ఆదాయ వృద్ధి కోసం పన్నుల పెంపు కాకుండా ఇతర మార్గాలపై దృష్టి పెట్టాలని అధికారులు సీఎం జగన్ సూచించారు. ఇతర్రాష్ట్రాలతో పోలిస్తే ఏ విషయాల్లో వెనుకబడి ఉన్నామో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాహన అమ్మకాలు, ఖనిజ తవ్వకాలు, నాటు సారా నియంత్రణపై ఫోకస్ పెట్టాలని చెప్పారు.
ఆదాయాన్నిచ్చే శాఖలపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు ఆశాజనకంగా ఉన్నాయన్నారు అధికారులు. ఆర్థిక సంవత్సరం మొదటి ఆరునెలల్లో వచ్చిన ఆదాయాల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. జీఎస్‌టీ వసూళ్లు సహా ఇతర ఆదాయాలు నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరువలో ఉన్నట్టు తెలిపారు. పారదర్శక విధానాలు, నిబంధనలు కచ్చితంగా అమలు చేయడం వల్ల ఇదంతా సాధ్యమైందని పేర్కొన్నారు. సెప్టెంబరు 2022 వరకు రూ.27,445 కోట్ల ఆర్జన లక్ష్యంగా చేసుకుంటే రూ. 25,928 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. 94.47శాతం లక్ష్యం చేరుకున్నామని వివరించారు అధికారులు.
ఈ సీజన్‌లో దేశ జీఎస్టీ వసూళ్ల సగటు 27.8 శాతం ఉంటే...ఏపీలో 28.79శాతంగా ఉందని సీఎంకు తెలిపారు అధికారులు. లీకేజీలను అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, ఇన్వెస్టిమెంట్ మేనేజ్‌మెంట్ సిస్టంను అభివృద్ధి పరిచామన్నారు. హెచ్‌ఓడీ కార్యాలయంలో డేటా అనలిటిక్స్ సెంటర్ ఏర్పాటు చేశామని... దీనికి సంబంధించిన సిబ్బందిని కూడా నియమించామని వెల్లడించారు.
ఎక్కడా లీకేజీలు లేకుండా చూసుకోవాలన్నారు సీఎం. లీకేజీలను అరికట్టడానికి అవసరమైతే ప్రొఫెషనల్ ఇనిస్టిట్యూట్‌ల సహాయం తీసుకోవాలని సూచించారు. పన్ను చెల్లింపుదారులకు సులభతర, పారదర్శక విధానాలను అందుబాటులో ఉంచాలని సలహా ఇచ్చారు.
గ్రామాల్లో మహిళా పోలీసుల నుంచి తప్పనిసరిగా ప్రతిరోజూ నివేదికలు తీసుకోవాలన్నారు సీఎం. బెల్టుషాపుల నిర్వహణ, అక్రమ మద్యంపై నిరంతరం నివేదికలు తెప్పించుకోవాలని అధికారులు దిశానిర్దేశం చేశారు. ఈ నివేదికలు ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాటుసారా తయారీ వృత్తిగా కొనసాగిస్తున్న వారి జీవితాలను మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను వారికి అందుబాటులో తీసుకురావాలన్నారు. దీని కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధంచేయాలని ఆదేశించారు.
రిజిస్ట్రేషన్ ఆదాయాలపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ కమిటీలో ఐఏఎస్ అధికారులు కృష్ణబాబు, రజత్ భార్గవ్, నీరబ్ కుమార్ ప్రసాద్, గుల్జార్‌ను సభ్యులుగా పెట్టాలని తెలిపారు. రెండు వారాల్లోగా ఈ కమిటీ నివేదిక ఇవ్వాలన్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన సేవలు ఏంటి? వాటివల్ల ఎలాంటి హక్కులు వస్తాయి? అది ప్రజలకు ఎలా ఉపయోగం అన్నదానిపై అవగాహన కల్పించాలన్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకునేవారికి సులభతర, పారదర్శక విధానాలను అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. నాన్ రిజిస్ట్రేషన్ పరిస్థితులను పూర్తిగా తొలగించాలన్నారు. ఇందులో కూడా ప్రొఫెసనల్ ఏజెన్సీల సహాయాన్ని తీసుకోవాలన్నారు.
ఆస్తుల విలువ మదింపు, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయి? తదితర అంశాలపై హేతుబద్ధత ఉండేలా చూడాలన్నారు సీఎం. గ్రామ, వార్డు సచివాలయాల్లో సంపూర్ణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నడిచేందుకు తగిన మార్గదర్శకాలను కూడా రూపొందించాలని తెలిపారు. భూములు, ఆస్తులే కాకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోతగిన సేవల వివరాలను పోస్టర్ల రూపంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలతోపాటు, గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ ఫిర్యాదు నంబరు ఉంచాలన్నారు.
గనులు, ఖనిజాల నుంచి గతేడాది సెప్టెంబరు వరకూ రూ.1,174 కోట్ల ఆదాయం రాగా... ఈ ఏడాది సెప్టెంబరు వరకూ రూ.1400 కోట్లు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. మొత్తంగా 19శాతం పెరుగుదల కనిపించింది. ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి 43శాతం పెరుగుదల ఉంటుందని అంచనా వేశారు అధికారులు. మైనింగ్ కోసం ఇప్పటికే అనుమతులు పొందిన వారు, లీజు లైసెన్సులు పొందినవారు మైనింగ్ ఆపరేషన్ కొనసాగించేలా చూడాలన్నారు సీఎం.
ఆపరేషన్‌లో లేనివాటిపై దృష్టిపెట్టి, లీజుదారులకున్న ఇబ్బందులను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం.
మైనింగ్ ఆపరేషన్ చేయకపోవడానికి కారణం ఏంటి? వారికున్న ఇబ్బందులు ఏంటి? వారికి చేదోడుగా ఎలా నిలవాలి? తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఒక ప్లాన్ రూపొందించుకోవాలన్నారు. ప్రతినెలా కూడా సమగ్ర సమీక్ష జరిపి, ఆదాయాలు వృద్ధి చెందేలా తగిన చర్యలు తీసుకోవాలని హితవుపలికారు. లక్ష్యాలు చేరుకుంటున్నామా? లేదా? అన్నదానిపై నిరంతరం సమీక్ష చేయాలన్నారు సీఎం.
ఇతర రాష్ట్రాలతో పోల్చితే సానుకూల పరిస్థితులను సృష్టించుకోవడం ద్వారా... రవాణా శాఖలో ఆదాయం పెంచుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. కేవలం పన్నులు పెంచడమే దీనికి పరిష్కారం కాదని, వినూత్న ఆలోచనలు చేయాలని ఆదేశించారు. పక్కరాష్ట్రాలతో పోలిస్తే.. వాహనాల కొనుగోలుకు తగిన సానుకూల పరిస్థితులు రాష్ట్రంలో ఉండేలా ఆలోచనలు చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకుని డీలర్లు వాహనాలు ఇవ్వని ఘటనలు వెలుగుచూశాయన్న సీఎం.
దీనిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.