Kerala CM: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ఆరిఫ్.. ఆర్‌ఎస్‌ఎస్ చేతిలో కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని విజయన్ విమర్శించారు. కేరళలో 9 యూనివర్సిటీలకు చెందిన వీసీలు తక్షణమే రాజీనామా చేయాలంటూ గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను విజయన్ తప్పుబట్టారు.
అంతకుముందు, మంత్రి బిందు కూడా గవర్నర్ ఆదేశాలపై స్పందించారు. ఇది "దురదృష్టకర పరిస్థితి" అని పేర్కొన్నారు. తొమ్మిది మంది వీసీలను వైదొలగాలని ఆదేశించిన గవర్నర్ చర్యను ఖండించారు.
గవర్నర్
యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్‌లర్ల నియామకంలో కేరళ ప్రభుత్వం నిబంధనలు పాటించలేదంటూ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆరోపించారు. రాష్ట్రంలోని 9 యూనివర్సిటీల వీసీలు రాజీనామా చేయాలని ఆదివారం ఆదేశించారు. సోమవారం ఉదయం 11:30 గంటల లోపల వీసీల రాజీనామాలు తన ముందు ఉండాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
హైకోర్టుకు
దీనిపై ఆ 9 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్‌లు కేరళ హైకోర్టును సోమవారం ఆశ్రయించారు. గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌లు వేశారు. వారి పిటిషన్‌లను స్వీకరించిన హైకోర్టు ప్రత్యేక సిట్టింగ్ ద్వారా విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.
యూజీసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఏపీజే అబ్దుల్ కలాం టెక్నొలాజికల్ యూనివర్శిటీకి చెందిన వీసీల నియామకాన్ని రద్దు చేస్తూ ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దీని ఆధారంగానే రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల రాజీనామాలను గవర్నర్ డిమాండ్ చేశారు.
Also Read: Love in War: రణంలో ప్రణయం- ఇది యుద్ధంతో రాసిన ప్రేమ కథ!