"అప్పుడెంతో గౌరవంగా ఉండేదండి మా వృత్తి. షెడ్డులో ఓ చోట కూర్చుని కటౌట్లకు రంగులద్దేవాళ్లం. ఇదిగో ఇప్పుడిలా రోడ్ల పక్కన ఉండి గోడలకు రంగులేసుకోవాల్సి వస్తోంది." ఇదీ ఆర్టిస్ట్ నాగేశ్వరరావు ఆవేదన. 1972లో ఆయన ఈ ఫీల్డ్ లోకి వచ్చారు. అప్పటినుంచి సినిమా కటౌట్లకు పెయింటింగ్ లు వేసేవారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ.. ఇలా మొదలు పెడితే.. ఇటీవల నాగార్జున సినిమా కటౌట్ కి కూడా పెయింటింగ్ లు వేశామని, ఆ తర్వాత ఆ పని పూర్తిగా ఆగిపోయిందని చెబుతున్నారు. 



అప్పట్లో అన్నింటికీ కటౌట్లే.. 
ఇప్పుడంటే ఫ్లెక్సీలు వచ్చి చిన్నా పెద్దా ప్రతి ఒక్కరూ, పుట్టినరోజు, వేడుకలు అన్నింటికీ బయట ఓ ఫ్లెక్సీ తగిలించేస్తున్నారు. కానీ అప్పట్లో ఈ టెక్నాలజీ లేదు. ప్రచారం కోసం కేవలం కటౌట్లను వాడేవారు. వాటికి రంగులద్దారంటే రోజుల పని, అందంగా అచ్చుగుద్దినట్టు ఆ రూపాన్ని తీర్చి దిద్దాలి. ఎక్కడ ఏ లోపం ఉన్నా వెంటనే కనిపెట్టేస్తారు జనం. అందుకే గురువుల వద్ద శిష్యరికం చేసి మరీ ఆ వృత్తిని ఎంచుకున్నారు చిత్రకారులు. 



నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న అండర్ బ్రిడ్జి వద్ద ప్రస్తుతం నాగేశ్వరరావు, శివకుమార్ లు ఇద్దరూ అద్భుతమైన వాల్ పెయింటింగ్స్ వేస్తున్నారు. చిన్న పిల్లల బోసి నవ్వులు, ముసలి అవ్వల ముదిమి ముచ్చట్లు.. ఒకటేంటి.. అన్నింటికీ ఆ గోడలపై రూపాన్నిస్తున్నారు. దాదాపు రెండు వారాలపాటు కష్టపడి అండర్ బ్రిడ్జి వద్ద అద్భుతమైన చిత్రాల్ని గీశారు. 


విజయవాడ నుంచే అందరూ.. 
అప్పట్లో విజయవాడ కేంద్రంగా సినిమాల పబ్లిసిటీ జరిగేది. పబ్లిసిటీ డిజైనర్లు కటౌట్లు రూపొందించే కాంట్రాక్ట్ లు పొందేవారు. విజయవాడలో పెద్ద పెద్ద షెడ్లు వీటికోసం సిద్ధంగా ఉండేవి. అక్కడ వందలాదిమంది కళాకారులు చెక్కలపై హీరో, హీరోయిన్ల పెయింటింగ్స్ వేసేవారు. ఎన్నికల సమయాల్లో రాజకీయ నాయకుల కటౌట్లకు విపరీతమైన డిమాండ్ ఉండేది. అలా విజయవాడలో ఈ పబ్లిసిటీ వ్యవహారం మూడు పువ్వులు, ఆరు కాయల్లా సాగేది. కానీ రాను రాను ఫ్లెక్సీల ప్రభావం పెరిగిన తర్వాత కటౌట్లు, ఇతర పెయింటింగ్ వర్క్స్ కి డిమాండ్ తగ్గిపోయింది. ఎవరో ఒకరు, ఎపుడో అపుడు అన్నట్టుగా ఇలా కాంట్రాక్ట్ పనులకు పిలిస్తే.. విజయవాడనుంచి వచ్చి తాము పెయింటింగ్స్ వేసి వెళ్తుంటామని చెబుతున్నారు. 


Also Read: ఏపీలో కరోనా కల్లోలం... ఒక్క రోజే 12 వేలకు పైగా కేసులు, 5 గురి మృతి



ఒకరకంగా ఇదీ మంచిదే..
గతంలో ఎక్కడో షెడ్డులో కూర్చుని పెయింటింగ్స్ వేస్తుంటే తామెవరో బాహ్య ప్రపంచానికి తెలిసేది కాదని, ఇప్పుడిలా గోడలపై చిత్రాలు గీస్తుంటే తమకి అదో మంచి సంతృప్తిని మిగుల్చుతోందని, అందరూ తమని ఆసక్తిగా గమనిస్తున్నారని, తమ మంచి చెడ్డలు అడిగి తెలుసుకుంటున్నారని చెబుతున్నారు. 


Also Read: పీఆర్సీ జీవోలను వెంటనే రద్దు చేయాలి... ఏపీ సర్కార్ ఎనిమి గవర్నమెంట్ ... సోము వీర్రాజు కామెంట్స్



ప్రభుత్వ సాయం ఏమేరకు.. 
ఉపాధి లేకపోతే ప్రభుత్వం నిందలేస్తుంటారు చాలా మంది. కానీ ఈ ఆర్టిస్ట్ లు అలా అనట్లేదు. కంటెంట్ ఉన్నోడికి పని వెదుక్కుంటూ వస్తుందని, చాలామంది వృత్తి విడిచి వెళ్లిపోయినా, తామింకా దీన్ని నమ్ముకుని ఉన్నామని చెబుతున్నారు. ప్రభుత్వం తమకు పని చూపిస్తే అంతకంటే మహద్భాగ్యం ఇంకేముంటుందని అంటున్నారు. 


చూడండి ఈ చిత్రాలు. ఒకదానికొకటి ఏమాత్రం పొంతన లేదు, అన్నీ వేటికవే విభిన్నంగా ఉన్నాయి. జీవకళ ఉట్టిపడేలా ఉన్నాయి. కంప్యూటర్ లో పేర్లు టైప్ చేసి, ఫొటోలు డౌన్ లోడ్ చేసి ఫ్లెక్సీ ప్రింట్ చేయడం సులువే. కానీ ఇలా బొమ్మలు గీసి, అందరితో శెహభాష్ అనిపించుకోవడం చాలా కష్టం. 


Also Read: ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ బిగ్ షాక్! డిమాండ్లు పట్టించుకోకుండానే వరుస జీవోలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.