Stock Market Collapses After Nirmala Sitharaman's Budget 2024 Speech: ఉదయం ఉత్సాహంగా ప్రయాణాన్ని మెుదలుపెట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు బడ్జెట్ ప్రకటన సమయంలో కొంత పెరిగాయి. అయితే ఆర్థిక మంత్రి ఆదాయపు పన్ను రెట్ల ప్రకటన, క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ రేట్ల పెంపు ప్రకటనల తర్వాత లాభాలు ఆవిరయ్యాయి.
దీంతో మధ్యాహ్నం 1 గంట సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 530 పాయింట్లకు పైగా నష్టాల్లోకి జారుకుంది. అలాగే మరో బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ 160 పాయింట్లకు పైగా కోల్పోయింది. వాస్తవానికి ఈ సారి మోదీ ప్రభుత్వం మిత్రపక్షాల సహకారంతో నడుస్తున్నందున ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని నిధుల కేటాయింపులను ప్రకటించింది. అలాగే ఇండస్ట్రీ వర్గాలు ఆశించిన స్థాయిలో పెద్ద ప్రకటనలు కనిపించకపోవటం సైతం మార్కెట్ల సెంటిమెంట్లను దెబ్బతీసిందని నిపుణులు చెబుతున్నారు.
నిఫ్టీ 50, సెన్సెక్స్ సూచీలు ఒక్కొక్కటి 1% పడిపోయి వరుసగా 24,225, 80,024 వద్ద ట్రేడవుతున్నాయి. ఇదే క్రమంలో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి కూడా రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయి 83.69 వద్ద ట్రేడింగ్ కొనసాగిసంతోంది.
నేడు స్టాక్ మార్కెట్లలో బడ్జెట్ ప్రకటన నిర్ణయాలకు అనుగుణంగా అనేక రంగాలకు చెందిన స్టాక్స్ ప్రభావితం అయ్యాయి. దీంతో లాభపడిన వాటని గమనిస్తే.. వ్యవసాయ రంగంలోని కావేరీ సీడ్స్, మంగళం సీడ్, ధనుకా అగ్రిటెక్ వంటి అగ్రికల్చర్ స్టాక్స్ 4.4% నుంచి 10.5% మధ్య పెరిగాయి. అలాగే ఫిషరీస్ రంగానికి చెందిన అవంతి ఫీడ్, కోస్టల్ కార్ప్ స్టాక్స్ వరుసగా 4.3%, 2.3% లాభపడ్డాయి. వ్యవసాయ అనుభంద రంగానికి ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటన తర్వాత ఈ పెరుగుదల వచ్చింది.
ఇదే క్రమంలో బడ్జెట్ ప్రసంగం కాణంగా కొన్ని రంగాలకు చెందిన స్టాక్స్ సైతం తగ్గాయి. వీటి జాబితాను గమనిస్తే.. లార్సెన్ & టూబ్రో, ABB ఇండియా, థర్మాక్స్, సిమెన్స్ వంటి క్యాపిటల్ గూడ్స్ స్టాక్‌లు 1.5% నుంచి 5% మధ్య నష్టపోయాయి. వాస్తవానికి ఈ సారి బడ్జెట్లో మోదీ ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై ఖర్చు చేయాలనుకున్న మొత్తాన్ని పెంచకపోవటం ఇన్వెస్టర్ల అంచనాలను దెబ్బతీసింది. ఈ సదరు స్టాక్స్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది.