ఏపీలో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ నేతలు తిరుగుబాటు బాట పడుతున్నారు. సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యేలపై విమర్శలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై స్థానిక నాయకులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. కార్యకర్తలను పట్టించుకోవడంలేదని, స్థానిక నాయకుల వద్ద కూడా లంచాలు వసూలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అంగన్వాడీ టీచర్ పోస్ట్ ల నుంచి ఆయా పోస్ట్ ల వరకు అన్నింటినీ అమ్మేసుకుంటున్నారని, 8 మండలాల్లో దళారీలను పెట్టుకుని దందా చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నిర్ణయాన్ని స్థానిక నాయకులంతా వ్యతిరేకించారు. దీంతో ఆయన కొంతమందిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన బీఫారంలు ఇచ్చినవారిని కాదని, ఎంపీటీసీలంతా తమ నిర్ణయం ప్రకారం ఎంపీపీలను ఎన్నుకున్నారు. వింజమూరులో వైసీపీ ఎంపీటీసీలకు క్లియర్ మెజార్టీ ఉన్నా కూడా స్వతంత్ర అభ్యర్థిని ఎంపీపీగా ఎన్నుకున్నారు. దీనిపై అప్పట్లోనే చాలా ఆరోపణలు వచ్చాయి.


Also Read: జగన్ ప్రభుత్వంపై డీఎల్ విమర్శలు ! గుర్తించలేదనే అసంతృప్తే కారణమా ?


ఎమ్మెల్యేపై తిరుగుబాటు


తాజాగా స్థానిక నాయకులు ఏకంగా ఎమ్మెల్యేపై తిరుగుబాటు చేస్తూ ప్రెస్ మీట్ పెట్టి ఆయనపై అవినీతి ఆరోపణలు చేశారు. స్థానిక వైసీపీ నేత చేజర్ల సుబ్బారెడ్డి మరికొందర్ని వెంటబెట్టుకుని ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేపై సొంత వర్గమే ఇలా తిరుగుబాటు చేయడం నెల్లూరు జిల్లాలో కలకలం రేపింది. పార్టీ బాగుపడాలంటే జగన్ రెండోసారి సీఎం కావాలంటే తమ ఎమ్మెల్యేని తొలగించాలని ఆయనకి మరోసారి టికెట్ ఇవ్వకూడదని డిమాండ్ చేస్తున్నారు నేతలు.


Also Read: గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సందర్శించిన సీఎం జగన్


వైసీపీ ప్రభుత్వంపై డీఎల్ రవీంద్ర విమర్శలు


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై సొంత పార్టీ నేతల అసంతృప్తి గళాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎంపీ  రఘురామకృష్ణరాజు వంటి వారు రెబల్‌గా మారగా మరికొంత మంది నేరుగా మీడియా ముందు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ పనితీరు దారుణంగా ఉందన్నారు. అన్ని శాఖల్లో వేలు పెడుతున్న సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీరుపైనా మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగతున్న అక్రమాలపై పాలకులను మీడియా ప్రశ్నించాలని.. ప్రశ్నించుకుంటే అధోగతి పాలవుతుందని హెచ్చరించారు. భూములు ఆక్రమించుకోవడం ఖజానా నింపుకోవడమే పాలకుల పనిగా మారిందన్నారు. రాష్ట్ర పరిస్థితి, భావితరాల గురించి ఎవరు ఆలోచన చేయడం లేదున్నారు.  రాష్ట్రంలో మంత్రులు డమ్మీలుగా మారిపోయారు. రాష్ట్రంలో ఏ శాఖ మంత్రి ఆ శాఖకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం లేదని, దారినపోయే వారంతా మీడియా సమావేశాలు పెడుతున్నారంటూ పరోక్షంగా సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై విమర్శలు గుప్పించారు. 


Also Read: కరెంటు పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష... విద్యుత్ కొరత రాకుండా అత్యవసర ప్రణాళికలు చేపట్టాలని ఆదేశాలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి