Chandrayaan 3: చంద్రుడిపై అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగానికి అంతా సిద్ధమైంది. జులై 14 మధ్యాహ్నం 2.35కు ప్రయోగం చేపట్టనున్నారు. చంద్రయాన్-3 ని ఎల్వీఎం-3 పీ4 రాకెట్ రోదసిలోకి తీసుకెళ్లనుంది. అయితే చంద్రయాన్-3 వివరాలు వెల్లడించిన ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్.. ఓ ఆసక్తికరమైన అంశాన్ని చెప్పుకొచ్చారు. గతంలో నిర్వహించిన చంద్రయాన్-2 ప్రయోగం వైఫల్యం చెందిన విషయం తెలిసిందే. దీంతో చంద్రయాన్ -3 ని ఫెయిల్యూర్ బేస్ట్ అప్రోచ్ తో అభివృద్ధి చేశామని సోమనాథ్ చెప్పారు. చంద్రయాన్-2 ను సక్సెస్ బేస్డ్ మోడల్ లో రూపొందించారు. చంద్రయాన్ -3 ని మాత్రం ఫెయిల్యూర్ ఆధారిత డిజైన్ తో అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. ఒకరకంగా చెప్పాలంటే చంద్రయాన్-2 ప్రయోగాన్ని సక్సెస్ కావాలనే ఉద్దేశంతో అభివృద్ధి చేయగా.. చంద్రయాన్-3 ప్రయోగాన్ని మాత్రం ఫెయిల్ కావొద్దు అనే ఉద్దేశంతో అభివృద్ధి చేసినట్లన్నమాట. ఫెయిల్యూర్ బేస్ట్ అప్రోచ్ లో ఏదైనా వ్యవస్థ విఫలమైతే.. దాన్ని ఎలా రక్షించాలనే విధానంలో డిజైనింగ్ ఉంటుంది అని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ చెప్పుకొచ్చారు. పారామీటర్ వేరియేషన్ లేదా విభాగాలను వేరు చేసే వ్యవస్థను నిర్వహించే సామర్థ్యం చాలా పరిమితంగా ఉండటమే చంద్రయాన్ -2 వైఫల్యానికి కారణమని.. అందుకే చంద్రయాన్-3 లో ఆ సామర్థ్యాన్ని పెంచినట్లు వెల్లడించారు.. ఇస్రో చేపడుతున్న చంద్రయాన్-3 ప్రయోగం జులై 14న జరగనుంది. సుమారు 3.84 లక్షల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేసిన తర్వాత ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో చంద్రయాన్-3 చంద్రుడిపై అడుగుపెట్టనుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంలోని నిర్దేశిత ప్రదేశంలో ఈ రోవర్ ను దించేందుకు ఇస్రో ప్రయత్నాలు చేస్తోంది.


సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన 4వ దేశంగా నిలవనున్న భారత్ 
చంద్రయాన్-3 మిషన్ లోని వ్యోమనౌక 2 నెలల పాటు సుదీర్ఘ ప్రయాణం చేసి చంద్రుడిపై ల్యాండ్ అవుతుంది. ఇస్రో ఇంతకు ముందు కూడా జాబిలిపై అడుగు పెట్టింది. 2008 అక్టోబర్ లో చంద్రయాన్-1 మిషన్ ద్వారా చంద్రుడిపై అడుగు పెట్టగలిగింది. అయితే చంద్రుడిపై దిగడం సవాళ్లతో కూడుకున్నది. చంద్రయాన్-2 మిషన్ పేరుతో 2019లో ఇస్రో చేపట్టిన ప్రయోగం విఫలమైన సంగతి తెలిసిందే. అప్పుడు చంద్రయాన్ ల్యాండర్, రోవర్ రెండూ క్రాష్ అయ్యాయి. ప్రస్తుతం చేపడుతున్న ప్రయోగం చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని అన్వేషిస్తుంది. చంద్రుని ఉపరితలంపై మృదువైన ప్రాంతాన్ని ఎన్నుకుని అక్కడ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తారు. ఇస్రో చేపట్టిన ప్రయోగం విజయవంతమైతే.. చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది.


Also Read: Scholarships 2023: 9వ తరగతి నుంచి పీజీ వరకు స్కాలర్‌షిప్‌లు, నెలకు ఎంతవస్తుందో తెలుసా?


చంద్రయాన్-3 లక్ష్యం ఏంటి? 
చంద్రయాన్-3 ప్రయోగానికి దాదాపు రూ.615 కోట్లు ఖర్చు అవుతుంది. దీని కోసం ఇస్రో మూడు లక్ష్యాలను నిర్దేశించింది. చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా సాఫ్డ్ ల్యాండింగ్ కావడం, చంద్రుడిపై తిరిగే ఒక రోవర్ ను ప్రయోగించడం, చంద్రుడి ఉపరితలంపై ప్రయోగాలు చేయడం లాంటి మూడు లక్ష్యాలను ఇస్రో పెట్టుకుంది. చంద్రయాన్-2 తరహాలోనే చంద్రయాన్-3లో కూడా ఒక ల్యాండర్, ఒక రోవర్ ఉంటాయి. చంద్రయాన్-2 ప్రయోగం విఫలం కాగా.. దాని నుంచి పాఠాలు నేర్చుకుని ఈ ప్రయోగాన్ని చేపడుతోంది ఇస్రో. చంద్రుడిపై ప్రకంపనలను గుర్తించే సైస్మోమీటర్ సహా కొన్ని పరికరాలను ప్రస్తుత వ్యోమనౌకలో పంపించనున్నారు. వీటి సాయంతో చంద్రుడి ఉపరితలంపై వాతావరణం, ఉష్ణోగ్రతలపై కూడా అధ్యయనం చేపట్టే అవకాశం ఉంటుంది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial