Minister Roja Comments on Pawan Kalyan: పవన్ కల్యాణ్ కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటేనే భయం అనుకున్నామని, కానీ వాలంటీర్స్ అంటే కూడా ఇంత భయం అని నిన్నే తెలిసిందని పర్యటక మంత్రి ఆర్కే రోజా (RK Roja) ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యవస్థ వెంట్రుకను కూడా పీకలేడని అన్నారు. అసలు వాలంటీర్ వ్యవస్థను చూసి పవన్ కళ్యాణ్ వణికిపోతున్నాడని అన్నారు. కరోనా లాంటి విపత్కర సమయంలో వాలంటీర్ లు ఎలాంటి సేవలు చేశారో దేశం మొత్తం చూసిందని మంత్రి రోజా కొనియాడారు.


జగన్ కి అండగా ఉన్న వాలంటీర్ వ్యవస్థను ఆపే శక్తి ఎవరికిలేదని మంత్రి రోజా (RK Roja) తేల్చి చెప్పారు. ఆడవాళ్లను అక్రమ రవాణా చేస్తున్నారు అని పిచ్చి మాటలు మాట్లాడిన పవన్ కళ్యాణ్ మహిళా వాలంటీర్స్ కాళ్ల మీద పడి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే వాళ్లే నీకు తగిన బుద్ధి చెప్తారని తేల్చి చెప్పారు. కేంద్ర నిఘా వర్గాలు అంటూ పవన్ కళ్యాణ్ తప్పుడు లెక్కలు చెబుతున్నారని విమర్శించారు. ఎన్సీఆర్డీ డేటా అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని అన్నారు.


ఎన్‌సీఆర్‌బీ డేటా ప్రకారం మిస్సింగ్ కేసుల్లో టాప్ 10 రాష్ట్రాల్లో ఏపీ పేరే లేదని అన్నారు. పక్కన ఉన్న తెలంగాణ 6వ స్థానంలో ఉందని రోజా అన్నారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రిని అనే దమ్మూ నీకు ఉందా? ప్రశ్నించారు. తన తల్లి మీద తప్పుడు రాతలు రాయించింది టీడీపీనే అంటూ పవన్ కల్యాణ్ అర్ధరాత్రి ట్వీట్స్ పెట్టిన సంగతి మర్చిపోయావా? అని ప్రశ్నించారు


‘‘సంకరజాతి నా కొడుకులు అంటూ మీ కార్యకర్తలను తిట్టిన బాలక్రిష్ణ పిలవగానే వెళ్లి షోలో పాల్గొన్నావు. మిస్సింగ్ కి అక్రమ రవాణాకి తేడా కూడా తెలియని పవన్ కళ్యాణ్ ఉమెన్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడుతున్నాడు. జగన్ తెచ్చిన వాలంటీర్ వ్యవస్థ అవినీతి రహిత పారదర్శక విప్లవం తెచ్చే వ్యవస్థ. నువ్వు ఓడిపోయిన భీమవరం అయినా, గాజువాక అయిన.. నేను గెలిచిన నగిరి అయినా వెళ్లి వాలంటీర్ వ్యవస్థను చూద్దాం. నీకు దమ్ముందా?’’ అని రోజా ఓపెన్ ఛాలెంజ్ చేశారు.


వాళ్లిద్దరికీ ఓటమి భయం - రోజా


చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే జగన్ ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని మంత్రి రోజా అన్నారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ని సిగ్గు లేకుండా పవన్ కల్యాణ్ చదువుతున్నారని అన్నారు. ఏ మాత్రం బుద్ధి ఉన్నా వాలంటీర్ల కాళ్లు పట్టుకుని పవన్‌ క్షమాపణ కోరాలని మంత్రి రోజా అన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 46 ఏళ్ళకే సీఎం అయ్యారని.. పవన్ కళ్యాణ్ 55 ఏళ్ళు అయినా కూడా ఎమ్మెల్యే కాకపోయినా కనీసం ఎంపీటీసీ, వార్డు మెంబర్‌గా కూడా గెలవలేడని అన్నారు. సీఎం జగన్‌ను ఏకవచనంగా (సింగ్యులర్) పిలవడం కాదు.. దమ్ముంటే జగన్ మీద సింగిల్‌గా పోటీ చెయ్యాలని పవన్‌ కల్యాణ్ కు రోజా సవాల్‌ విసిరారు.