Anil Kumar Yadav : నారా వారి నుంచి నందమూరి కుటుంబం టీడీపీని స్వాధీనం చేసుకోవాలని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరులో మాట్లాడిన ఆయన ఎన్టీఆర్ పేర్లు పెట్టుకుంటే కాదు టీడీపీని లాక్కోవాలని హితవు పలికారు. కొడుకులు చేయలేనటువంటి పనినీ మనవళ్లు అయినా చేసి ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నందుకు టీడీపీ తీసుకోవాలని కోరుకుంటున్నానన్నారు.
టీడీపీని లాక్కోండి
"నందమూరి వంశానికి మళ్లీ చెబుతున్నా... మీ తాతగారు పెట్టిన పార్టీని ఇప్పటికైనా లాక్కోండి. ఆ నారా వారికి పార్టీని దానం చేయకుండా మీ పార్టీని కనీసం మనవళ్లు అయినా తీసుకోండి. ఎన్టీఆర్ కడుపును పుట్టినవారంతా చంద్రబాబుకు దాసోహం. కనీసం మనవాళ్లు అయినా చంద్రబాబు దాసోహం అనకుండా పార్టీని స్వాధీనం చేసుకోండి. నందమూరి తారక రామారావు అని పేరు పెట్టుకుంటే కాదు ఆయన పెట్టిన పార్టీని లాక్కోండని మళ్లీ చెబుతున్నా. "- మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
మళ్లీ జగనే సీఎం
సీఎం జగన్ ఆలోచన వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొడుతూ రైతులు పేరిట పాదయాత్ర అని చెప్పి ఒక డ్రామా కంపెనీ తయారైందని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు ఉండాల్సిన ప్రతిపక్ష పార్టీ కేవలం 28 గ్రామాలకు ప్రతిపక్ష పార్టీగా ఉందన్నారు. త్వరలోనే ఈ రాష్ట్రం నుంచి హైదరాబాద్ కు చంద్రబాబు పారిపోతారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుంటారని అన్నారు. మూడు రాజధానులు ఆలోచన విధానంతో సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధికి అమ్మవారి దీవెనలు ఉండాలని కోరుకున్నానన్నారు.
అమరావతి గ్రామాలకే ప్రతిపక్షనేత
2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు శాశ్వతంగా హైదరాబాద్ కు మకాం మార్చాల్సిందేనని అనిల్ కుమార్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 2024లో కూడా జగన్ సీఎం అవుతారని చెప్పారు. చంద్రబాబు రాష్ట్రానికి ప్రతిపక్ష నేత కాదని కేవలం అమరావతి గ్రామాలకు మాత్రమే ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముందుచూపుతో చంద్రబాబు హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నారని, 2024 తర్వాత ఆయన అక్కడికే మకాం మార్చాల్సి వస్తుందని చెప్పారు.
హైదరాబాద్ కు మకాం
"అమరావతి గురించి మాట్లాడుతున్న బడా నేతలంతా వేల ఎకరాలు ఆ ప్రాంతంలో కొన్నారు. మీ అభివృద్ధి, మీ వేల కోట్ల పెట్టుబడులు పోతాయన్న ఆలోచన తప్ప రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలన్న ఆలోచన. సీఎం జగన్ చెప్పినట్లు అమరావతిని అభివృద్ధి చేయాలంటే రూ. లక్ష కోట్లు కావాలి. అలా కాకుండా వికేంద్రీకరణ చేయాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి ఇవాళ కేవలం 28 గ్రామాలకు ప్రతిపక్షనేతగా మారిపోయారు. 2024లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు శాశ్వతంగా హైదరాబాద్ కు మకాం మార్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. " - అనిల్ కుమార్
Also Read : జగన్ రెడ్డి సీఎంగా కొనసాగితే ఏపీ మరో నైజీరియా- యనమల హాట్ కామెంట్స్
Also Read : రిజిస్ట్రేషన్ ఆదాయాలపై ఫోకస్ పెట్టండి- అధికారులకు సీఎం జగన్ సూచన