మాతృదేవోభ‌వ‌, పితృదేవోభ‌వ‌, ఆచార్యదేవోభవ అంటారు. తల్లిదండ్రుల తర్వాత అంతటి ప్రాధాన్యత గురువుకి ఇచ్చింది భారతీయ సమాజం. పూర్వకాలంలో గురువు ఆశ్రమంలో శిష్యరికం చేసి విద్యాభాస్యం చేసేవారు. గురువు పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉండి విద్యనభ్యసించేవారు. ఆధునిక కాలంలో ఆశ్రమాల స్థానంలో పాఠశాలలు వచ్చాయి. గురువు స్థానం భారతీయ సమాజంలో వెలకట్టలేనిది. ఆధునిక కాలంలో గురువు అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు మాజీ రాష్ట్రపతి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌. సెప్టెంబర్ 5 ఆయన పుట్టినరోజును జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తారు. 


సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను స్మరించుకుంటూ సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. దేశాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉందని స్పష్టంగా చెప్పిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్. విద్యపై అపారమైన నమ్మకం కలిగిన డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ స్వయంగా అధ్యాపకుడు, దౌత్యవేత్త, పండితుడు, అలాగే రెండుసార్లు భారత రాష్ట్రపతిగా సేవలందించారు. ఆయన తెలుగువారు కావడం మనకు గర్వకారణం.


డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తిరుత్తణి గ్రామంలో 1888 సెప్టెంబరు 5న జన్మించారు. సాధారణ తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయన విద్యాభ్యాసం కోసం అనేక కష్టాలు పడ్డారు.  సర్వేపల్లికి చదువుకోవడానికి కనీసం పుస్తకాలు కూడా ఉండేవి కావు. పుస్తకాలు ఉన్న వ్యక్తుల వద్దకు వెళ్లి చదువుకునేవారు. తత్వశాస్త్రంపై మక్కువతో మాస్టర్స్ డిగ్రీలో ‘ది ఎథిక్స్ ఆఫ్ వేదాంత’ను థీసిస్‌గా ఎంపిక చేసుకుని 20వ ఏటనే థీసిస్ సమర్పించిన గొప్ప ప్రతిభాశాలి. 21 ఏళ్లకే మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో లెక్చరర్‌గా చేరిన రాధాకృష్ణన్ మైసూరు విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర విభాగం ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆ తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనూ విధులు నిర్వహించారు.


రాధాకృష్ణన్‌ ఐదేళ్ల వయస్సులోనే తిరుత్తణిలో పాఠశాల విద్యాభ్యాసం ప్రారంభించారు. అనంతరం తిరుపతిలోని లూథరన్‌ మిషన్‌ హైస్కూ ల్‌లో సెకండరీ ఎడ్యుకేషన్‌ను అభ్యసించారు.  ఆ తర్వాత వేలూరులోని వర్గీస్‌ కాలేజీలో ప్రీ బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ రెండేళ్ల కోర్సు పూర్తిచేశారు. అనంతరం ఎఫ్‌ఏలో చేరారు. ఆ కోర్సును అభ్యసిస్తున్నప్పుడే పదిహేనేళ్ల వయస్సులోనే  శివకమ్మతో వివాహం జరిగింది. అనంతరం మద్రాసు క్రిస్టియన్‌ కళాశాలలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ కోర్సును పూర్తిచేసి 21 ఏళ్లకే మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో అధ్యాపకుడిగా చేరారు. 


తెలుగు ప్రాంతంతో అనుబంధం


సర్వేపల్లి రాధాకృష్ణ విద్యాభ్యాసం, ఉద్యోగాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో ముడిపడి ఉంది. ఆయన బందరులో అధ్యాపకులుగా బాధ్యతలు నిర్వర్తించారు. 1931లో డా. సి.ఆర్.రెడ్డి తర్వాత రాధాకృష్ణన్  ఆంధ్రవిశ్వవిద్యాలయం వైస్ ఛాన్సిలర్‌గా పనిచేశారు. అప్పట్లో డా. రాధాకృష్ణన్‌ పిలుపుననుసరించి ప్రొఫెసర్ హిరేన్ ముఖర్జీ, హుమయూన్ కబీర్ వంటి మేధావులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లుగా పనిచేశారు.


సర్వేపల్లి రాధాకృష్ణన్‌ తన పెద్ద కుమార్తె పద్మావతిని వీఆర్‌ కళాశాల కమిటీ సభ్యుడిగా ఉన్న మోదవోలు చెంగయ్య పంతులు కుమారుడు మోదవోలు శేషాచలపతికి ఇచ్చి వివాహం చేశారు. ఆయనకు ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు, ఆయన బంధువులు ఇప్పటికీ నెల్లూరు, కందుకూరు, మద్రాసు తదితర ప్రాంతాల్లో ఉన్నారు. రాధాకృష్ణన్‌ మేనత్త నెల్లూరులో ఉన్న టౌన్ హాల్ వీధిలో నివాసం ఉండేవారు. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన మాజీ ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్‌రెడ్డిని ఒక వేదికపై సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అభినందించారు. ఈ సందర్భంగా ఒక చిత్రకారుడి చేతిలో రూపుదిద్దుకున్న తన చిత్రం వద్ద తెలుగులో సర్వేపల్లి రాధాకృష్ణయ్య అంటూ సంతకం చేసి మాతృభాషపై తనకున్న మమకారాన్ని చాటుకున్నారు.  


సర్వేపల్లి రాధాకృష్ణన్‌ రాష్ట్రపతి హోదాలో సర్వేపల్లిలోని కోనేరును అభివృద్ధి చేయించారు. సర్వేపల్లి సుబ్బారావు కోనేరు దుస్థితిపై రాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు లేఖ రాశారు. ఆ లేఖపై స్పందించిన ఆయన నాడు వెంకటాచలం సమితి అధికారులకు తక్షణమే కోనేరు బాగు చేయించాలని  సూచించారు. దీంతో నాడు అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులపై కోనేరు బాగు చేయించి ఆ సమాచారం రాష్ట్రపతికి నివేదించారు. సర్వేపల్లి నుంచి దేశ ఉన్నత పదవిని అధిష్టించిన రాధాకృష్ణన్‌ విగ్రహాన్ని సర్వేపల్లిలో ప్రతిష్టించి ఆ మహనీయుడికి ఘననివాళి అర్పించాలి. 


Also Read: Krishna Nagar Wins Gold: భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి పోరులో విజయం సాధించిన కృష్ణ నాగర్