Bharatheeyans Censor Issue : చైనాకు లొంగిపోతున్నామా? సెన్సార్ తీరుపై 'భారతీయన్స్' నిర్మాత శంకర్ నాయుడు ఆగ్రహం

సెన్సార్ బోర్డు తీరుపై 'భారతీయాన్స్' నిర్మాత శంకర్ నాయుడు అడుసుమిల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం చైనాకు లొంగిపోతున్నామా? అని ప్రశ్నించారు.

Continues below advertisement

'భారతీయాన్స్' సినిమాలో చైనా పేరును తొలగించేది లేదని చిత్ర నిర్మాత డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి స్పష్టం చేశారు. సెన్సార్ బోర్డు చేసిన సూచన పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎంత దూరమైనా వెళతామని పేర్కొన్నారు. ఇప్పుడు మరోసారి సెన్సార్ తీరును ఆయన ఎండగట్టారు.  

Continues below advertisement

నీరోజ్ పుచ్చా (Nerroze Putcha), సోనమ్ టెండప్, సుభా రంజన్, మహేందర్ బర్కాస్ కథానాయకులుగా రూపొందిన సినిమా 'భారతీయాన్స్' (Bharateeeyans Movie). సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ కథానాయికలు. ఈ సినిమాతో 'ప్రేమించుకుందాం రా', 'కలిసుందాం రా', 'లాహిరి లాహిరి లాహిరిలో' చిత్రాలకు రచయితగా పని చేసిన దీన్ రాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 

అమెరికాలో స్థిరపడిన ప్రవాసాంధ్రుడు, డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి ఈ చిత్రాన్ని భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు. చిత్రీకరణ పూర్తి అయ్యింది. ఫస్ట్ కాపీ కూడా రెడీ. అయితే... ఇంకా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాలేదు. దాని గురించి ఆయన ఓ లేఖ విడుదల చేశారు. 

చైనా కుట్రలు చాలా వరకూ ప్రజలకు తెలియవు!
''సెన్సార్ బోర్డు ఉన్నతాధికారులు చైనాకు భయపడి ఈ సినిమాలో మన గొంతును మూయించే ప్రయత్నం చేస్తున్నారు. మన దేశంపై చైనా దురాగతాలను వెల్లడిస్తూ 'భారతీయాన్స్'ను రూపొందించాం. చైనా దాడులు, భారత దేశానికి వ్యతిరేకంగా చేస్తున్న కుట్రలు చాలా వరకు ప్రజలకు తెలిసి ఉండవచ్చు. మన దేశంతో అతి పొడవైన సరిహద్దులలో చైనా ఒకటి. ప్రత్యక్ష, పరోక్ష యుద్ధాలతో మనల్ని దెబ్బ తీయాలని ప్రయత్నిస్తోంది. వ్యూహాత్మకంగా భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి టిబెట్‌ స్వాధీనం చేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ తమ రాష్ట్రం అని పేర్కొంటోంది. మనపై దాడి చేయడానికి రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థను నిర్మించింది. సరిహద్దుల్లో మ్యాప్స్ మారుస్తూ ఉంటుంది. 2020లో గాల్వాన్ వ్యాలీలో ఇరవై మంది భారతీయ సైనికులను హత మార్చింది. కరోనాకు కారణం కూడా చైనాయే. కశ్మీర్‌లో జరిగిన జి 20 శిఖరాగ్ర సమావేశాన్ని చైనా బహిష్కరించింది. కశ్మీర్ వివాదాస్పద భూభాగమని, ఆ విషయంలో దాయాది దేశం పాకిస్తాన్‌కు మద్దతు పలుకుతోంది. 26/11 దాడులకు తెగబడిన, ముంబైలో 165 మంది మరణానికి కారణమైన లష్కరే తోయిబాకు మద్దతు ఇస్తుంది. కొన్ని రోజుల క్రితం 26/11 దాడి సూత్రధారి, లష్కరే తోయిబా తీవ్రవాది సయ్యద్ మీర్‌ ను క్రూరమైన తీవ్రవాదిగా ప్రకటించాలని భారతదేశం - అమెరికా సంయుక్త తీర్మానాన్ని ప్రవేశ పెడితే చైనా అడ్డుకుంది'' అని 'భారతీయాన్స్‌' నిర్మాత చైనా మీద విరుచుకుపడ్డారు.

చైనాకు లొంగిపోతున్నామా?
ఇంకా శంకర్ నాయుడు అడుసుమిల్లి మాట్లాడుతూ ''చైనా ఎల్లప్పుడూ మన వెనుక కత్తితో దాడి చేసే శత్రువు. చైనా సృష్టించిన మారణ హోమం, గాల్వాన్ వ్యాలీలో మన సైనికులపై దాడి నేపథ్యంలో 'భారతీయాన్స్' సినిమా తీస్తే... సినిమాలో చైనా పేరును ఉపయోగించ వద్దని సెన్సార్ బోర్డు కోరింది. గాల్వాన్ వ్యాలీ పేరునూ తొలగించమని చెప్పడం విచారకరం. ఇది ఎంత అవమానకరం? గాల్వాన్ వ్యాలీని మనం చైనాకు అప్పగిస్తున్నామా? చైనాకు లొంగిపోతున్నామా? ఈ విషయంలో నేను మౌనంగా ఉండలేను. మా 'భారతీయాన్స్' చిత్రానికి మద్దతు ఇవ్వమని విజ్ఞప్తి చేస్తున్నా'' అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి పోరాటాలు : జూడో రాము, కూర్పు : శివ సర్వాణి, ఛాయాగ్రహణం : జయపాల్ రెడ్డి నిమ్మల, సంగీతం : సత్య కశ్యప్ & కపిల్ కుమార్.

Also Read : గుడిలో విజయ్ దేవరకొండ, సమంత - 'ఖుషి' కోసం యాగం, వైరల్ వీడియో

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement