Solar Eclipse  : అక్టోబర్ 25 ఆకాశంలో అద్భుతం ఘట్టం కనిపించనుంది అదే సూర్యగ్రహణం. ఈ ఏడాదిలో సంభవించే చివరి సూర్యగ్రహణం ఇదే.  ఇది కూడా పాక్షిక సూర్యగ్రహణమే. గ్రహణం పీక్స్ లో ఉన్నప్పుడు సూర్యుడు 82 శాతం కనిపించడు. ఈ సారి సూర్యగ్రహణం ఐస్ ల్యాండ్ నుంచి ఇండియా దాకా చాలా దేశాల్లో కనిపిస్తుంది.  అంటే యూరోప్, నార్త్ ఆఫ్రికా, వెస్ట్రన్ ఏసియా, నార్త్ అట్లాంటిక్ ఓషన్, నార్త్ ఇండియన్ ఓషన్ ప్రాంతాల్లో గ్రహణం కనిపిస్తుందన్న మాట.  భారతకాలమానం ప్రకారం మనకు మధ్యాహ్నం 02.28 టైం లో ఐస్ ల్యాండ్ లో సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి ఇండియాలో సాయంత్రం 04.16 నుంచి సాయంత్రం 06.32 వరకూ కనిపిస్తుంది.



భారత్ లో కనిపిస్తుందా? 


మన దేశంలో మనం నివసిస్తున్న ప్రాంతాలను బట్టి సూర్యగ్రహణం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే మన దేశంలో 2 నుంచి 55శాతం వరకూ సూర్యగ్రహణం కనిపిస్తుంది. జమ్ము కశ్మీర్ ప్రాంతంలో 53 శాతం సూర్యుడని చంద్రుడు కప్పేస్తాడు. ద్వారక లో 33శాతం, గౌహతిలో 30 శాతం, కన్యాకుమారిలో 2శాతం మాత్రమే సూర్యగ్రహణం కనిపిస్తుంది. మన భూమి తిరుగుతున్న కోణం, భూమిపై మనం ఉన్న ప్రాంతం..అలాగే సూర్యుడు, చంద్రుడు తమ కక్ష్యల్లో ఉన్న ప్రాంతాల కారణంగా ఇలా ఎక్కువగా తక్కువగా కనపడటం అనేది జరుగుతుంది.
 
తెలుగు రాష్ట్రాల్లో ఎలా? 


తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 4.50 నుంచి 5.10 మధ్య సూర్యగ్రహణం ప్రారంభం అవుతుంది. సూర్యస్తమయం అంటే 6.32 వరకూ గ్రహణం ఉంటుంది చూడొచ్చు. భూమిపై మన తెలుగు రాష్ట్రాల లొకేషన్ ఫలితంగా 16 నుంచి 19 శాతం మాత్రమే సూర్యుడికి చంద్రుడు అడ్డువస్తాడు. 


అసలేంటీ సూర్యగ్రహణం? 


సూర్యగ్రహణం ఎలా సంభవిస్తుంది అని కల్చరల్ గా వేర్వేరు దేశాల్లో వేరు వేరు కథలు ఉంటాయి. మతాలు, ఆచారాలు, సంప్రదాయాల ఆధారంగా  గ్రహణం పట్టడానికి కారణాలు ఇవి అని చాలా థియరీలు ఉంటాయి. కానీ సైంటిఫిక్ గా ఆలోచిస్తే...సూర్యగ్రహణం ఏర్పడటం అనేది ఖగోళంలో ఏర్పడే ఓ అందమైన ప్రక్రియ. మనం నివసిస్తున్న భూమికి, మన నక్షత్రమైన సూర్యుడికి మధ్యలో చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. చంద్రుడు ఎప్పుడూ కూడా ఒక్క వైపే మనకు కనిపిస్తాడు. రెండో వైపు కనిపించడు. ఎందుకంటే చంద్రుడి రెండో వైపు సూర్యుడి వెలుతురు పడదు కాబట్టి. చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. సూర్యుడి వెలుతురు పడకపోవటం వల్ల మనకు చంద్రుడి విషయంలో పౌర్ణమి, అమావాస్యలు వచ్చాయి. బాగా బ్రైట్ గా ఉన్నప్పుడు పౌర్ణమి ఫుల్ మూన్ అంటారు. కనపడనప్పుడు అమావాస్య న్యూ మూన్ అంటారు. ఇప్పుడు చంద్రుడు కనపడని న్యూమూన్ టైం లో సూర్యుడిగా అడ్డుగా రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు మనకు చంద్రుడు కనపడడు అదే సమయంలో సూర్యుడికి అడ్డుగా రావటం వల్ల సూర్యుడు కూడా కనపడడు. అదే సూర్యగ్రహణం. అయితే లైన్ ఎలైన్ మెంట్స్ ఉంటాయి. కంప్లీట్ గా చంద్రుడు అడ్డు వచ్చాడనుకోండి సంపూర్ణ సూర్యగ్రహణం..కొంచమే అడ్డొచ్చాడు అనుకోండి పాక్షిక సూర్యగ్రహణాలు ఏర్పడతాయి. అంతే. ఇందులో ఇంకేం మాయా లేదు మంత్రం లేదు.


గ్రహణాలు మనం చూడొచ్చా? 


భయం లేకుండా చూడొచ్చు. అయితే సూర్య గ్రహణాన్ని చూసే విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఎందుకంటే సూర్యుడు నుంచి అతినీల లోహిత కిరణాలు వస్తుంటాయి. ఆ కిరణాలు తీక్షత ఇలా చంద్రుడు అడ్డొచ్చిన టైం లో ఎక్కువగా ఉంటుంది. కనుక కంటి పొరలకు ఇబ్బంది ఏర్పడుతుంది. రెటీనా దెబ్బతిని కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే నేరుగా కళ్లతో చూడకూడదు. కానీ గ్రహణాన్ని చూసేందుకు చాలా మార్గాలున్నాయి. ISO ధృవీకరించిన సన్ ఫిల్మ్స్ గ్లాసెస్ మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి. స్టాండర్డ్స్ ఉన్న బైనాక్యులర్స్, బ్లాక్ ఫిల్మ్ ప్లేట్లతో సూర్యగ్రహణాన్ని వీక్షించవచ్చు. గ్రహణం ఎలా ఏర్పడుతుందో ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవచ్చు.