వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరిలో హల్ చల్ చేశారు. ఉదయగిరి నడిరోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చున్నారు. ఉదయగిరి వస్తే ఎమ్మెల్యేని తరిమేస్తామంటూ ఇటీవల తనకు సవాల్ విసిరినవారు దమ్ముంటే ఇప్పుడు ఉదయగిరికి రండి అంటూ ప్రతి సవాల్ విసిరారు మేకపాటి. ఇప్పుడు తనపై యుద్ధానికి వస్తున్నవారంతా గతంలో తన కాళ్ల దగ్గర ఉన్నారని, ఎంపీపీ సీటు కోసం అడుక్కున్నారని చెప్పారు. చిల్లరవేషాలు వేయొద్దని, తనని పార్టీ బహిష్కరించినా, తానింకా ఉదయగిరికి ఎమ్మెల్యేననే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. ఎమ్మెల్యే రాకతో ఆయన అభిమానులు చుట్టూ చేరారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఉదయగిరిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఏపీలో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ బహిష్కరణ వేటు వేసింది. పార్టీనుంచి వారిని సస్పెండ్ చేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారనే ఆరోపణతో వారిని సస్పెండ్ చేసింది పార్టీ. అయితే ఆ నలుగురిలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నియోజకవర్గం ఉదయగిరిలో మాత్రం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్యేను పార్టీ సస్పెండ్ చేసిిన వెంటనే ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు, దుత్తలూరు ప్రాంతాల్లో సంబరాలు మిన్నంటాయి. ఆయన వైరి వర్గం పండగ చేసుకుంది.
శవయాత్రలు, దిష్టిబొమ్మల దహనం..
ఉదయగిరిలో గత కొంతకాలంగా వైసీపీలో అంతర్గత విభేదాలున్నాయి. కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వ్యతిరేక గ్రూప్ గా మారారు. ఆయనపై సస్పెన్షన్ వేటు పడకముందునుంచీ వారు ప్రెస్ మీట్లు పెట్టి సవాళ్లు విసురుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి మేకపాటి గట్టిగానే బదులిచ్చారు. అయితే పార్టీ సస్పెన్షన్ వేటు వేసిన తర్వాత వైరివర్గం మరింత రెచ్చిపోయింది. మేకపాటిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు వైసీపీలోని వ్యతిరేక వర్గం నేతలు. ఆయన దిష్టిబొమ్మలు దహనం చేసి శవయాత్రలు చేపట్టారు. రోజుకో ఊరిలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇటీవల మేకపాటి నియోజకవర్గానికి తిరిగొచ్చారు. ఆయన ఇప్పుడు తన వైరివర్గంపై మండిపడుతున్నారు.
వైసీపీ పెట్టకముందునుంచీ తాము జగన్ తోనే ఉన్నామని అంటున్నారు ఎమ్మెల్యే మేకపాటి. తమ కుటుంబం జగన్ కోసం, వైసీపీ కోసం కష్టపడిందని, కానీ జగన్ తమను మోసం చేశారని, వెన్నుపోటు పొడిచారని అన్నారాయన. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంలేదని చెప్పారని, తాను పార్టీని కాదనుకున్నానని అన్నారు. మేకపాటి కుటుంబం జగన్ కి అండగా ఉంటే చివరికి మిగిలిందేంటని ప్రశ్నించారు. ఏపీలో నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ బయటకు పంపించినా.. కేవలం మేకపాటి ఇలాకాలో మాత్రమే ఆయన వ్యతిరేక వర్గం హడావిడి చేస్తోంది. మిగతా చోట్ల ఈ స్థాయిలో ఆందోళనలు జరుగుతున్న దాఖలా లేదు.
ఎమ్మెల్యే మేకపాటిపై జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలు కూడా విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఇటీవల అనిల్ కుమార్ యాదవ్, మేకపాటిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయనకు టీడీపీ టికెట్ ఇవ్వదని, ఆయన గెలవలేరని ఎద్దేవా చేశారు. మేకపాటి కూడా అనిల్ కి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అనిల్ సింగిల్ డిజిట్ మెజార్టీ ఎమ్మెల్యే అని అన్నారు. ఆ తర్వాత ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగింది. ఇప్పుడు మళ్లీ మేకపాటి ఉదయగిరిలో మొదలెట్టేశారు.