Finance Minister Nirmala Sitharaman: కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను పార్లమెంట్‌లో మంగళవారం ప్రవేశపెట్టనుంది. మరోసారి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) వరుసగా ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ ఘనత సాధించిన తొలి విత్త మంత్రిగా నిలిచారు. 2024 ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆమె వరుసగా ఆరు బడ్జెట్‌లు సమర్పించిన ఆర్థిక మంత్రిగా గత రికార్డు సమం చేశారు. గతంలో ఈ రికార్డు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరున ఉంది. అయితే.. అత్యధికంగా 10 బడ్జెట్‌లు సమర్పించిన రికార్డ్‌ మాత్రం మొరార్జీ దేశాయ్ పేరిట అలానే ఉంది. రెండుసార్లు కేంద్ర మంత్రిగా పని చేసిన నిర్మల సీతారామన్, 2019 పూర్తి స్థాయి బడ్జెట్‌తో ప్రారంభించి వరుసగా ఆరు బడ్జెట్‌లు సమర్పించారు. వీటిలో 5 పూర్తి స్థాయి బడ్జెట్‌లు, ఒకటి మధ్యంతర బడ్జెట్ (ఈ ఏడాది ఫిబ్రవరిలో) ఉన్నాయి. అంతకు ముందు, ఆమె కొన్ని నెలలు ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా కూడా పని చేశారు.


తొలి మహిళగా నిర్మలమ్మ


2019లో కేంద్రంలో బీజేపీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చాక నిర్మల సీతారామన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో పూర్తి పదవీ కాలానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. విత్త మంత్రిగా ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. కొవిడ్ సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేలా రూ.20 లక్షల కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని సైతంప్రకటించారు. మధ్య తరగతికి పన్ను మినహాయింపులు, ఆరోగ్య రంగాలపై ప్రత్యేక దృష్టి, ఉద్యోగాల కల్పనను మెరుగు పరచడం, ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి వాటి ద్వారా తన ప్రత్యేకత చాటుకున్నారు.


గత రికార్డులు చూస్తే..


బడ్జెట్‌ రికార్డుల విషయానికి వస్తే ఇప్పటివరకూ మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10 బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు. 9 బడ్జెట్లతో పి.చిదంబరం రెండో స్థానంలో నిలిచారు. 8 బడ్జెట్లతో ప్రణబ్ ముఖర్జీ మూడో స్థానంలో ఉన్నారు. యశ్వంత్ సిన్హా 7 బడ్జెట్‌లు, సి.డి.దేశ్‌ముఖ్ 7, మన్మోహన్ సింగ్ 6 బడ్జెట్‌లు సమర్పించారు. భారతదేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళ ఇందిరా గాంధీ కాగా.. ఆమె ప్రధానిగా పని చేస్తూ బడ్జెట్‌ సమర్పించారు.


బహీఖాతా ట్యాబ్లెట్‌తో..


బడ్జెట్ సందర్భంగా నిర్మలమ్మ పార్లమెంట్ నార్త్ బ్లాక్‌లోని ఆర్థిక శాఖ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి బహీఖాతా తీసుకొచ్చారు. ఎరుపు రంగులో ఉన్న బహీఖాతా ట్యాబ్లెట్‌లో బడ్జెట్ డాక్యుమెంట్లు ఉండగా.. వీటితో రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బడ్జెట్ కాపీలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్మలమ్మ రాష్ట్రపతి నోరు తీపి చేశారు. అనంతరం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు.






Also Read: Modi News: 'వికసిత్ భారత్' కోసం ఈ బడ్జెట్ కీలకం-విపక్షాలు సహకరించాలి: ప్రధాని మోదీ