Nellore News : నెల్లూరు జిల్లా కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బ గ్రామం కొత్తకాలనీలో మట్టి రోడ్డులు ఉండేవి. ప్రజల నీటి అవసరాలు తీర్చేందుకు రోడ్డు దగ్గర్లోనే చేతి పంపులు ఏర్పాటు చేశారు.  ఇటీవల గ్రామంలో సిమెంట్ రోడ్లు నిర్మించారు.  అయితే ఈ రోడ్లు వేసేటప్పుడే చిత్ర విచిత్రాలు జరిగాయి. రోడ్డు మధ్యలో బోరింగ్ పంపులు ఉన్నా కూడా వాటిని అలాగే ఉంచి రోడ్లు వేసేశారు కాంట్రాక్టర్లు. అది తమ పని కాదని తప్పుకున్నారు. చివరకు అధికారులకు అర్జీలు పెట్టుకున్నా పట్టనట్లు వ్యవహరించారు. రోడ్లు వేసినా ఉపయోగం లేకుండా పోయిందని, ఆటోలు, ఇతర వాహనాలు వెళ్లాలంటే ఇక్కడ ఇబ్బందిగా ఉందంటున్నారు స్థానికులు. 


చేతిపంపు తొలగించాలని కోరినా? 


నెల్లూరు జిల్లా కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బ కొత్తకాలనీలో అంతర్గత రహదారి గతంలో మట్టిబాట ఉండేది. ఇక్కడ నీళ్లు పుష్కలంగా ఉండడంతో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు చేతిపంపు  నిర్మించారు. ఇటీవల గ్రామంలో సీసీ రోడ్డు వేసేందుకు నిధులు మంజూరవ్వడంతో చేతిపంపు రోడ్డు మధ్యలో వస్తుందని తెలిసినా అలాగే సీసీ రోడ్లు వేశారు. దారి మధ్యలో చేతిపంపు రావడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సీసీ రోడ్డు వేసేటప్పుడే చేతిపంపు తొలగించాలని కోరినా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్థులు అంటున్నారు. 


19 ఏళ్లుగా చేతిపంపు నుంచి నీళ్లు 


ఛత్తీస్‌గడ్ రాష్ట్రం దంతెవాడ జిల్లా సుక్మా బ్లాక్‌లోని మరోకి గ్రామంలో ఓ చిత్రమైన చేతి పంపు ఉంది. సుమారు 19 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో బోర్ వేయడానికి వచ్చిన వాళ్లు నీటి కోసం తవ్వకాలు చేపట్టారు. ఆ సమయంలో 10 అడుగుల లోతులోనే నీరు పడటంతో చేతిపంపు ఏర్పాటు చేసి వెళ్లిపోయారు. గ్రామంలో సుమారు రెండు వందల కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ పంపు నుంచి ఎవరూ కొట్టకుండానే నీరు రావడం విశేషమని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే గ్రామంలో వేసిన ఈ పంపు స్థానంలో పాతాళగంగ ఉందా అన్నట్లుగా ఏడాది పొడవునా తాగునీరు వస్తూనే ఉంటుందట. 


రెండు వందల కుటుంబాలకు ఆధారం


సీజన్‌తో సంబంధం లేకుండా వేసవిలో కూడా మరోకి గ్రామంలో రెండు వందల కుటుంబాల దాహార్తిని తీరుస్తోంది పంపు.  మంచి నీరు కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసంరం లేకుండా ఈ బోర్‌ నీటిని గ్రామస్తులు వినియోగిస్తున్నారు. చేతిపంపు కొట్టాల్సిన అవసరం లేకుండా నీరు వస్తాయని గొప్పగా చెబుతున్నారు. నీరు పుష్కలంగా ఉండే ప్రాంతాల్లోనే వేసవి కాలం వచ్చిందంటే తాగునీటి సమస్య ఉంటుంది. చాలా చోట్ల  ట్యాంకులతో నీటిని తెప్పించుకుంటారు. మరోకి గ్రామంలో మాత్రం 19 ఏళ్లుగా అలాంటి అవసరం లేకుండా చేతిపంపు గ్రామస్తుల దాహం తీరుస్తుంది.