కస్టమ్స్ అధికారులు ఆంధ్రప్రదేశ్‌లో భారీగా స్మగ్లింగ్ చేస్తున్న బంగారంతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ భారీ ఆపరేషన్‌లో మొత్తం 11 కోట్ల రూపాయల విలువైన స్మగ్లింగ్ బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దాదాపు 100 మంది కస్టమ్స్ అధికారులు దాదాపు 20 టీమ్ లుగా ఏర్పడి.. నెల్లూరు, ఏలూరు, కాకినాడ, సూళ్లూరిపేట, చిలకలూరిపేటలలో స్మగ్లింగ్ బంగారాన్ని గుర్తించి సీజ్ చేశారు.
ధనత్రయోదశి, దీపావళి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గోల్డ్ స్మగ్లింగ్ పై అధికారులు ఉక్కుపాదం మోపారు. బిల్లులు లేకుండా, హాల్ మార్క్ లేకుండా బంగారం అమ్మకాలు జరుగుతున్నాయని నిర్థారించిన కస్టమ్స్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహించారు. దాదాపు రూ.6.7 కోట్ల విలువైన బంగారాన్ని, 4 కోట్ల నగదు సీజ్ చేసినట్టు తెలుస్తోంది. ఆర్టీసీ బస్సులు, కార్లు, రైళ్లు, ఇతర వ్యక్తిగత వాహనాలలో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించిన కస్టమ్స్ అధికారులు 20 బృందాలుగా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. ఏలూరు, కాకినాడ, విశాఖ, నెల్లూరు, చిలకలూరిపేట, సూళ్లూరుపేటలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ.6.7 కోట్లు విలువైన 13.189 కిలోల బంగారాన్ని సీజ్ చేసినట్టు తెలుస్తోంది. 4కోట్ల 24 లక్షల రూపాయల నగదు అధికారులు స్వాధీనం చేసుకుని నిందితుల్ని అరెస్ట్ చేశారు.
నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా నెల్లూరు నగరం, సూళ్లూరుపేటల్లో దాడులు జరిగాయి. ఇటీవలే నెల్లూరు నగరంలో డీఆర్ఐ అధికారులు కూడా షాపులపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. కొంతమంది నిర్వాహకుల దగ్గర రికార్డులు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఆ తర్వాత కస్టమ్స్ అధికారులు రంగంలోకి దిగారు. ముఖ్యంగా నెల్లూరుకు చెన్నై నుంచి బంగారాన్ని తీసుకొస్తున్నారని తెలిసింది. దీంతో సరిహద్దుల్లో మాటువేసి ఓ సీజన్ బాయ్ ని పట్టుకున్నారు. సీజన్ బాయ్ లు నెల్లూరు, చెన్నై మధ్య ప్రతిరోజూ జర్నీ చేస్తుంటారు. అక్కడ ఇచ్చిన వస్తువులు ఇక్కడ, ఇక్కడ ఇచ్చిన వస్తువులు అక్కడ చేరవేస్తుంటారు. ఇలా పనిచేసే ఓ సీజన్ బాయ్ ని అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
నాయుడుపేట వద్ద సీజన్ బాయ్ తోపాటు, అతను ప్రయాణిస్తున్న కారుని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీగా నగదు, బంగారం, కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజులపాటు నగరంలో మకాం వేసి, ఓ బంగారు షాపులోనే ఉండి అక్కడ కీలక ఆధారాలు సేకరించిన తర్వాత పక్కా ప్లాన్ తో సీజన్ బాయ్ ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
నెల్లూరులోనే ఎందుకు..?
బంగారు ఆభరణాల తయారీకి నెల్లూరు పెట్టంది పేరు. ఇక్కడ కార్పొరేట్ సంస్థలు తమ ఆభరణాల షాపుల్ని నిర్వహిస్తున్నా.. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో సంప్రదాయ పాత షాపుల్లోనే బిజినెస్ ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడీ బిజినెస్ పై అధికారులు దృష్టిపెట్టారు. చెన్నై నుంచి బిల్లులు లేకుండా బంగారం తెప్పిస్తుంటారనేది బహిరంగ రహస్యమే. అమ్మకాలు కూడా అలాగే జరుగుతుంటాయి. బిల్లు వేస్తే జీఎస్టీ వర్తిస్తుంది కాబట్టి బిల్లులు లేకుండానే అమ్మాకలు కూడా జరుగుతుంటాయి. దీంతో ఈ జీరో వ్యాపారంపై ఇప్పుడు అధికారులు దృష్టిపెట్టారు. పండగల సీజన్లో పెద్ద మొత్తంలో ఇలా బంగారం తెస్తుంటారు కాబట్టి ఇప్పుడే తనిఖీలకు సిద్ధమయ్యారు. పెద్ద మొత్తంలో బంగారాన్ని నగదుని పట్టుకున్నారు.
హాల్ మార్కింగ్ లో మరో మోసం..
ఇక హాల్ మార్క్ పేరుతో కూడా నెల్లూరులో మోసం జరుగుతోందని తెలుస్తోంది. హాల్ మార్కింగ్ కోసం ఒక్కో వస్తువుకి 35 రూపాయలు తీసుకుంటారు. అయితే దీనికి జీఎస్టీ బిల్ ఉండాలి. ఇలా బిల్ లేకపోయినా కూడా 50 రూపాయలు తీసుకుని హాల్ మార్క్ వేసి ఇస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై కూడా అధికారులు దృష్టిసారించారు.