AP Latest News: జూలై 16 నుంచి కనిపించకుండా పోయిన నరసాపురం ఎంపీడీవో వెంకట రమణారావు కథ విషాదాంతం అయింది. ఆయన మృతదేహాన్ని గుర్తించారు. వారం రోజులుగా అధికారులు వెంకట రమణారావు కోసం గాలింపు చేస్తూనే ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌లను రంగంలోకి దింపి వివిధ చోట్ల వెతికారు. తాజాగా మండవ వెంకట రమణారావు మృతదేహం ఏలూరు కాలువలో గుర్తించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు మధురానగర్ ఫ్లైఓవర్ పిల్లర్‌కు చిక్కుకున్నట్లుగా మృతదేహం కనిపించింది. ఆయన కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సరిగ్గా ఆయన కాలువలో దూకిన ప్రదేశానికి ఒక కిలోమీటర్ దూరంలో శవాన్ని గుర్తించారు.


నరసాపురం మండలంలో ఎంపీడీవోగా వెంకటరమణ పని చేస్తున్నారు. మిస్సింగ్ అయ్యే ముందు తాను చనిపోబోతున్నానని అర్థం వచ్చేలా వెంకట రమణారావు ఓ మెసేజ్ ను కుటుంబ సభ్యులకు పంపారు. ఆయన పెట్టిన మెసెజ్ ను చూసిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అలా సమాచారం అందుకున్న పోలీసులు.. వెంకటరమణ కోసం వెతకడం మొదలుపెట్టారు. వెంకట రమణారావు వద్ద ఉన్న సెల్ ఫోన్ సిగ్నల్ ను ట్రాక్ చేసి.. ఆయన ఆఖరుసారిగా గోదావరి కాలువ వద్ద ఉన్నట్లుగా కనిపించింది. దీంతో పోలీసులు ఆయన కాలువలో దూకి ఉంటారేమో అని భావించారు. ఆ కాలువ వెంట గాలింపు చర్యలు చేపట్టారు.


విజయవాడలో నివాసం
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో అయిన మండవ వెంకట రమణారావు విజయవాడలోని కానూరు మహదేవపురంలో నివాసం ఉంటున్నారు. ఈనెల 10 నుంచి 20వ తేదీ వరకు సెలవు పెట్టి విజయవాడకు వచ్చారు. అలా జూలై 15న తనకు పని ఉందని ఇంటి నుంచి బయలుదేరి మచిలీపట్నం వెళ్లారు. అర్ధరాత్రి తాను చనిపోతున్నానని, అందరూ జాగ్రత్త అంటూ మెసేజ్ పెట్టి సెల్ ఆఫ్ చేసేశారు. వెంకట రమణారావు ఇంటి నుంచి తీసుకొచ్చిన వాహనం మచిలీపట్నం రైల్వే స్టేషన్‌లో ఉన్నట్టుగా గుర్తించారు. వెంకటరమణారావు కనిపించకుండా పోవడానికి మాధవాయిపాలెం ఫెర్రీ రేవు పాటదారు రూ.54 లక్షల బకాయిలు ఉండడమే కారణమని చెబుతున్నారు.