Producer SKN Gifted Auto To Mariyamma Family: 'పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గెలిచిన తర్వాత మా ఆయన రిక్షా తొక్కిన డబ్బులతో ఊరంతా పార్టీ ఇస్తా' ఇదీ ఎన్నికలకు ముందు మరియమ్మ (Mariyamma) అనే మహిళ ఆనందంతో చెప్పిన మాటలు. పవన్ అంటే తనకు చాలా అభిమానమని.. ఆయన తప్పకుండా గెలుస్తారని ఆనందంతో ఆమె పేర్కొన్నారు. నిరుపేద అయిన మరియమ్మ భర్త రిక్షా తొక్కుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై జనసేన నేతలు, జనసైనికులు, పవన్ అభిమానులు సైతం ప్రశంసలు కురిపించారు. 'పవన్ క్రేజ్' అంటే అలా ఉంటుందంటూ కామెంట్స్ చేశారు. అందరి ఆకాంక్షల మేరకే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. వైరల్ వీడియోపై పవన్ సైతం స్పందించారు. ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని జనసైనికులను ఆదేశించారు. 


ఆటో గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత


ఈ వైరల్ వీడియోను చూసిన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ (SKN) మరియమ్మకు ఆటో కొనిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన గురువారం పిఠాపురంలో మరియమ్మ కుటుంబానికి ఆటో అందజేశారు. దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తనకు అండగా నిలిచిన పవన్‌, నిర్మాత ఎస్‌కేఎన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మరియమ్మకు ఆటో అందించడంపై జనసైనికులు, పవన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Also Read: Nadendla Manohar : బియ్యం స్మగ్లింగ్‌లో ఐదుగురు ఐపీఎస్‌లు - మంత్రి నాదెండ్ల సంచలన ప్రకటన