Viral News: నడిరోడ్డుపై మర్డర్-రీల్స్ కోసం యువకుల బరితెగింపు- ఇద్దరు అరెస్టు
Bengaluru:వ్యూస్ మత్తులో, లైక్స్ ఆశతో కర్నాటకలో ఇద్దరు వ్యక్తులు బరితెగించారు. నడిరోడ్డుపై మర్డర్స్ ప్లాన్ చేశారు. ఆ ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు.

Bengaluru:కర్నాటకలోని కల్‌బుర్గీలో హుమ్నాబాద్ రింగ్ రోడ్‌పై జరిగిన ఓ సీన్ అందర్నీ భయభ్రాంతులకు గురి చేసింది. నడి రోడ్డుపై ఓ యువకుడిని మరో యువకుడు కిందపడేసి పొడుస్తూ ఉన్నాడు. కింద పడిపోయిన వ్యక్తి కేకలు వేస్తూ ఏడుస్తున్నారు. అతనిపై కూర్చున్న వ్యక్తి గట్టిగట్టిగా విజయానందంతో అరుస్తున్నాడు. ఒంటినిండా చేతుల నిండా రక్తంతో రచ్చ రచ్చ చేస్తున్నాడు.
ఆ సీన్ చూసిన ప్రతి ఒక్కరూ పరుగులు పెట్టారు. అయ్యో పాపం ఎంత ఘోరం జరుగుతోందని అంతా ఆశ్చర్యపోయారు. సోమవారం జరిగిన ఈ ఘటన సోషల్ మీడియా వైరల్ అయ్యింది.
ఇలా నడిరోడ్డుపై రెచ్చిపోతున్న యువకుల పేర్లు సాయిబన్న, సచిన్. దీనిపై మంగళవారం ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. అప్పుడు కానీ అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వాళ్లిద్దరు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం ఇలాంటి దుశ్చర్యకు పాల్పడినట్టు పోలీసులు తేల్చారు.
నడి రోడ్డుపై జరిగింది నిజంగా మర్డర్ కాదని తేల్చారు. కేవలం రీల్స్, వ్యూస్, పాపులారిటీ కోసం ఇది చేసినట్టు గుర్తించారు. జనాలను భయభ్రాంతులకు గురి చేసిన ఇద్దర్ని అరెస్టు చేశారు. ఫేక్ బ్లడ్, నకిలీ ఆయుధంతో ఇలా ఇలా ఫేక్ మర్డర్ ప్లాన్ డ్రామా ఆడారు.
ఇలా వీళ్లు చేసిన ఫేక్ వీడియో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలాంటివి జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. మొత్తానికి కేసు నమోదై వాళ్లు అరెస్టైన విషయం తెలుసుకున్న నెటిజన్లు తగి శాస్తి జరిగిందని అంటున్నారు.
మంచి కంటెంట్‌తో కోట్ల మంది రీల్స్ చేస్తుంటే ఇలాంటి పనికిమాలిన పనులు చేయొద్దని నెటిజన్లు సూచిస్తున్నారు.