Aa Okkati Adakku Trailer: కామెడీ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్. అయితే గత కొన్నేళ్లుగా పంథా మార్చుకొని తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో అక్కినేని నాగార్జునతో కలిసి 'నా సామిరంగ' చిత్రంతో హిట్టు కొట్టిన అల్లరోడు... ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు' అంటూ తన ఫేవరెట్ కామెడీ జోనర్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు.


అల్లరి నరేష్ హీరోగా మల్లి అంకం దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటి అడక్కు'. ఇందులో 'జాతి రత్నాలు' ఫేం ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్, టీజర్, సాంగ్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. విడుదల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో, తాజాగా హీరో నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ లాంచ్ చేసారు. 


పెళ్లీడు వయసు వచ్చినా పెళ్లికాని అల్లరి నరేష్.. తన జీవిత భాగస్వామిని సెట్ చేసుకోడానికి ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేది 'ఆ ఒక్కటీ అడక్కు' ట్రైలర్ లో చూపించారు. ''మీకు తెలిసిన మంచి సంబంధాలు ఉంటే చెప్పండి.. నాకు క్యాస్ట్ ఫీలింగ్ కూడా లేదు'' అంటూ తనకు అమ్మాయిని చూసిపెట్టమని కనిపించిన వాళ్లందరినీ అడిగే నరేశ్.. తనకు సరైన జోడీ కోసం హ్యాపీ మ్యాట్రిమోనీకి వెళ్తాడు. అయితే 49 సంబంధాలు చూసినా అతనికి ఒక్క మ్యాచ్ కూడా సెట్ కాలేదు. 50వ సంబంధమైనా సెట్ అవుతుందా లేదా అని టెన్షన్ పడుతున్న అతనికి సిద్ధి (ఫరియా అబ్దుల్లా) ప‌రిచ‌యం అవుతుంది. వెంటనే పెళ్లంటే ఎలాంటి అభిప్రాయం లేని ఆమె ప్రేమలో పడతాడు. మరి ఆమె ప్రేమను గెలుచుకొని పెళ్లి పీటల వరకు వెళ్లాడా లేదా? అనేది తెలియాలంటే 'ఆ ఒక్కటి అడక్కు' సినిమా చూడాల్సిందే. 



'ఆ.. ఒక్కటి అడక్కు' ట్రైల‌ర్‌ తోనే ఇది పెళ్లికాని ప్ర‌సాదుల పెళ్లి కష్టాల స్టోరీ అని చెప్పేసారు. కథంతా దాని చుట్టూనే నడుస్తుందని అర్థమవుతుంది. కాకపోతే ఇందులో ఓ చిన్న మెసేజ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అలానే దీంట్లో కామెడీతో పాటుగా యాక్షన్ కూడా ఉన్నట్లు హింట్ ఇచ్చారు. పెళ్లి కోసం పాట్లు పడే యువకుడిగా న‌రేష్ ఆకట్టుకున్నారు. ఫరియా అబ్దుల్లా అందంగా కనిపించింది. వెన్నెల కిషోర్‌, హరి తేజ, వైవా హ‌ర్ష‌, ర‌ఘుబాబు, శకలక శంకర్.. ఇలా సినిమా నిండా చాలామంది హాస్య నటులు కనిపిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ కమెడియన్ జానీ లివర్ కూతురు జామీ లివర్ కూడా కీలక పాత్రలో కనిపించింది. 



ట్రైలర్ లో అబ్బూరి ర‌వి రాసిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. 'మీకు ఏ విధంగా సహాయ పడగలను' అని మ్యారేజ్ బ్యూరో నడిపే హరితేజ అడిగితే, 'ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తారా ?' అని అల్లరి నరేష్ వెటకారం చేయడం... 'మాంగళ్యం తంతునేనా అన్నారు గానీ, తొందరేనా అనలేదు' అని వెన్నెల కిశోర్ చెప్పడం నవ్వు తెప్పిస్తుంది. ఇక చివర్లో కోర్టులో ''పెళ్లికాని వాళ్లకి వీలైతే పెళ్లి సంబంధం చూసి పెట్టమని చెప్పండి.. పెళ్ళెప్పుడని దొబ్బేవాళ్ళని ఒక కొత్త సెక్షన్ పెట్టి లోపల వేయించండి'' అని నరేష్ వాదించడం నవ్వులు పూయిస్తుంది. 


ఓవరాల్ గా అల్లరి నరేష్ మార్క్ హెల్దీ కామెడీతో 'ఆ.. ఒక్కటి అడక్కు' సినిమా తెరకెక్కిందని ఈ ట్రైలర్ హామీ ఇస్తుంది. దీనికి గోపీ సుందర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. సూర్య సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేసారు. చిలకా ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక ఈ చిత్రాన్ని నిర్మించారు. ముందుగా ఈ సినిమాని మార్చి 22న రిలీజ్ చేయాలనుకున్నారు. ఇప్పుడు ఫైనల్ గా సమ్మర్ స్పెషల్ గా మే 3వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరి తన తండ్రి హిట్ సినిమా టైటిల్ తో వస్తున్న అల్లరోడు.. ఈసారి తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్ లో ఎలాంటి సక్సెస్ సాధిస్తారో చూడాలి.