నెల్లూరు జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. మిత్రులు అనుకున్నవారు కాస్తా శత్రువులుగా మారిపోతున్నారు. శత్రువులు అనుకున్నవారు మిత్రులు అయిపోతున్నారు. తాజాగా కోటంరెడ్డి ఉదంతం తర్వాత నెల్లూరు జిల్లా రాజకీయాల్ల ఈ మార్పులన్నీ స్పష్టమవుతున్నాయి.


కాకాణి వర్సెస్ అనిల్ కాదు.. కాకాణి అండ్ అనిల్


అప్పట్లో కాకాణి గోవర్దన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ మధ్య ఎంత గొడవ జరిగిందో అందరికీ తెలుసు. కాకాణి గోవర్దన్ రెడ్డికి మంత్రి పదవి వచ్చిన తర్వాత నెల్లూరు నగరంలో ఆనం రామనారాయణ రెడ్డి ఆయనకు స్వాగతం పలుకుతూ భారీగా ఫ్లెక్సీలు వేశారు. ఆ ఫ్లెక్సీలను అనిల్ వర్గం చించేసిందనే ఆరోపణలున్నాయి. అదే రోజు ఎమ్మెల్యే అనిల్ నెల్లూరు నగరంలో సభ పెడ్డటంతో.. కాకాణి విజయోత్సవాలను అడ్డుకోవడానికే ఈ ఏర్పాటు అనుకున్నారంతా. కట్ చేస్తే ఆ ఇద్దరినీ సీఎం జగన్ పిలిపించుకుని మాట్లాడారు. ఆ తర్వాత కూడా వారు పెద్దగా సఖ్యతగా లేరు అనేది బహిరంగ రహస్యమే. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కాకాణికి స్వాగత సత్కారాలు చేసిన ఆనం ఇప్పుడు పరాయి మనిషి అయ్యారు. కాకాణికి అనిల్ ఇప్పుడు మంచి మిత్రుడయ్యారు.


అనిల్, కోటంరెడ్డి విషయంలో కూడా..


అప్పట్లో అనిల్ కి మంత్రి పదవి వచ్చిన సందర్భంలో ఇతర నాయకులెవరూ పెద్దగా స్పందించకపోయినా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనిల్ కి ఘన స్వాగతం పలికారు. అప్పట్లో అనిల్, కోటంరెడ్డి మంచి దోస్తులు. కానీ ఇప్పుడు శత్రువులయ్యారు. అప్పట్లో అనిల్ ని వ్యతిరేకించిన కాకాణి ఆయనకు ఇప్పుడు స్నేహితుడిగా మారారు. కాకాణిని సపోర్ట్ చేసిన కోటంరెడ్డి, ఆనం.. ఇద్దరూ ఇప్పుడు కాకాణికి శత్రువులు కావడం విశేషం.


ఇది మరీ విడ్డూరం..


ప్రస్తుతం ఆనం, కోటంరెడ్డి ఇద్దరూ వైసీపీ రెబల్స్. దాదాపుగా వీరిద్దరూ టీడీపీలోకి వెళ్తారనే ఆలోచనలో ఉన్నారు. అంటే టీడీపీలోకి వెళ్లినా, ప్రస్తుతానికి వెళ్లకపోయినా వీరిద్దరి మధ్య శతృత్వం లేదు. కానీ గతంలో కోటంరెడ్డి వర్గానికి ఆనం వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. అప్పట్లో శత్రువులుగా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు ట్యాపింగ్ వ్యవహారంతో మిత్రులుగా మారడం విశేషం.


అందరివాడు ఆదాల..


2019 ఎన్నికల్లో టీడీపీ బీ ఫామ్ కూడా తీసుకుని ఆ తర్వాత చివరి నిమిషంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీలోకి జంప్ చేశారు. నెల్లూరు ఎంపీగా గెలిచారు. కానీ ఆయనకు స్థానిక నాయకులతో పెద్దగా అనుబంధం లేదు. ఆయన అంటీముట్టనట్టుగానే ఉండేవారు. అలాంటి ఆదాల ఇప్పుడు స్థానిక నాయకులకు గొప్ప మిత్రుడు అయ్యారు. ఆదాల ఇంటికి అనిల్ వస్తున్నారు. కార్పొరేటర్ల వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతున్నారు.


రేర్ కాంబినేషన్..


నిన్న మొన్నటి వరకూ నెల్లూరు జిల్లాలో అందరూ వైసీపీయే అయినా అందరి మధ్య విభేదాలు ఉండేవి. కానీ ఆనం, కోటంరెడ్డి ఎపిసోడ్ తర్వాత వారిద్దరు మినహా మిగతా వారంతా ఒక్కటి అయ్యారు. ఒకే తాటిపైకి వచ్చారు. ఆదాల వైపు నిలపడ్డారు. ఆదాల గెలుపు కోసం కృషి చేస్తామంటున్నారు. తమలో ఉన్న విభేదాలను కూడా వారు పక్కనపెట్టినట్టే తెలుస్తోంది. మొత్తమ్మీద ఆనం, కోటంరెడ్డి ఎపిసోడ్ తర్వాత నెల్లూరు జిల్లాలో మిత్రులెవరో, శత్రువులెవరో కొత్తగా తేల్చుకోవాల్సిన పరిస్థితి.