Minister Taneti Vanitha: ఆన్ లైన్ లోన్ యాప్ ల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హోంశాఖ మంత్రి తానేటి వనిత సూచించారు. లోన్ యాప్స్ నిర్వాహకుల నుండి బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలన్నారు. నేరుగా ఫిర్యాదు చేయలేని వారు టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం, మెసెంజర్ లాంటి సోషల్ మీడియాలలో వచ్చే అనధికార లింక్ లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడని వివరించారు.
"తక్కువ సమయంలో ఎక్కువ సంపాదన" అని వచ్చే లింక్ లను కూడా తెరవకూడదన్నారు. అదే విధంగా బ్యాంక్ డీటెయిల్స్, పిన్ నెంబర్, ఆధార్, ఓటిపీలను అపరిచిత వ్యక్తులకు చెప్పకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏదయినా యాప్ లింక్ ను ఓపెన్ చేసినప్పుడు మీ కాంటాక్ట్స్, కెమెరా, మీడియా గ్యాలరీ లకు సంబందించిన పెర్మిషన్ ఇవ్వడం చాలా ప్రమాదకరం అని మంత్రి చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో న్యూడ్ ఫోటో లు అప్ లోడ్ చేస్తామని వేధింపులకు గురిచేసే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని హోంమంత్రి తానేటి వనిత సూచించారు.
ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ప్రభుత్వం మీ వెంటే ఉందని భరోసా ప్రజలకు ఇచ్చారు. భాధితులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వేధింపులకు గురిచేసే నిర్వాహకులపై పోలీసులు తప్పక చర్యలు తీసుకుంటారని తెలిపారు. బాధితులు మానసిక వేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడవద్దని మంత్రి వనిత వివరించారు.
లోన్ యాప్స్ అంటే ఏమిటి..?
- లోన్ ఆప్ లో ఇన్ స్టాల్ చేసుకోగానే సైబర్ నేరగాళ్లు కొన్ని పర్మిషన్లు అడుగుతారు. వాటిని ఇవ్వడం వలన మన యొక్క వ్యక్తిగత సమాచారం వారి చేతుల్లోకి వెళ్ళిపోతుంది.
- సమాచారం సేకరించుకున్న తర్వాత లోన్ యాప్ ల కేటుగాళ్లు లోన్ కట్టాలంటూ డిమాండ్ చేస్తూ కాంటాక్ట్ లిస్టులో ఉన్న ఫోన్ నెంబర్లకు లోన్ బాధితుల ఫోటోలను మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తూ వారి కాంటాక్ట్ లిస్టులో ఉన్న గ్రూపులకు ఫార్వర్డ్ చేస్తూ వేధిస్తున్నారు.
- అప్పు తీసుకున్న దానికన్నా అధికంగా చెల్లించినప్పటికీ ఇంకా చెల్లించాలని యాప్ నిర్వాహకులు, ఏజెంట్లు బెదిరించడమే కాక, బాధితుల ఫోటోలను వీడియోలను అశ్లీలంగా చిత్రీకరించి ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేలా చేస్తు, ఆత్మహత్యలకు పాల్పడేలా చేస్తారు
- పండగల సమయంలో వివిధ రకాల కంపెనీ పేర్లతో, నూతన ఆఫర్లు అంటూ, లాటరీ గెలుచుకున్నారంటూ కొన్ని రకాల మోసపూరిత యాప్ల నిర్వాహకులు ప్రజలను వలలో వేయడానికి లింకులను తయారు చేస్తున్నారు.
సలహాలు, సూచనలు..!
- అనధికార లోన్ యాప్స్ జోలికి పోయి ప్రాణాలు మీదకు తెచ్చుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
- లోన్ యాప్స్ పై RBI నియంత్రణ ఉండదు. మీరు రుణం పొందాలంటే నేషనలైజ్డ్ బ్యాంకులను ఆశ్రయించి తగిన ప్రొసీజర్ ద్వారా రుణాలు తీసుకోండి.
- లోన్ యాప్ నిర్వహించే నేరస్తులు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తక్షణమే మీ వ్యక్తిగత సమాచారంతో పాటు, ఫోన్ మెమరీలో ఉన్న ఫోటోలు వీడియోలు హ్యాక్ చేసి, బెదిరించి మీ వద్ద నుండి అధిక మొత్తంలో నగదు వసూలు చేస్తారు.
- తెలియని యాప్ లను డౌన్లోడ్ చేసే సమయంలో మీ ఫోన్ కాంటాక్ట్స్, మీడియా, గ్యాలరీ, కెమెరాలకు సంబంధించి ఆప్షన్స్ కు పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే వ్యక్తిగత సమాచారం వారి చేతికి వెళ్లకుండా ఉంటుంది.
- వాట్సాప్, టెలిగ్రామ్ ఇతర UNKNOWN నెంబర్ల నుంచి మన సెల్ ఫోన్ వచ్చే లింకులను సాధ్యమైనంత వరకు ఓపెన్ చేయకుండా ఉండటం మేలు.
- లోన్ యాప్ లను డౌన్లోడ్ చేసుకునే సమయంలో అవి రిజిస్టర్ కంపెనీ అవునా కాదా పరిశీలించుకోవాలి. మోసపూరిత రుణ యాప్ ల పట్ల జాగ్రత్త వహించాలి.
- ఎవరైనా లోన్ యాప్ ల ద్వారా రుణం పొంది తీసుకున్న మొత్తం తిరిగి చెల్లించిన పిమ్మట, రుణ యాప్ల ప్రతినిధులు ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడి వేధింపులకు పాల్పడుతుంటే తక్షణమే సమీప పోలీస్ స్టేషన్లో గాని, సైబర్ మిత్ర హెల్ప్ లైన్ 1930 DAIL -100 కు గాని ఫిర్యాదు చేయాలి.
- పరిచయం లేని నెంబర్లనుండి ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతుంటే ఆత్మస్థైర్యం కోల్పోకుండా ధైర్యంగా వాద ప్రతిపాదనలు చేస్తూ, వారి ఉచ్చు నుండి తప్పించుకునేలా సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి.
- ఏజెంట్స్ ఎవరైనా ఫోన్ చేసి ఓటిపి గాని, పిన్ నెంబర్లు కానీ తెలుపమంటే బయటకి చెప్పవద్దు.
- నగదు అవసరమైనప్పుడు బ్యాంకులలో, ప్రముఖ ఫైనాన్సింగ్ సంస్థలలో సరైన పత్రాలు సమర్పించి రుణం పొందడం ఉత్తమం. డాక్యుమెంటేషన్ లేదు కదా అని నకిలీ రుణ యాప్ల వలలో చిక్కుకోవద్దు.