టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఆదివారం ఉదయం భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. బ్యాడ్మింటన్ ప్లేయర్ సుహాస్ యతిరాజ్ రజత పతకాన్ని సాధించాడు. నేటి ఉదయం జరిగిన బ్యాడ్మింటన్ ఎస్ఎల్ 4 విభాగం ఫైనల్లో ఫ్రాన్స్ షట్లర్ మజుర్ లుకాస్ చేతిలో 2-1 తేడాతో ఓటమి చెందడంతో స్వర్ణం చేజారింది. యతిరాజ్ సిల్వర్ మెడల్ తో కలిపితే భారత్ సాధించిన పతకాల సంఖ్య 18కి చేరింది.
పురుషుల సింగిల్స్ ఎస్ఎల్4 ఫైనల్ మ్యాచ్‌లో తొలుత భారత ఆటగాడు సుహాస్ యతిరాజ్ తన ప్రత్యర్థి మజుర్ లుకాస్ పై ఆధిపత్యం చెలాయించాడు. 1-0 తేడాతో ఆధిక్యంలో ఉన్న సుహాస్ అద్భుతంగా పోరాడినా.. ఒక్కసారిగా ఒత్తిడికి లోనుకావడంతో ప్రత్యర్థి పుంజుకున్నాడు. చివరికి స్వర్ణ పోరులో ఓటమి పాలయ్యాడు. రజత పతకం కైవసం చేసుకుని శభాష్ అనిపించుకున్నాడు. పారాలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి ఐఏఎస్ సుహాస్ ప్రదర్శనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
బ్యాడ్మింటన్ ప్లేయర్ సుహాస్ రజత పతకం నెగ్గడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. సేవలతో పాటు ఆటలోనూ అద్భుతమైన ప్రదర్వన చేసినందుకు గర్వంగా ఉందన్నారు. రజతం నెగ్గినందుకు అభినందించిన ప్రధాని మోదీ.. భవిష్యత్తులో సుహాస్ యతిరాజ్ మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్ ఇప్పటివరకూ 18 పతకాలు సాధించింది. ఇందులో 4 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. నేడు పారాలింపిక్స్ చివరిరోజు అని తెలిసిందే. పారాలింపిక్స్‌లో భారత్ తరఫున స్వర్ణం నెగ్గిన తొలి మహిళా అథ్లెట్ 19 ఏళ్ల అవని లేఖరా ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా వ్యవహరించనున్నారు.
Also Read: India Wins Gold: భారత్ ఖాతాలో మరో పసిడి.. సత్తా చాటిన మనీష్, రజతం గెల్చిన సింగ్‌రాజ్