RevantReddy : తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రాజ్యసభ సభ్యులంతా బీజేపీలో విలీనం అవబోతున్నారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జోక్యం చెప్పారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన... కాంగ్రెస్‌కు చెందిన ఒకరిద్దరు ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. త్వరలోనే రాజ్యసభలో టీఆరెస్ ఫ్లోర్ బీజేపీలో విలీనం అవుతుందని.. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని.. ప్రగతి భవన్ లో ఉండి ప్రగతి సాధించిన హ్యాపీరావు నేతృత్వంలో అది జరగనుందని.. కేటీఆర్ ఆ సంగతి చూసుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. హ్యాపీ రావు అంటే ఎంపీ సంతోష్ రావు ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి చెప్పి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇటీవల సంతోష్ రావు సన్నిహితులపై ఈడీ దాడులు జరగడంతో ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లారన్న ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రగతి భవన్‌లోనే విధులు నిర్వహిస్తున్నారు.
కేసీఆర్‌ను కాపాడుతోంది బీజేపీనే !
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కాపాడుతోంది మోదీనేనని రేవంత్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్‌పై వచ్చిన ఆదేశాలను కేంద్రం అమలు చేయడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీ హైకోర్టులో సంపూర్ణ వివరాలతో ప్రజా ప్రయోజన వ్యాజ్యము వేశానని.. 2018లో ఎలక్షన్ కమిషన్ కు ఢీల్లీ హైకోర్టు అదేశాలిచ్చిందన్నారు. గతంలో గులాబీ కూలీ పేరుతో నిధులు వసూలు చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రం నలుమూలలా వందలాది కోట్లు వసూలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నిధులను వసూలు చేయడం నేరం ..అలాంటి వసూళ్లు లంచం తీసుకోవడంతో సమానమన్నారు. ఈ విషయంపై ఏసీబీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు..పార్టీ చందాలు వసూలు చేశారని కేసును క్లోజ్ చేశారని రేవంత్ ఆరోపించారు.
టీఆర్ఎస్ వసూళ్లపై ఫిర్యాదు చేసినా స్పందించడం లేదు
కేంద్ర ఎన్నికల సంఘ నియామవళి ప్రకారం 20వేల కంటే ఎక్కువ నగదు రూపంలో చందాలు తీసుకకూడదన్నారు. 20వేల కంటే ఎక్కువ నగదు రూపంలో ఖర్చు చేయకూడదన్నారు. గులాబీ కూలీ పేరుతో వసూలు చేసిన నిధుల వివరాలు ఎన్నికల సంఘానికి అందించలేదని.. ఎన్నికల సంఘం నియమావళిని కేసీఆర్ ఉల్లంఘించారని రేవంత్ స్పష్టం చేశారు. దీనిపై నేను ఎన్నికల సంఘాన్నీ కలిసి చర్యలు తీసుకోవాలని కోరానని..వసూళ్లపై విచారణకు సిబ్బంది లేదని ఎన్నికల సంఘం తెలిపిందన్నారు. విచారణ కోసం సీబీడీటీ చైర్మన్ కు లేఖ రాసిందన్నారు. ప్రధానికి పిర్యాదు చేస్తే.. హోంమంత్రికి పంపించారు కానీ పట్టించుకోలేదన్నారు.
కాంగ్రెస్‌ను దెబ్బ తీసేందుకు టీఆర్ఎస్, బీజేపీ పన్నుతున్న పన్నాగం
తాను ఎంపీ అయిన మళ్ళీ సీబీడీటీ కి ఫిర్యాదు చేశానన్నారు. ఐదేళ్లుగా వందల కోట్లు వసూలు చేస్తున్నారని..ఆయనపై కేంద్రప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ ప్రశ్నించారు. సరైన చర్యలు తీసుకుంటే టీఆరెస్ పార్టీ రద్దు అవుతుందన్నారు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేస్తే టీఆరెస్ కుక్కలు చించిన విస్తరి అవుతుందని..అందుకే టీఆరెస్ ను బీఆరెస్ గా మార్చుకుంటున్నారని ఆరోపించారు. వ్యూహాత్మకంగానే కేసీఆర్ పార్టీ పేరు మారుస్తున్నారు..బీజేపీ సహకారంతో చర్యల నుంచి తప్పించుకుంటున్నారని ఆరోపించారు. ఢిల్లీ హైకోర్టులో తన పిటిషన్ పై విచారణ పూర్తయ్యే వరకూ పేరు మార్చడానికి వీల్లేదని.. కావాలంటే మళ్లీ తాను కోర్టును ఆశ్రయిస్తానన్నారు. ప్రతిపక్ష హోదాను బీజేపీ కి ఇప్పించడానికే టీఆరెస్, బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయన్నారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను అమలు చేయకుండా ఎవరు అడ్డుకుంటున్నారో బీజేపీ చెప్పాలన్నారు.- దిక్కుమాలిన ప్రకటనల వెనక టీఆరెస్ బీజేపీ అంతర్గతంగా ఒప్పందం ఉందని విమర్శించారు. కాంగ్రెస్ ను ఖతం చేయడానికే వారి వీధి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.