Vishnu Vardhan Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జనరల్ సెక్రెటరీ విష్ణు వర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని ట్వీట్ చేశారు. కానీ ఇప్పుడు దేశానికి ప్రధానమంత్రి కావాలన్న కోరికతో ప్రజలు వంచిస్తున్నారని అన్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన ఏపీని కరెంటు సమస్యలు, నీటిపారుదల ప్రాజెక్టులపై నిందలు వేస్తూ, తెలంగాణపై తనకున్న శ్రద్ధను చూపారన్నారు. ఇప్పుడు తన జాతీయ ప్రయోజనాల కోసం ఏపీపై చేస్తున్న పోరాటాన్ని విరమించుకుంటారా అని విష్ణు వర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. 






అప్పట్లో కేసీఆర్ ఏమన్నారంటే..


ఏపీ నుంచి తెలంగాణకు రూ.17,828 బకాయిలు:కేసీఆర్


ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలో రూ. 17,828 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని ఈ మధ్య కేసీఆర్ తెలిపారు. తాను చెప్పేది అబద్ధమని నిరూపిస్తే వెంటనే రాజీనామా చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. నెల రోజుల్లోనే ఏపీకి రూ. 6 వేల కోట్లు చెల్లించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిందని.. కానీ ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిల విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు స్పందించడం లేదని అన్నారు. ఏపీకి తెలంగాణ రూ. 3 వేల కోట్లు అసలు 18 శాతం వడ్డీని కలిపి రూ. 6 వేల కోట్లను నెల రోజుల్లో చెల్లించాలని కేంద్రం ఆదేశించిందని కేసీఆర్ తెలిపారు. తమకు రావాల్సిన బకాయిల నుంచి రూ. 6 వేల కోట్లు తీసుకుని మిగిలిన డబ్బులను తమకు ఏపీ నుంచి ఇప్పించాలని కేసీఆర్ కోరారు. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ పట్నం ప్రాజెక్టులో తెలంగాణకు వాటా ఉందని కేసీఆర్ తెలిపారు. 


బీఆర్‌ఎస్‌గా మారిన టీఆర్‌ఎస్


విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని కేసీఆర్ లిఖించారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మారుస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. 21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో మలుపు చోటు చేసుకున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ పార్టీ కార్యవర్గం ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సభ్యులు అందరూ ఆమోదించారు. దీంతో మధ్యాహ్నం 1.19 గంటలకు బీఆర్ఎస్ పార్టీ పేరును ప్రకటించారు. 


కర్నాటక మాజీ ముఖ్యమంతి, జేడీఎస్‌ నేత హెడీ కుమారస్వామి, ఆయన పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధినేత తిరుమావళన్‌తో పాటు ఎంపీలు భేటీకి హాజరు అయ్యారు. ప్రస్తుతం జాతీయ పార్టీగా ఎందుకు మారుస్తున్నామో సభ్యులకు కేసీఆర్‌ వివరించారు. అనంతరం టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా మారుస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. తీర్మానానికి ఆమోదం తెలుపుతూ 283 మంది సభ్యులు ఆమోదముద్ర వేశారు. ఆ తర్వాత సంతకాలు చేశారు.  


ప్రధాని కావాలన్న ఆశతోనే జాతీయ రాజకీయాల్లోకి!


టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన సందర్భంగా బీజేపీ ఏపీ జనరల్ సెక్రటరీ విష్ణు వర్ధన్ రెడ్డి కేసీఆర్ పై విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను వదిలి ప్రధాన మంత్రి కావాలన్న ఆశలో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారని ఆక్షేపించారు.