టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. శక్తి వంచన లేకుండా పతకాల కోసం పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ కృష్ణ నాగర్ నేడు జరిగిన పురుషుల సింగిల్స్ ఎస్‌హెచ్6 ఫైనల్లో హాంకాంగ్ ప్లేయర్ మన్ కై చుపై విజయం సాధించాడు. స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని యావత్ భారతావని గర్వించేలా చేశాడు.
అయితే తొలి గేమ్‌ను 21-17తో నాగర్ ముగించాడు. రెండో గేమ్ లో ప్రత్యర్థి, హాంకాంగ్ ఆటగాడు 21-16తో నెగ్గి మ్యాచ్ టై చేశాడు. నిర్ణయాత్మక మూడో గేమ్ ను 21-15ను నెగ్గడంతో పాటు మ్యాచ్‌లో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దాంతో పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 19కి చేరింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో నాగర్ పట్టు వదలకుండా పాయింట్లు సాధించాడు. స్వర్ణమే లక్ష్యంగా పాయింట్లు సాధిస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేసి విజయం సాధించాడు. రెండో గేమ్ లో చేసిన పొరపాట్లను రిపీట్ చేయకుండా ఎదురుదాడికి దిగడంతో విజయం వరించింది.
Also Read: Suhas Yathiraj Wins Silver: భారత్ ఖాతాలో మరో పతకం.. రజతం సాధించిన సుహాస్ యతిరాజ్
జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 19కి చేరింది. అందులో 5 స్వర్ణాలుండగా.. 8 రజతాలు, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. పారాలింపిక్స్‌లో భారత్ తరఫున స్వర్ణం నెగ్గిన తొలి మహిళా అథ్లెట్ అవని లేఖరా నేటి ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా వ్యవహరించనున్నారు.
పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత ఆటగాడు కృష్ణ నాగర్‌ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్, ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ట్విట్టర్ వేదికగా ప్రశంసల జల్లులు కురిపించారు.
భారతీయుల ముఖాల్లో చిరునవ్వును తీసుకొచ్చావంటూ ప్రధాని మోదీ కొనియాడారు. స్వర్ణం నెగ్గినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరెన్నో మైలురాళ్లు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.