సీఎం జగన్ తో సమావేశంలో ఉద్యోగులు పీఆర్సీకి అంగీకరించి ఇప్పుడు మళ్లీ ఆందోళన దిగడం సరికాదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. పీఆర్సీపై ఇబ్బందులు ఉంటే ప్రభుత్వంతో మాట్లాడవచ్చన్నారు. పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగుల నిరసనలు, కోవిడ్‌ నేపథ్యంలో పాఠశాలల నిర్వహణపై మంత్రి సురేశ్ స్పందించారు. రాష్ట్రంలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్నా తీవ్రత మాత్రం అంతగా లేదన్నారు. పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని స్పష్టంచేశారు. పిల్లలకు కరోనా సోకితే ఆ పాఠశాలను మూసివేసి శానిటేషన్ చేసి తిరిగి ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో కొన్ని విశ్వవిద్యాలయాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయని మంత్రి సురేశ్ గుర్తుచేశారు. హైకోర్టు కూడా పరీక్షలకు అనుమతి ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందించేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అన్నారు. భవిష్యత్తులో ఆన్‌లైన్‌ విధానం తప్పనిసరి అన్నారు. ఆన్‌లైన్‌ కోర్సులకు రానున్న కాలంలో డిమాండ్‌ మరింత పెరుగుతుందన్నారు. గుంటూరు వడ్లమూడిలోని విజ్ఞాన్‌ యూనివర్సిటీలో మంత్రి సురేశ్‌ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ప్రారంభించారు. 



(కాకినాడలో ఉపాధ్యాయ సంఘాల ఆందోళన)


Also Read: ఉద్యోగుల ఉద్యమం లైట్.. ఏపీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు.. బిల్లులు రెడీ చేయాలని ట్రెజరీలకు ప్రభుత్వం ఆదేశాలు !


ఆ వ్యక్తుల ట్రాప్ లో పడొద్దు : శ్రీకాంత్ రెడ్డి


రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అందరూ అర్థం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు నష్టం చేయాలని ప్రభుత్వం ఉద్దేశంకాదన్నారు. కచ్చితంగా ఉద్యోగులతో చర్చలు జరుపుతామన్నారు. ప్రభుత్వం ఎప్పుడూ మొండిగా వెళ్లదన్నారు. కొందరి మాటలు విని ప్రభుత్వంపై బురద చల్లవద్దని హితవు పలికారు. కరోనా సమయంలోనూ ప్రభుత్వంపై ఎంతో భారం పడిందన్నారు. ఉద్యోగులు ఆవేశాలకు లోనుకావద్దన్నారు. ఏ రాష్ట్రంలోనైనా 27 శాతం ఐఆర్‌ఎ ఇచ్చారా అని ప్రశ్నించారు. అందరికీ మంచి చేయాలని ఆలోచించే ప్రభుత్వం త‌మ‌ద‌ని తెలిపారు. ప్రభుత్వాన్ని అస్థిర పర్చాలని కొందరు కుట్రలు చేస్తున్నారన్నారు. ఉద్యోగులను ద్వేషించిన వ్యక్తుల ట్రాప్‌లో పడొద్దన్నారు. పది వేల కోట్ల భారం పడుతున్నా పీఆర్సీ అమలుకు సీఎం వైఎస్‌ జగన్‌ వెనుకాడలేదని శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు.


Also Read:  సమ్మెలోకి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు.. 21న సీఎస్‌కు నోటీసు !


ఉపాధ్యాయ సంఘాల ఆందోళన


ఏపీ ప్రభుత్వం పీఆర్సీపై విడుదల చేసిన జీవోలను రద్దుచేయాలని నిరసనగా ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి. రాష్ట్రం వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముట్టడికి ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాఫ్టో) పిలుపునిచ్చింది.  ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీని వ్యతిరేకించడంతో పాటు మూడు జీవోలు తక్షణమే రద్దు చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఉపాధ్యాయులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ఉపాధ్యాయుల అరెస్టులతో పోలీసులు స్టేషన్లు నిండిపోతున్నాయి. జీవోలు రద్దు చేసే వరకు తమ ఆందోళన విమరించమని ఉద్యోగులు తేల్చిచెబుతున్నారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం తగ్గేదేలే అంటుంది. జనవరి నెల జీతాలను కొత్త పీఆర్సీ ప్రకారం చెల్లించాలని ట్రెజరీకి ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది.  


Also Read: కరోనాతో ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది.. కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గవు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.