Nara Lokesh: ఢిల్లీలో టీడీపీ ఎంపీలతో నారా లోకేష్ కీలక భేటీ అయ్యారు. అరోరా అశోకా రోడ్డులోని ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో ఈ సమావేశం జరుగుతోంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసిన క్రమంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. న్యాయనిపుణులతో జరపాల్సిన భేటీలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఎంపీలతో లోకేష్ చర్చ జరుపుతున్నట్లు సమాచారం. అలాగే తనకు సెక్షన్ 41 కింద సీఐడీ ఇచ్చిన నోటీసులపై ఎలా ముందకెళ్లాలనే దానిపై కూడా సమాలోచనలు చేస్తున్నారు.


చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో అక్టోబర్ 3న విచారణ జరగనుంది. లాయర్ హరీశ్‌సాల్వే ప్రత్యక్షంగా కోర్టుకు హాజరై వాదనలు వినిపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే చంద్రబాబు పిటిషన్‌ను విచారించే ధర్మాసనం ఖరారు అయింది. జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను విచారించనుంది. 6వ నెంబర్ కోర్టులో వాదనలు జరగనున్నాయి. ఇప్పటికే హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన నేపథ్యంలో సుప్రీంలో ఏం జరుగుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. 


సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపున సిద్దార్థ్ లూధ్రా, హరీశ్ సాల్వే వాదనలు వినిపించనుండగా.. సీఐడీ తరపున ముకుల్ రోహిత్గి వాదించనున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో తనపై నమోదును కేసును కొట్టివేయాల్సిందిగా ముందుగా హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఇరు వర్గాలు వాదనలు వినిపించుకునేందుకు అవకాశం కల్పించింది. విచారణ ఆఖరి దశలో ఉన్న తరుణంలో తాము జోక్యం చేసుకోలేమని క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు సీఐడీ వాదనలకు ఏకీభవించింది. హైకోర్టులో ఊరట లభించకపోవడంతో సుప్రీంకోర్టులో చంద్రబాబు సవాల్ చేశారు.


సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన క్రమంలో కొద్దిరోజులుగా నారా లోకేష్ ఢిల్లీలోనే ఉంటున్నారు. సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు. అలాగే టీడీపీ ఎంపీలతో వరుస భేటీలు నిర్వహించడంతో పాటు వర్చువల్ విధానంలో అమరావతిలో జరిగే టీడీపీ నేతల సమావేశాల్లో కూడా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని ఇవాళ ఢిల్లీలో లోకేష్‌కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అమరావతిలోని సీఐడీ కార్యాలయంలో స్వయంగా విచారణకు హాజరుకావాలని తెలిపారు. ఎంపీ గల్లా జయదేవ్ నివాసానికి వెళ్లిన సీఐడీ అధికారులు మధుసూదన్ రావు, బాజీవోహన్, జగత్ సింగ్.. సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. సెక్షన్ 41ఏ గురించి లోకేష్‌కు వివరించారు. దీంతో 41-3, 41-4 గురించి కూడా వివరించాలని సీఐడీని లోకేష్ కోరారు. 


నోటీసులు ఇచ్చారు కదా.. క్షుణ్నంగా చదువుకుంటామని లోకేష్ చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని లోకేష్ హైకోర్టును కోరగా ఎలంటి ఊరట లభించలేదు. లోకేష్ పిటిషన్‌ను తోసిపుచ్చిన న్యాయస్థానం.. 41ఏ కింద నోటీసులు ఇవ్వాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. విచారణకు లోకేష్ సహకరించాలని సూచించింది. దీంతో లోకేష్ సహకరించకపోతే కోర్టు దృష్టికి తీసుకొస్తామని సీఐడీ లాయర్లు తెలిపారు.