అహ్మదాబాద్: 9 నెలలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లో చిక్కుకుపోయిన వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌, నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్‌ లు స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్‌లో ఫ్లోరిడా సముద్ర తీరంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ సురక్షితంగా భూమి మీదకు తిరిగి రావడంతో ఆమె పూర్వీకుల గ్రామంలో సంబరాలు చేసుకున్నారు.


గుజరాత్‌లో అంబరాన్నంటిన సంబరాలు..


గుజరాత్ లోని మెహసానా జిల్లాలోని ఝులాసన్‌‌లో సునీత బంధువులు, గ్రామస్తుల సంబరాలు అంబరాన్ని అంటాయి. టపాసులు కాల్చి, డాన్సులు చేస్తూ సునీత విలియమ్స్ భూమ్మీదకి తిరిగి రాకను సెలబ్రేట్ చేసుకున్నారు. సునీతా విలియమ్స్ క్షేమంగా తిరిగి రావాలని గ్రామంలోని ఆలయంలో ఇదివరకే ప్రత్యేక పూజలు నిర్వహించి యజ్ఞం సైతం చేశారు. సునీతా విలియమ్స్ సాధించిన విజయాలపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమెతో పాటు తోటి వ్యోమగాములు క్షేమంగా తిరిగి వచ్చినందుకు తమకు సంతోషంగా ఉందని ఝులాసన్ గ్రామస్తులు చెబుతున్నారు.







సునీతా విలియమ్స్ తండ్రి పేరు దీపక్ పాండ్యా గుజరాత్‌లోని మెహసానా జిల్లాలోని ఝులాసన్‌ ప్రాంతానికి చెందినవారు. న్యూరో సర్జన్ అయిన దీపక్ పాండ్యా అహ్మదాబాద్‌లో చదువు పూర్తయ్యాక, 1957లో అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. స్లోవెనియాకు చెందిన ఉర్సులిన్ బోనీని దీపక్ పాండ్యా వివాహం చేసుకున్నారు. ముగ్గురు సంతానంలో సునీతా విలియమ్స్ ఒకరు. అమెరికాలోని ఓహాయోలో 1965లో సునీతా విలియమ్స్ జన్మించారు. అమెరికాలో పుట్టి పెరిగినా భారతీయ సంప్రదాయాలను సునీత ఇష్టపడేవారు. అంతరిక్షంలోకి వెళ్లినా వెంట భగవద్గీత తీసుకెళ్లారు. సునీత విలియమ్స్‌కు భారత్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆమె రెండు సార్లు తన పూర్వీకుల గ్రామం గుజరాత్ లోని ఝులాసన్‌‌ను సందర్శించారు. 2007 తొలిసారిగా ఝులాసన్‌‌కు వచ్చిన సునీత 2013లో మరోసారి తన పూర్వీకుల గ్రామాన్ని సందర్శించి వారితో ముచ్చటించి, సరదాగా గడిపారు.  






 



దాదాపు 17 గంటల ప్రయాణం.. మిషన్ సక్సెస్


ఐఎస్ఎస్ నుంచి స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్‌లో క్రూ9 మంగళవారం ఉదయం 8.15 గంటలకు భూమి మీదకు వచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. నలుగురు వ్యోమగాములు క్రూ10కు ఆల్ ది బెస్ట్ చెప్పి, ఫొటోలు దిగిన సమయంలో సునీత భావోద్వేగానికి లోనయ్యారు. హ్యాచింగ్ ప్రాసెస్ జరిగాక, దాదాపు రెండు గంటల అనంతరం ఉదయం 10 గంటల 15 నిమిషాల ప్రాంతంలో స్పేస్ క్రాఫ్ట్ ఐఎస్ఎస్ నుంచి విజయవంతంగా వేరయింది. అక్కడ మొదలైన వ్యోమగాముల ప్రయాణం 17 గంటలపాటు కొనసాగి అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. సునీత టీం విజయవంతంగా ల్యాండ్ కాగానే సంబరాలు మొదలయ్యాయి. ఇది కేవలం అమెరికా నాసా విజయంగానే కాకుండా మనిషి సాధించిన మరో విజయంగా పలు దేశాలు భావిస్తున్నాయి.