Prakasam News: రైలు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, కదులుతున్న రైలు నుంచి దిగడం, ఎక్కడం ప్రమాదకరమని రైల్వే స్టేషన్లలోని మైకుల్లో చెబుతూనే ఉంటారు. అయినా అవేవీ పట్టించుకోకుండా ప్రమాదాలకు గురవుతుంటారు చాలా మంది. నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడం వల్ల ఒక్కో సారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. కదులుతున్న రైలు ఎక్కేటప్పుడు జారి ప్లాట్‌ఫాంకు, రైలుకు మధ్య ఇరుక్కుని ప్రాణాలు వదలిన ఘటనలు చాలానే ఉన్నాయి. అయినా రైలు కదిలేంత వరకు అక్కడే తచ్చాడుతూ.. తీరా కదిలాకా నింపాదిగా, నిర్లక్ష్యంగా ఎక్కడం వల్ల కాలు జారి ప్రమాదాలు కొనితెచ్చుకుంటారు చాలా మంది.
నిర్లక్ష్యంగా రైలెక్కుతూ కింద పడ్డ ప్రయాణికుడు
రైల్వే ప్లాట్‌ఫాంలపై జరిగే ప్రమాదాలను, ప్రయాణికుల నిర్లక్ష్య వైఖరితో జరిగే ఘటనలను రైల్వే పోలీసులు ఎలా చాకచక్యంగా తప్పిస్తారో అంటూ సోషల్ మీడియాలో చాలా వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి రైల్వే ప్లాట్‌ఫాంకు, రైలుకు మధ్య ఇరుక్కున్నాడు. అక్కడే ఉన్న రైల్వే పోలీసు వెంటనే స్పందించి రైలును ఆపుచేయించి తనను ప్రాణాలతో కాపాడాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది.
సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు
ఒంగోలు రైల్వే స్టేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్లే కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలు ఒంగులో రైల్వే స్టేషన్ లో ఒకటో నంబర్ ప్లాట్ పాంపై వచ్చి ఆగింది. కాసేపటి తర్వాత కృష్ణా ఎక్స్ ప్రెస్ నెమ్మదిగా కదలడం మొదలైంది. కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించినా ఓ ప్రయాణికుడు కాలు జారి కింద పడ్డాడు. ప్లాట్ ఫాం, రైలుకు మధ్య ఇరుక్కున్నాడు. ఓ చేతితో హ్యాండిల్ ను పట్టుకుని రైలుతో పాటు ముందుకు కదిలాడు. ఇదంతా అక్కడే ఉన్న తోడి ప్రయాణికులు, వ్యాపారులు చూసినా కాపాడే ప్రయత్నం మాత్రం చేయలేదు. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది.
ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన రైల్వే పోలీసు
అంతలోనే అక్కడే మఫ్టీలో ఉన్న రైల్వే ఏఎస్ఐ శ్రీనివాసరావు వెంటనే స్పందించారు. చాకచక్యంగా వ్యవహరించారు. రైల్వే బోగి, ప్లాట్ ఫాం మధ్య ఇరుక్కున్న ఆ ప్రయాణికుడిని పట్టుకుని బయటకు లాగి రక్షించాడు. ఈ ప్రమాదం నుంచి ఆ ప్రయాణికుడు కొద్దిపాటి గాయాలతో బయటపడ్డాడు. అంతలోనే ఆ రైలు ఆగిపోయింది. ఆ తర్వాత ఆ ప్రయాణికుడు అదే రైలులో వెళ్లిపోయాడు. ప్రయాణికుడి ప్రాణాలను కాపాడిన ఆ రైల్వే ఏఎస్ఐ శ్రీనివాస రావును ప్రయాణికులు, రైల్వే అధికారులు అభినందించారు. ప్రయాణికులకు ఎంత అవగాహన కల్పించినా ఇలాంటి ఘటనలూ తరచూ జరుగుతున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. రైలు కదిలేటప్పుడు కాకుండా నిలిచి ఉన్నప్పుడే ఎక్కి కూర్చుంటే ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. ఇలాంటి ప్రమాదాలు జరిగిన సమయంలో వెంటనే అక్కడే ఉన్న రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేయాలని చెప్పారు.