Minister Nadendla Manohar :  ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున బియ్యం స్మగ్లింగ్ జరిగిందని గతంలో టీడీపీ, జనసేన పార్టీలు చేసిన ఆరోపణలకు ఇప్పుడు బలమైన ఆధారాలు లభిస్తున్నాయి. పౌరసరఫరాల మంత్రిగా బాద్యతలు చేపట్టినప్పటి నుంచి దూకుడుగా అక్రమాలను వెలికి తీస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ తాజాగా కీలక ప్రకటన చేశారు. కాకినాడ నుంచి జరిగిన బియ్యం స్మగ్లింగ్‌లో ఐదుగురు ఐపీఎస్‌ల పాత్ర ఉన్నట్లుగా తనకు సమాచారం వచ్చిందన్నారు. ఒక్క కాకినాడలోనే 43వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎంత భారీ స్థాయిలో అక్రమాలు జరిగి ఉంటాయో ఊహించడం కష్టమన్నారు. అధికారులు రాత్రింబవళ్లు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం బియ్యం స్కాం గుట్టు రట్టు చేస్తామని ప్రకటించారు. 


బియ్యం స్మగ్లింగ్ అంతా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కనుసన్నల్లో జరిగిందని అనుమానం                     


బియ్యం స్మగ్లింగ్‌లో ప్రధాన పాత్ర కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిదన్న ఆరోపణలు ఉన్నాయి. కాకినాడ పోర్టును ఆయన గుప్పిట్లో పెట్టుకున్నారని చెబుతున్నారు. అదే సమయంలో  ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కు ద్వారంపూడి తండ్రే అధ్యక్షుడిగా ఉన్నారు.  ఈ క్రమంలో ఐదేళ్ల పాటు పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించి ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేశారని భావిస్తున్నారు. కాకినాడలోనే ఎమ్మెల్యేకు చెందిన వివిధ గోడౌన్లలో సోదాలు నిర్వహించి పెద్ద ఎత్తున బియ్యాన్ని సీజ్ చేశారు. 


స్మగ్లింగ్‌కు సహకరించిన ఐదుగురు ఐపీఎస్ అధికారులు                             


ఈ వ్యవహారంపై ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంకా ఏమీ మాట్లాడలేదు. గతంలో చేసిన స్మగ్లింగ్‌కు అధికార సహకారం పూర్తి స్తాయిలో ఉందని.. స్మగ్లింగ్ బియ్యాన్ని గ్రీన్ చానల్ ద్వారా తరలించేవారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారుల సహకారం లేకపోతే ఇంత భారీ స్థాయిలో అక్రమాలు జరగవని ఐదుగురు ఐపీఎస్ అధికారులు ఈ స్కాంలో భాగం అయి.. పూర్తి స్థాయిలో సహకరించి దానికి తగ్గట్లుగా ఫలితం పొందారని చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే అధికార వర్గాల్లో గుసగుసలు ఉన్నాయి. ఇప్పుడు మంత్రి నాదెండ్ మనోహర్ నేరుగా ప్రకటించడంతో ఇక ఆ ఐదుగురు ఐపీఎస్ అధికారులపై కేసులు నమోదు చేయడం ఖాయమన అంచనా వేస్తున్నారు. 


పౌరసరఫరాల శాఖలో మొత్తం స్కాంను వెలికి తీస్తున్న నాదెండ్ల              


పౌరసరఫరాల శాఖలో జరిగిన మొత్తం స్కాములన్నీ కొత్త మంత్రి బయటకు తీయిస్తున్నారు. పేదలకు పంపిణీ  చేసే నిత్యావసర వస్తువుల ప్యాకెట్లలో బరువు తక్కువ ఉండటం కూడా గుర్తించారు. కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మక్కయి ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున  స్వాహా చేశారని నిగ్గు తేలుస్తున్నారు. మంత్రి నాదెండ్ల దూకుడతో పౌరసరఫరాల శాఖలో చక్రం తిప్పిన వారు తంటాలు పడుతున్నారు. తమ స్కాములు ఎక్కడ బయటపడతాయోనని ఆందోళన చెందుతున్నారు.