కడప - అనంతపురం - కర్నూలు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎం.వి.రామచంద్రారెడ్డి విజయం సాధించారు. అనంతపురం నగరంలోని జేఎన్టీయూ కళాశాలలో కడప- అనంతపురం- కర్నూలు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా గురువారం ఉదయం 08:00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టగా, శుక్రవారం తెల్లవారుజామున 04 గంటల వరకు నిర్వహించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థికి సరైన మెజార్టీ దక్కకపోగా, అనంతరం ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టి 169 ఓట్ల తేడాతో ఎం.వి.రామచంద్రారెడ్డి (వైసీపీ మద్దతు) గెలిచినట్లుగా జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ ప్రకటించారు.


ఈ కౌంటింగ్ లో ఒంటేరు శ్రీనివాసులరెడ్డికి 10,618 ఓట్లు రాగా, ఎం.వి.రామచంద్రారెడ్డికి 10,787 ఓట్లు వచ్చాయని తెలిపారు. అధికారికంగా ఎన్నికల కమిషన్ అనుమతి పొందిన అనంతరం ఎం.వి.రామచంద్రారెడ్డి గెలుపుని ప్రకటించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ తెలిపారు.


 తూర్పు రాయలసీమ టీచర్‌ ఎమ్మెల్సీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి గెలుపొందారు. సుమారు 2వేల ఆధిక్యంతో విజయం సాధించారు.


ఆ నాలుగు చోట్ల వైసీపీ విజయం, 5 ఏకగ్రీవం


స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్‌ సీపీ అభ్యర్థులే గెలిచారు. మొత్తం 9 స్థానాలనూ కైవసం చేసుకుంది. వీటిలో 5 స్థానాల్లో వైఎస్ఆర్‌ సీపీ అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఎన్నికలు జరిగిన మిగతా 4 స్థానాల్లోనూ వైఎఎస్ఆర్‌ సీపీ అభ్యర్థులే విజయం సాధించారు.


కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్


ఇటు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు ఆధిక్యంలో ఉన్నారు. సమీప ప్రత్యర్థి, వైసీపీ నుంచి పోటీ చేసిన సీతంరాజు సుధాకర్‌పై ఆయన 18,371 ఓట్ల భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.


పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్ర రెడ్డి 1,943 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మూడు రౌండ్లలో రవీంద్ర రెడ్డికి 28,872 ఓట్లు రాగా.. టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డికి 26,929 ఓట్లు వచ్చాయి. 


తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీడీపీనే ముందంజలో ఉంది. అక్కడ 3 రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ 9,558 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మూడు రౌండ్లలో శ్రీకాంత్‌కు 49,173 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డికి 39,615 ఓట్లు వచ్చాయి.