Krishna News : కృష్ణా జిల్లాలో బాలికపై అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాలిక అప్పటికే గర్బం దాల్చటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉయ్యూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 16 సంవత్సరాల బాలిక చదువు మానేసి ఇంట్లోనే ఉంటుంది. తోట్ల వల్లూరు మండలంలోని ఓ గ్రామంలో ఉన్న బాలిక నానమ్మ ఇంటికి తరచూ వచ్చి రెండు, మూడు రోజులుండి వెళ్తూ ఉంటుంది.  తోట్లవల్లూరు మండలంలోని అదే గ్రామానికి చెందిన 19 సంవత్సరాల ఇంటర్ విద్యార్థి బాలికతో పరిచయం పెంచుకున్నాడు. బాలిక నానమ్మకు దృష్టి, వినికిడి లోపం ఉండడంతో రాత్రి సమయంలో తమ ఇంట్లో ఇద్దరూ ఉండేవారు. ఇటీవల బాలిక శరీరంలో వచ్చిన మార్పులు గమనించిన తల్లిదండ్రులు పరీక్షలు చేయించగా గర్భం దాల్చిన విషయం వెలుగు చూసింది. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.


పోక్సో కేసు 


తల్లిదండ్రులు బాలికను నిలదీయగా జరిగిన విషయం చెప్పింది. దీంతో  బాలికను తీసుకొని మచిలీపట్నంలోని దిశ పోలీస్ట్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదే రోజు అర్ధరాత్రి ఇంటర్ విద్యార్థి బాలికను తీసుకొని పరారయ్యాడు. తల్లిదండ్రులు ఎంత గాలించినా బాలిక ఆచూకీ లభించకపోవడంతో కిడ్నాప్ చేశారంటూ ఉయ్యూరు  పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు ఆ బాలికను తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలి వెళ్లిపోయారు. వెంటనే తల్లిదండ్రులు బాలికను స్టేషన్ కు తీసుకెళ్లి విద్యార్థిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కిడ్నాప్, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో  ఇద్దరూ మైనర్లు కావటంతో పోలీసులు సైతం కేసు నమోదుకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తోట్లవల్లూరు మండలంలోని  ఒక గ్రామాన్ని డీఎస్పీ జి.రాజీవ్ కుమార్, సీఐ టీవీ నరేష్, ఉయ్యూరు గ్రామీణ ఎస్ఐ రమేష్, తోట్లవల్లూరు ఇన్ఛార్జి ఎస్ఐ సీహెచ్ అవినాష్ ఘటన స్థలాన్ని పరిశీలించి, స్థానికుల నుంచి వివరాలు సేకరించారు.


స్నేహితుడితో వెళ్తోన్న యువతిపై లైంగిక దాడి 


మహిళలపై దాడులు, అత్యాచారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలకు వెనుకాడేది లేదని  కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా హెచ్చరించారు. గన్నవరం ముస్తాబాద్​ వద్ద స్నేహితునితో కలిసి వెళ్తోన్న యువతిపై అత్యాచారానికి యత్నించిన ఇద్దరిని అరెస్టు చేశామని ఆయన తెలిపారు. యువతిపై అత్యాచారానికి యత్నించిన ఇద్దరు యువకులను గంటల వ్యవధిలోనే అరెస్టు చేసినట్లు ఎస్పీ జాషువా తెలిపారు. బాధిత యువతి, ఆమె స్నేహితుడు విజయవాడలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు.  వారు మరో స్నేహితుడి ఇంటికి వెళ్తుండగా గన్నవరం ముస్తాబాద్​ వద్ద ఇద్దరు యువకులు ఆటోలో వచ్చి ఆమెపై అత్యాచారానికి యత్నించారని ఎస్పీ తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో గన్నవరం పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి బాధిత యువతిని రక్షించారని వివరించారు. ఘటన జరిగిన గంటల వ్యవధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల్ని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అయితే ఈ ఘటనలో నిందితులుగా ఉన్న వారిపై రౌడీషీట్ ఉందని ఎస్పీ వెల్లడించారు. 


సవారిగూడెం-ముస్తాబాద్ రోడ్డులో ఔట్ పోస్టు 


నిందితులపై ఛార్జ్ షీట్ దాఖలు చేసి బాదితురాలికి న్యాయం చేస్తామని ఎస్పీ చెప్పారు. సవారిగూడెం - ముస్తాబాద్ రోడ్డు వెంబడి తరుచూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ఔట్ పోస్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. రాత్రి పూట ఆ ప్రాంతంలో ఏఆర్​ బృందాలు, గస్తీ బృందాలతో నిరంతరం గస్తీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వారం రోజుల క్రితం కీసరపల్లి వద్ద మైనర్ బాలికపై జరిగిన అత్యాచారయత్నం ఘటనలో, ముస్తాబాద్​ వద్ద యువతిపై జరిగిన అత్యాచారయత్నం ఘటనలో సకాలంలో స్పందించి పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానిక యువతను ఎస్పీ జాషువా అభినందించారు.