#YuvaGalamPadayatra : వైసీపీ దొంగల కబ్జాకు కాదేది అనర్హం, డ్రెయిన్లను కూడా వదలని వైసీపీ బకాసురులు అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అధికార పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు యథేచ్చగా ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కొండలు, గుట్టలు, శ్మశానాలు, డ్రెయిన్లను సైతం వదలకుండా మింగేస్తున్నారని, అందుకు సీఎం జగన్ తాడేపల్లి సిద్ధాంతాలే కారణమంటూ సెటైర్లు వేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా లోకేష్ ఇటీవల సెల్ఫీల మూమెంట్ చేపట్టారు. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపడంతో పాటు గతంలో తమ హయాంలో చేసిన పనులను సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి జగన్ పాలనను లోకేష్ ఎండగడుతున్నారు.
ప్రస్తుతం కావలి నియోజకవర్గంలో లోకేష్ యువగళం కొనసాగుతోంది. ఇది కావలి నియోజకవర్గం ఆములదిన్నె బిట్-2 పరిధిలో రోడ్డు వెంట ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరుడు కాటా శ్రీనివాసరెడ్డి కొండపి డ్రెయిన్ ను పూడ్చేసి వేసిన లే అవుట్ అంటూ అక్కడ సెల్ఫీ దిగి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు లోకేష్. రోడ్డును ఆనుకొని 15ఎకరాల డ్రెయిన్ ను ఆక్రమించడమేగాక 5 తూములను కూడా పూడ్చేశారని, ఫలితంగా రైతుల పొలాలు ముంపునకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఎవరు ఏమైపోయినా ఫర్వాలేదు, తాడేపల్లి ప్యాలెస్ ఖజానా నిండాలన్న జగన్ రెడ్డి గారి సిద్ధాంతాన్నే ఆయన సామంతరాజులు ఫాలో అవుతున్నారంటూ సీఎంపై సెటైర్లు వేశారు. తమకు లైవ్ లో నరకం చూపిస్తున్న జె-గ్యాంగ్ కు చుక్కలు చూపించేందుకు జనం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారని ట్వీట్లో పేర్కొన్నారు.






యువ‌గ‌ళం పాదయాత్ర 151వరోజు బంగారుపాలెం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభించారు లోకేష్. జువ్వలదిన్నెలో  అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్మారక భవనాన్ని సంద‌ర్శించారు. అమ‌ర‌జీవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జువ్వలదిన్నె వద్ద చిప్పలేరు బ్రిడ్జిపై నుంచి వెళుతుండ‌గా మత్స్యకారులు బోట్ల‌పై యువ‌గ‌ళం, టిడిపి జెండాలతో స్వాగ‌తం ప‌లికారు. వివిధ గ్రామాల ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌పై విన‌తిప‌త్రాలు అందించారు. వడ్డిపాలెం, జువ్వలదిన్నె, చిప్పలేరు బ్రిడ్జి, ఆదినారాయణపురం, అన్నగారిపాలెం, ఒట్టూరు, నడింపల్లి క్రాస్, మామిళ్లదొరువు, పువ్వుల దొరువు, చిననట్టు, పెదనట్టు మీదుగా యువ‌గ‌ళం కొనసాగుతోంది.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial