Anam On Minister Roja : మంత్రి రోజా మీద సెటైర్లు వేశారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణ రెడ్డి. రోజా గురించి తాను నగరి నియోజకవర్గం మొత్తం మీద ప్రజాభిప్రాయం సేకరించానని, వచ్చే ఎన్నికల్లో నగరి నియోజకవర్గంలో రోజా ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే ప్రసక్తేలేదని తెగేసి చెప్పారు. విజయపురం మండలం, పాతార్కాడు, కోసల నగరం గ్రామాల్లో దాదాపు వందల ఎకరాల భూమిని రోజా కబ్జా చేశారని ఆరోపించారు. నిండ్ర మండలంలోని షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని ఎన్నికల ముందు మాట ఇచ్చారని, గాలేరు - నగరి ప్రాజెక్ట్ ను పూర్తి చేసి నీరు అందిస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా మంత్రి రోజా పూర్తి చేయలేదని విమర్శించారు. మంత్రి రోజా పేరెత్తితే నగరి ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. మంత్రి రోజా సాక్ష్యాత్తు ఏడు కొండల వేంకటేశ్వర స్వామినే ప్రోటోకాల్ టికెట్ల రూపంలో అమ్ముకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజా నెలకొకసారి దుబాయ్, కువైట్ వెళ్లే కారణమేమిటో చెప్పాలని ఆనం వెంకటరమణ రెడ్డి ప్రశ్నించారు.
డ్యాన్స్ లో తగ్గేదేలే
"మంత్రి రోజా డ్యాన్స్ లో తగ్గేదేలే. మా రోజా అక్క చెప్పులు మోసే స్టేజ్ నుంచి చెప్పులు మోయించే స్టేజ్ కు వచ్చారు. ఎంత కష్టబడ్డారో చెప్పండి. అదంతా సీఎం జగన్ పుణ్యమే. గాలేరు-నగరి ప్రాజెక్టు కోసం ఒక తట్ట మట్టి కూడా తవ్వలేదు మంత్రి రోజా. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని నగరి నియోజకవర్గంలో ప్రజలు మంత్రి రోజా గురించి చెబుతున్నారు. ముందు మీ నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించుకోండి. మిగిలిన ఒకటిన్నర సంవత్సరం అయినా నగరి ప్రజలకు ఏమైనా చేయండి. ఊరు మొత్తం తిరిగా ఒక్క ఫ్లెక్సీ కూడా కనిపించలేదు. లోకేశ్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివారు. రోజా పద్మావతి కాలేజీలో హెచ్ఈపీ చదివారు. ఈ మధ్య మంత్రి రోజా తిరుమల వెంకటేశ్వరరావు దర్శనానికి పదే పదే వెళ్తున్నారు. ఎందుకా అని ఆరా తీస్తే ప్రొటోకాల్ దర్శనం కూడా డబ్బులు సంపాదిస్తున్నారని తెలిసింది." - ఆనం వెంకటరమణ రెడ్డి
ఉద్యోగితో చెప్పులు మోయించిన మంత్రి రోజా!
మంత్రి రోజా ఇటీవల వివాదంలో చిక్కుకున్నారు. సూర్యలంక బీచ్ సందర్శనకు వెళ్లిన ఆమె కాసేపు సరదగా గడిపారు. మంత్రికి పర్యాటక రిసార్ట్స్ వద్ద అధికారులు వెల్కమ్ చెప్పి బీచ్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సరదాగా నీటిలో దిగి ఫొటోలు దిగారు మంత్రి రోజా. ఆ సమయంలో తన చెప్పులను బయట విడిచిపెట్టివెళ్లారు. ఆ సమయంలో పర్యాటకశాఖకు చెందిన ఓ చిరు ఉద్యోగి మంత్రి రోజా చెప్పులు మోసుకెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మంత్రి రోజా బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ లో ఇటీవల సందడి చేశారు. అయితే ఆ సమయంలో తన చెప్పుల్ని బయటవిడిచి, వాటిని జాగ్రత్తగా చూడాలని వ్యక్తిగత సిబ్బందికి సైగ చేశారు. దీంతో రిసార్ట్స్ ఉద్యోగి మంత్రి చెప్పులను తడిసిపోకుండా చేతితో పట్టుకుని మంత్రిని ఫాలో అయ్యారు. కొద్దిసేపు చేత్తో మోసిన అనంతరం పక్కన పెట్టారు. మంత్రి రోజా నీటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె కాళ్ల దగ్గర పెట్టారు. ఇలా ఉద్యోగి చెప్పులు మోయటం వివాదాస్పదం అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రతిపక్షపార్టీలు కూడా మంత్రి రోజా లక్ష్యంగా విమర్శలు చేశారు.