WhatsApp Governance in Andhra Pradesh: అమరావతి: వాట్సాప్‌ గవర్నెన్స్‌ను ఈ ఏడాది జూన్‌ 30నాటికి 500 రకాల ప్రభుత్వ సేవలను మన మిత్రలో వాట్సాప్‌ ద్వారా అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్(Nara Lokesh) తెలిపారు చెప్పారు. అసెంబ్లీలో వాట్సాప్‌ గవర్నెన్స్‌పై మంగళవారం స్వల్పకాలిక చర్చలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. వాట్సాప్ గవర్నెన్స్ హ్యాక్ అయ్యిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే వాట్సాప్ గవర్నెన్స్ హ్యాక్ చేస్తామని నిరూపిస్తే రూ.10 కోట్లు ఇస్తానని తాను ఛాలెంజ్ చేసినా ఇప్పటికీ ఎవరూ ముందుకు రాలేదన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ సెక్యూరిటీపై పేటీయం బ్యాచ్ తప్పుడు ప్రచారం చేసిందని, అందుకే సైలెంట్ గా ఉన్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. 


ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెబుతున్నారు. అందుకే ఎవరైనా వాట్సాప్ గవర్నెన్స్ హ్యాకింగ్ నిరూపిస్తే వ్యక్తిగతంగా నా డబ్బు ఇస్తానని ఛాలెంజ్ చేసినట్లు స్పష్టం చేశారు. వైసీపీ నేతలు వాట్సాప్ గవర్నెన్స్ వాడుతున్నారని అర్థమవుతోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఫోన్ లేదు కనుక, ఓ స్మార్ట్‌ఫోన్ కొనిచ్చి, వాట్సాప్ ఇన్‌స్టాల్ చేసివ్వాలని పయ్యావుల కేశవ్ ను నారా లోకేష్ కోరారు. అప్పుడు జగన్ కు వాట్సాప్ గవర్నెన్స్ తెలుస్తుందన్నారు. ప్రజల వ్యక్తిగత డేటాకు భద్రత ఉంటుందని, కేవలం ప్రభుత్వానికి సమాచారం చేరుతుందని.. దీన్ని హ్యాక్ చేయడం వీలుకాదన్నారు.


ఎన్టీఆర్, చంద్రబాబు మార్క్ పాలన
ఎన్టీఆర్‌ 1983లో సీఎం అయ్యాక పటేల్‌-పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ప్రజలకు సుపరిపాలన అందించారు. సింగపూర్ లాంటి దేశాల్లో టెక్నాలజీ వినియోగాన్ని గుర్తించిన చంద్రబాబు ఏపీలోనూ ఆన్‌లైన్ లో బిల్లుల చెల్లింపులు గతంలోనే ప్రారంభించారు. ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటే గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుందని చంద్రబాబు పదే పదే చెప్పేవారు. యువగళం పాదయాత్రలో ప్రజలను కలిసినప్పుడు సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ ఆఫీసుల వద్ద పడిగాపులు పడాల్సి వస్తోందని చెప్పేవారు. ఒక్కసారి సర్టిఫికెట్ తీసుకుంటే తరువాత వాట్సాప్ ద్వారా ఎప్పుడు కావాలన్న తీసుకోవచ్చు అన్నారు.
అప్పుడే వాట్సాప్ గవర్నెన్స్ పై ఆలోచన
బటన్‌ నొక్కితే ఫుడ్, సినిమా టిక్కెట్లు, ట్యాక్సీ వంటి సేవలు ఇంటికి వస్తుంటే.. ప్రభుత్వ సేవలు ఎందుకు రావని మేం ఆలోచించి వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర ద్వారా సేవలు అందుబాటులోకి తెచ్చాం. దాంతో గంటల తరబడి ఆఫీసుల వద్ద నిల్చోవడం ఉండదు. మంగళగిరిలోని దుగ్గిరాలలో టీడీపీ-జనసేన ఎక్కువ ఎంపీటీసీలు గెలుచుకున్నా... ఎంపీపీగా బీసీ మహిళకు రిజర్వేషన్‌ వస్తే అప్పటి ఎమ్మెల్యే ఆమెకు కులధృవీకరణ పత్రం (Caste Certificate) రాకుండా అడ్డుపడి, పదవికి దూరం చేశారు. వ్యవస్థలో మార్పు తీసుకురావాలని అప్పుడే తనలో వాట్సాప్‌ గవర్నెన్స్‌ ఆలోచన మొదలైందన్నారు. 


గేమ్ ఛేంజర్‌గా వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర
ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర యాప్ గేమ్ ఛేంజర్‌గా మారింది. పలు రకాల సర్వీసులతో పాటు పలు రకాల సర్టిఫికెట్ల జారీలో అధికారుల పాత్ర లేకుండా చేయాలని మన మిత్రను వాట్సాప్ ద్వారా తీసుకొచ్చాం. ప్రస్తుతం మనమిత్ర ద్వారా 200 సేవలు అందిస్తున్నాం, టీటీడీ అన్నీ సర్వీసులను మనమిత్ర ప్లాట్‌ఫాంపైకి తీసుకురాబోతున్నాం. మార్చి నెలాఖరుకు 300 రకాల ప్రభుత్వ సేవలు వాట్సాప్‌ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. జూన్‌ పూర్తయ్యే సరికి మొత్తం 500 సేవలు మనమిత్ర ద్వారా అందుబాటులోకి తెస్తామని నారా లోకేష్ స్పష్టం చేశారు. ఎలాంటి ట్యాంపరింగ్‌కు ఛాన్స్ లేకుండా క్యూఆర్‌ కోడ్‌ ఉండేలా సర్టిఫికేట్లు అందజేస్తామని తెలిపారు. పరీక్షల ఫలితాలు కూడా విద్యార్థులకు వాట్సాప్‌ ద్వారానే ఫోన్లకు పంపిస్తామని చెప్పారు.