల్యాండర్ ను, అందులో నుంచి ఓ బుల్లి రోవర్ ను చంద్రుడి దక్షిణ ధృవంపై దింపాలని ప్లాన్ చేసింది అయితే అనుకోని సాంకేతిక కారణాలతో, అవాంతరాలతో చంద్రయాన్ 2 ల్యాండర్ సాఫ్ట్ ల్యాడింగ్ కాలేదు. దీంతో మిషన్ ఫెయిల్ అయింది. 




అసలు ఇస్రో చంద్రయాన్ ప్రయోగాలు ఎందుకు చేస్తోంది అంటే.. భూమి తర్వాత భూమిని పోలి ఉండే ఆవాసం చంద్రుడు మాత్రమే. చంద్రయాన్ 1 తో చంద్రుడిపై నీరు ఉండేందుకు అవకాశం ఉందని తేల్చింది మన ఇస్రోనే. భూమి మీదలానే గ్రావిటీ, బతికేందుకు అవసరమైన పరిస్థితులు క్రియేట్ చేసే అవకాశం చంద్రుడితో సాధ్యమౌతుంది. భూమితో పోలిస్తే 1/6 మాత్రమే గ్రావిటీ ఉండే చంద్రుడిపై పరిశోధనలు పూర్తై అక్కడ బతికేందుకు పరిస్థితులు క్రియేట్ చేస్తే అది భూమికి ఆల్టర్నేటివ్ ఆప్షన్ గా ఉండటంతో పాటు ఫ్యూచర్ లో అంతరిక్షంలో వేరే గ్రహాలపై చేసే పరిశోధనలకు ఓ హాల్ట్ పాయింట్ లా కూడా ఉంటుంది. ఇప్పుడు నాసా చేపడుతున్న అర్టెమిస్ లక్ష్యం కూడా అదే. పైగా చంద్రుడిపైన మనం చూసేది ఎప్పుడూ ఓ వైపు మాత్రమే. ఆ రెండో వైపు ఏముందనేది ఎవరికీ తెలియదు. అక్కడ సూర్యకాంతి పడదు కాబట్టి మనం భూమిపైనుంచి ఎప్పుడూ ఓ వైపు మాత్రమే చూస్తున్నాం. సో రెండో వైపు ఏముందో  తెలుసుకోవాలనేది కూడా ప్లాన్. అందుకే చంద్రయాన్ 2 లో ల్యాండర్ ను దక్షిణ ధృవం మీద దింపాలనుకున్నారు. బట్ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు జులై 13 న చంద్రయాన్ 3 లో కూడా చంద్రయాన్ 2 లో చేయలేకపోయిన పనిని మళ్లీ చేయాలనేది ప్లాన్ అన్నమాట. మరి అమెరికా నాసా చంద్రుడిపై ఆర్టెమిస్ ప్రయోగం చేస్తున్నప్పుడే ఇండియా చంద్రయాన్ 3 చేయటానికి కారణాలేంటీ. ఏంటీ పోటీ ఇవ్వటానికా నెక్ట్స్ కథనంలో తెలుసుకుందాం.