Budget Session of Parliament Updates: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నేటి (జూలై 22) నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా దేశ ప్రజలకు శుభాంకాంక్షలు తెలిపారు. మంచి రోజైన ఈ సోమవారం నుంచే అతి ముఖ్యమైన వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సమావేశాల కోసం దేశ ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపారు.
బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి ప్రధాని మోడీ పార్లమెంట్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ 60 ఏళ్ల తర్వాత దేశంలో వరుసగా మూడోసారి ప్రభుత్వం కొలువుదీరిందని తెలిపారు. మూడో ఇన్నింగ్స్‌లో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం దక్కడం గర్వించదగిన విషయమని ప్రధాని మోడీ అన్నారు. ఇది భారత ప్రజాస్వామ్యంలో గౌరవప్రదమైన సంఘటనగా దేశం చూస్తోందని తెలిపారు.
ప్రతిపక్ష ఎంపీలకు ప్రత్యేక విజ్ఞప్తి
2047 నాటికి వికసిత్ భారత్ పూర్తి చేస్తామని ప్రధాని మోడీ తెలిపారు. సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నామన్నారు. తమ ప్రభుత్వం దేశం కోసం పోరాడుతోందని చెప్పారు. గత జనవరి నుంచి ఎన్నికల సమరంలో విజయం కోసం మన సామర్ధ్యం మేరకు ఎంతగానో పోరాడాము. ఇక ఆ పరిస్థితి నుంచి బయటకొచ్చి ప్రజల తీర్పును గౌరవించి మన విధులను నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఐదేళ్లు దేశ ప్రగతి కోసం పనిచేయాలని వచ్చే ఎన్నికల కోసం తర్వాత ఆలోచించాలని కూటమి నేతలకు ప్రధాని పిలుపునిచ్చారు.
మొన్న ఎంపీల ప్రమాణ స్వీకారం అనంతరం జరిగిన తొలి పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కూటమి ఎంపీల దూకుడు నేపథ్యంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు నిన్న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో సైతం కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ స్పీకర్ పదవి కోసం మరోసారి పట్టుబట్టగా వైసీపీ, జేడీయూ పార్టీలు ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశాయి.
Also Read: లోక్‌సభలో ఎకనామిక్ సర్వే, జీడీపీ అంచనాలపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన