Sunita Williams : తొమ్మిది నెలలు ఐఎస్ఎస్‌లో గడిపిన తర్వాత భూమికి తిరిగి వచ్చిన సునీతా విలియమ్స్‌ అండ్‌ టీంకు ప్రధానమంత్రి మోదీ శుభాకాంక్షలు చెప్పారు. వారికి వెల్‌కమ్‌ చెప్పారు. ప్రయాణం విజయవంతమవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు.  


సునీతా విలియమ్స్‌ మంగళవారం అంతరిక్షంలో బయల్దేరిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఒక ప్రత్యేక లేఖ రాశారు. "మీరు వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ, మీరు మా హృదయాలకు దగ్గరగా ఉన్నారు" అని వ్యోమగామి మైక్ మాసిమినో ద్వారా రాసిన లేఖలో ప్రధాని మోడీ పేర్కొన్నారు .


కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం సోషల్ మీడియాలో ఆ లేఖ కాపీని షేర్ చేశారు. " సునీతా విలియమ్స్ సురక్షితంగా తిరిగి రావడానికి ప్రపంచం మొత్తం ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తుండగా, భారతీయ బిడ్డ కోసం ప్రధాని నరేంద్ర మోడీ తన ఆందోళనను వ్యక్తం చేశారు" అని సింగ్ X లో రాశారు.


మార్చి 1న రాసిన లేఖలో ప్రధాని మోదీ, "భారత ప్రజల తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఓ కార్యక్రమంలో నేను ప్రముఖ వ్యోమగామి మిస్టర్ మైక్ మాసిమినోను కలిశాను. మాటల్లో, మీ పేరు ప్రస్తావనకు వచ్చింది. మీ గురించి, మీ పని గురించి ఎంత గర్వపడుతున్నామో చర్చించుకున్నాము. ఈ డిస్కషన్స్ తర్వాత, ఉత్తరం రాయకుండా ఉండలేకపోయాను." అని పేర్కొన్నారు. 






ఇటీవల అమెరికా పర్యటనల సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ను కలిసినప్పుడు ఆమె గురించి వాకాబు చేసినట్టు ప్రధాని మోదీ చెప్పారు .


1.4 బిలియన్ల భారతీయులు ఆమె విజయాలను చూసి గర్విస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. "ఇటీవల పరిణామాల్లో మీరు స్ఫూర్తిదాయకమైన ధైర్యం, పట్టుదల ప్రదర్శించారు. మీరు వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ, మీరు మా హృదయాలకు దగ్గరగా ఉన్నారు. మీ ఆరోగ్యం ఈ మిషన్‌లో మీ విజయం కోసం భారత ప్రజలు ప్రార్థిస్తున్నారు" అని ఆయన రాశారు.


"బోనీ పాండ్యా మీ రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దివంగత దీపక్‌భాయ్ ఆశీస్సులు కూడా మీతో ఉంటాయి. 2016లో నేను అమెరికా పర్యటించిన సందర్భంగా మీతోపాటు ఆయనను కూడా కలవడం నాకు గుర్తుంది" అని ప్రధాని మోదీ అన్నారు.


ఆమెను భారత్‌ పర్యటనకు భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని మోదీ అన్నారు. "భారతదేశం తన అత్యంత పేరొందిన కుమార్తెల్లో ఒకరిని ఆతిథ్యం ఇవ్వడానికి సంతోషిస్తుంది" అని ఆయన రాశారు.