AP Elections 2024: ప్రత్తిపాడు నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ స్థానిక మహిళ ఒకరు ఢిల్లీ వేదికగా నిరసన చేపట్టారు. తన నియోజకవర్గంలో మైనర్లకు గంజాయి అమ్మడం, వారు నేరాలు చేసేలా ప్రేరేపించడం.. తప్పుడు పత్రాలు చేసి కబ్జాలకు పాల్పడడం, రెవెన్యూ రికార్డులు మార్చేయడం లాంటి అక్రమాలు చేస్తున్నారని ఉద్యమకారిణి అయిన కోవూరి లక్ష్మి ఆరోపించారు. ఈ విషయాల గురించి తాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, ప్రధాని మోదీకి ఫిర్యాదు చేయాలని వచ్చినట్లు మహిళ తెలిపారు.
అయితే, వారిని కలిసేందుకు తాను చేసిన ప్రయత్నం విఫలం కావడంతో ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టినట్లు చెప్పారు. అయినా స్పందన లేకపోవడంతో తన బొటన వేలు నరుక్కొని నిరసన తెలిపినట్లు చెప్పారు. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నారా లోకేశ్ స్పందన
వైసీపీ అరాచకాలు, అవినీతిపై ఢిల్లీలో పోరాడుతున్న కోవూరు లక్ష్మిని టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ అభినందించారు. కానీ, ఆమె బొటన వేలు కోసుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరసన తెలియజేయడానికి ఎన్నో మార్గాలున్నాయని, ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని లోకేశ్ కోరారు. ‘‘వైసీపీ అరాచకాలు, అవినీతిపై పోరాడుతున్న ఉద్యమకారిణి కోవూరు లక్ష్మీ గారు .. ఢిల్లీలోనూ వైసీపీ అక్రమాలను ఎలుగెత్తి చాటుతున్నారు. సొంత బాబాయ్ గుండెల్ని చీల్చిన వారు, మీరు వేలు కోసుకుంటే స్పందిస్తారా లక్ష్మీ గారు! నిరసన తెలియజేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇటువంటి చర్యలకు పాల్పడవద్దు. అసుర పాలన అంతానికి అంతా కలిసి పోరాడుదాం’’ అని నారా లోకేశ్ పిలుపు ఇచ్చారు.