TS BJP :  నియోజకవర్గ ఇంచార్జి పదవి వస్తే అందరూ సంతోషపడతారు. తెలంగాణలో జోరు మీద ఉన్న బీజేపీలో అయితే ఇంకా సంతోషపడతారు. కానీ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జులు మాత్రం తమకు ఆ పదవి వద్దే వద్దని గోల గోల చేస్తున్నారు. రెండు రోజుల కిందట బండి సంజయ్ ప్రకటించిన జాబితాలో అనేక మంది  తమకు పదవి వద్దని స్పష్టం చేస్తున్నారు. దీనికి కారణం  బీజేపీ అనుసరించిన వ్యూహమే. ఇంచార్జులు పార్టీ కోసం పని చేయాలి కానీ వారికి టిక్కెట్లు ఇచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పడంతో వారంతా ఖంగుతిన్నారు. ఆ ఇంచార్జి పదవులు వద్దని .. వెనక్కి తీసేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. 


నియోజకవర్గ ఇంచార్జి పదవుల్ని ప్రకటించిన రెండు రోజులకే బాంబ్ పేల్చిన సునీల్ భన్సల్ !


తెలంగాణ బీజేపీలో ఓ గందరగోళ పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇన్ చార్జిలను బండి సంజయ్ ఇటీవల నియమించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఇన్ చార్జిలుగా నియమించడంతో రాబోయే ఎన్నికల్లో టికెట్ దాదాపు కన్ఫర్మ్ అని ఆ నేతలు ఆనందంతో ఉన్నారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతలు అప్పగిస్తే ఎన్నికల్లోనూ వారే దాదాపుగా అభ్యర్ధులు అవుతుంటారు. దీంతో బండి సంజయ్ నియామక ఉత్తర్వులతో ఆయా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జిల్లో ఆశలు చిగురించాయి. కానీ బండి సంజయ్ ఇన్ చార్జిల ప్రకటన చేసిన మరుసటి రోజే తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ బన్సల్ చేసిన సంచలన వ్యాఖ్యలు పార్టీలో గందరగోళ పరిస్థితి దారి తీసింది. ఇన్ చార్జిలకు షాక్ ఇచ్చేలా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సునీల్ బన్సల్ రీసెంట్ గా పార్టీ వ్యవహారాల ఇన్ చార్జిగా నియమితులైయ్యారు. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జిలుగా పదవులు దక్కిన వాళ్లు ఎన్నికల్లో పోటీ చేయవద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


ఇంచార్జి పదవులు వద్దే వద్దంటున్న నేతలు !


సునీల్ భన్సల్ ప్రకటన తర్వాత అసెంబ్లీ ఇన్‌చార్జ్‌లుగా తమను తొలగించాలని పలువురు నేతలు కోరారు. ఈ మేరకు బండి సంజయ్ కు లేఖలు రాస్తున్నారు. 
నియోజకవర్గ ఇన్ చార్జిలే ఎన్నికల వరకూ వ్యయ ప్రయాశల కోర్చి పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఇలా పార్టీ కోసం సమయం, ఖర్చు చేసిన వాళ్లను పోటీ చేయవద్దు అంటే వీళ్ల శ్రమ అంతా బూడిదలో పోలిన పన్నీరే అవుతుంది. ఇన్ చార్జిలు పార్టీ బలోపేతం కోసమే పని చేయండి, అసెంబ్లీ టికెట్లు వేరే వాళ్లకు ఇస్తామంటే ఏ రాజకీయ పార్టీలోనూ నాయకులు పని చేయడానికి ముందుకు రారు. కానీ బీజేపీ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ నేతకు ఇంచార్జి పదవి ఇవ్వలేదు . ఇతర నియోజకవర్గాలకు ఇంచార్జులుగా ప్రకటించారు. అంటే అక్కడ వారు పార్టీ కోసం పని చేయాలి తప్ప..సీటు ఆశించకూడదు. అలాగని సొంత స్థానంలో ఇస్తారా అంటే అదీ కూడా లేదని చెబుతున్నారు. 


బుజ్జగిస్తున్న బండి సంజయ్ !


ప్రస్తుతం కేటాయించిన నియోజకవర్గాల్లో పని చేయాలని భవిష్యత్‌లో సొంత నియోజకవర్గంలో పని చేసుకునే అవకాశం కల్పిస్తామని బండి సంజయ్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జులకు సూచిస్తున్నారు. 6 నెలల తర్వాత సొంత నియోజకవర్గాల్లో పని చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని ఇన్‌చార్జ్‌లకు బండి సంజయ్ సర్దిచెబుతున్నారు. ఎన్నికల్లో పోటీ కోసం సర్వశక్తులు కూడదీసుకుంటూంటే ఇలా పార్టీ హైకమాండ్ షాకివ్వడం మాత్రం వారిని నిరాశకు గురి చేస్తోంది. తమ నియోజకవర్గంలో తమను ఉంచార్జిగా ప్రకటిస్తే ఎన్నికల నాటికి బలోపేతమయ్యేలా చూసుకుంటామని.. వేరేనియోజకకవర్గాల్లో శ్రమను ధారబోసి ఖాళీగా ఎందుకు ఉండాలని ప్రశ్నిస్తున్నారు. వీరందరికీ బీజేపీ నేతలు ఎలా సర్ది చెబుతారో మరి !