Parliament Budget Sessions 2024: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే లోక్‌సభలో అలజడి మొదలైంది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని మరోసారి ప్రస్తావించారు. ఇది చాలా పెద్ద సమస్య అని తేల్చి చెప్పారు. విద్యార్థు జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఒక్కసారిగా ప్రతిపక్షాలంతా నినదించాయి. చర్చకు పట్టుబట్టడం వల్ల గందరగోళం నెలకొంది. గతంలో జరిగిన సమావేశాల్లో నీట్ వ్యవహారంపై చర్చకు పట్టుపట్టిన రాహుల్ గాంధీ ఈ సారి కూడా అదే ప్రస్తావన తీసుకొచ్చారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ని నిర్ణయించే ఇంత కీలకమైన అంశాన్ని మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండి పడ్డారు. డబ్బుంటే ఎవరైనా ఈ పరీక్షా వ్యవస్థను కొనేయొచ్చన్న తప్పుడు సంకేతాలిచ్చినట్టవుతోందని అసహనం వ్యక్తం చేశారు.
"లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌కి సంబంధించిన నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇంత దారుణమైన స్కామ్ జరిగితే నోరు మెదపడం లేదు. మీ దగ్గర డబ్బులుంటే చాలు. ఎగ్జామినేషన్ సిస్టమ్‌ని కొనుగోలు చేయొచ్చన్న ధైర్యం ఇస్తున్నారు. వాళ్లకే కాదు. ప్రతిపక్షాలకూ ఇదే అభిప్రాయముంది"
- రాహుల్ గాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌పైనా విమర్శలు గుప్పించారు రాహుల్ గాంధీ. ఇంత జరిగితే తన తప్పుని మాత్రం అంగీకరించకుండా ఎవరెవరిపైనో నిందలు వేస్తున్నారని ఆరోపించారు. అయితే...ఈ విమర్శలకు ధర్మేంద్ర ప్రదాన్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు విచారిస్తోందని తేల్చి చెప్పారు. పదేపదే పేపర్ లీక్‌ల గురించి ప్రతిపక్షాలు ప్రస్తావిస్తున్నాయని, కానీ ఎక్కడా అందుకు సంబంధించిన ఆధారాల్లేవని స్పష్టం చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటి వరకూ 240 పరీక్షల్ని విజయవంతంగా నిర్వహించిందని వివరించారు. గట్టిగా అరిచి చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోదని రాహుల్‌కి చురకలు అంటించారు ధర్మేంద్ర ప్రదాన్. పరీక్షా వ్యవస్థనే తప్పుపట్టడాన్ని తీవ్రంగా ఖండించారు.
Also Read: Joe Biden: ప్రెసిడెంట్ రేసు నుంచి బైడెన్ తప్పుకోడానికి కారణాలివేనా?