Oldest Company of India: భారతదేశానికి చెందిన కొన్ని కంపెనీలు, బిజినెస్‌ గ్రూప్‌లు ప్రపంచ దేశాల్లో తమదైన ముద్ర వేశాయి, విలువైన గౌరవం సంపాదించుకున్నాయి. భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, సొంత పాలనలో, పారిశ్రామిక రంగం అభివృద్ధి కోసం చాలా పథకాలు ప్రవేశపెట్టారు. ముఖ్యంగా, 1991 నాటి సంస్కరణల తర్వాత పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. ఆనాటి నుంచి వందలు, వేల సంఖ్యలో కంపెనీలు, ఫ్యాక్టరీలు పుట్టుకొచ్చాయి. టాటా, బిర్లా పేర్లు కూడా స్వాతంత్ర్యం తర్వాతి నుంచి ఎక్కువగా వినిపించడం ప్రారంభమైంది. ఇప్పుడు.. అంబానీ, అదానీ కుటుంబాల గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. గోయెంకా, నాడార్, ప్రేమ్‌జీ, గోద్రేజ్ కుటుంబ పేర్లు కూడా భారతీయ వ్యాపార ప్రపంచంలో గౌరవం అందుకుంటున్నాయి. 


విశేషం ఏంటంటే... పైన చెప్పిన పేర్లలో ఏ ఒక్కటీ మన దేశంలోని ప్రాచీన బిజినెస్‌ గ్రూప్‌ కాదు. వీటిన్నింటికంటే ముందు నుంచే, భారతదేశంలో పెద్ద వ్యాపారాలకు బీజాలు వేసిన బిజినెస్‌ గ్రూప్‌ మరొకటి ఉంది. ఎక్కువ మంది ప్రజలు ఈ బిజినెస్‌ గ్రూప్‌ పేరును వినకపోవచ్చు. కానీ, ఆ గ్రూప్‌లోని కంపెనీల పేర్లను దాదాపు అందరికీ తెలుసు. ఆ కంపెనీలు ఉత్పత్తి చేసిన దుస్తులను చాలామంది ధరించారు. ఆ దుస్తుల బ్రాండ్‌ను హోదాకు చిహ్నంగా భావించారు. ఆ గ్రూప్‌లోని ఓ బిజినెస్‌ కంపెనీ వండి వార్చిన బిస్కెట్లను దాదాపుగా ప్రతి ఒక్కరు తిన్నారు, ఇప్పటికీ తింటున్నారు. భారతదేశంలో అత్యంత పురాతన కంపెనీ అనే గౌరవం దక్కించుకున్న ఆ వ్యాపార సంస్థ.. 'వాడియా గ్రూప్‌' (Wadia Group).


1736లో ప్రారంభం
వాడియా గ్రూప్ చరిత్ర దాదాపు 300 సంవత్సరాల నాటిది. 1736లో, గుజరాత్‌లోని సూరత్‌లో లోవ్జీ నుస్సర్వాంజీ వాడియా (Lovji Nusserwanjee Wadia) అనే వ్యక్తి తన ఇంటి పేరు మీదుగా వాడియా గ్రూప్‌ను ప్రారంభించారు. నౌకల నిర్మాణంలో అతనికి మంచి పేరు, ఆ రంగంలో గట్టి పట్టు ఉంది. బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ముంబయిని దేశ ఆర్థిక రాజధానిగా చేయడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. ఓడలను నిర్మించడానికి & ముంబైలో మొదటి డాక్‌ను నిర్మించడానికి అతనికి కాంట్రాక్ట్ దక్కింది. ఆ కాంట్రాక్ట్‌ను ఆయన విజయంవంతంగా అమలు చేశారు. అలా.. తన తర్వాతి తరాల కోసం, దాదాపు 300 సంవత్సరాల క్రితం, వాడియా గ్రూప్‌నకు లోవ్జీ నుస్సర్వాంజీ వాడియా పునాది వేశారు.


మార్కెట్ విలువ రూ. 1.20 లక్షల కోట్లు
ప్రస్తుతం, వాడియా గ్రూప్ రూ.1.20 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో ‍‌(Wadia Group Market Cap) పెద్ద వ్యాపార సమూహంగా మారింది. ఈ గ్రూప్‌లోని మూడు కంపెనీలు మన తాతల కాలం నుంచి మనకు తెలిసినవే. ఆ కంపెనీలు... బాంబే డైయింగ్ (Bombay Dyeing), బ్రిటానియా ఇండస్ట్రీస్ (Britannia Industries), బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ (Bombay Burmah Trading Corporation). ఇవి 100 సంవత్సరాల క్రితమే ఈ కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్‌ అయ్యాయి. 


బాంబే డైయింగ్‌ కంపెనీని 1879లో స్థాపించారు. టెక్స్‌టైల్ పరిశ్రమలోని దిగ్గజం కంపెనీలలో ఇది ఒకటిగా నిలిచింది. బ్రిటానియా ఇండస్ట్రీస్‌ను 1892 సంవత్సరంలో ప్రారంభించారు. బిస్కెట్ల నుంచి పాల పదార్థాల వరకు చాలా ఆహార పదార్థాలను ఈ కంపెనీ తయారు చేస్తోంది. బాంబే బర్మా ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ను 1863లో స్థాపించారు. ప్లాంటేషన్, హెల్త్‌కేర్, రియల్ ఎస్టేట్ రంగాల్లో  ఈ కంపెనీ పని చేస్తోంది.


మరో ఆసక్తికర కథనం: ఫ్లిప్‌కార్ట్‌ రీఛార్జ్, బిల్‌ పేమెంట్‌ కేటగిరీలో కొత్త ఆప్షన్స్‌ - ఈ బెనిఫిట్స్‌ మిస్‌ కావద్దు