Doubts On Subramanyam death Case : వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై తీవ్ర ఆరోపణలు వస్తున్న సుబ్రహ్మణ్యం అనే యువకుడి అనుమానాస్పద కేసులో అనేక అనుమానాలు వెలుగు చూస్తున్నాయి. చెప్పే దానికి ... జరిగిన దానికి పొంతన లేకపోవడంతో అసలేం జరిగిందన్న ఉత్కంఠ పెరిగిపోతోంది. పోలీసులు సైతం ఏం జరిగిందన్నది క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. మరో వైపు ఈ అంశం రాజకీయ దుమారం రేపుతోంది. 


ప్రమాదం జరిగితే ఆస్పత్రికి తీసుకెళ్లరా ?


ప్రమాదం జరిగిందని .. అక్కడే చనిపోయారని ఎమ్మెల్సీ అనంతబాబు చెప్పారని సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు చెబుతున్నారు. అయితే ప్రమాదం జరిగితే తక్షణం ఆస్పత్రికి తీసుకు వెళతారు. ఒక వేళ అక్కడ చనిపోయినట్లుగా నిర్ధారిస్తే ఇంటికి అంబులెన్స్‌లో తీసుకు వస్తారు. అయితే ఇక్కడ ఆస్పత్రికి తీసుకెళ్లామని అనంతబాబు కొంత మందికి చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత ఆయన సొంత కారులో  మృతదేహాన్ని తీసుకొచ్చారు. ఆస్పత్రిలో చనిపోయినట్లుగా నిర్ధారిస్తే ఎందుకు గోప్యత పాటించారు.. మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఎందుకు పంపలేదన్నది సందేహాస్పదంగా మారిందని కుటుంబసభ్యులు, సన్నిహితులు అంటున్నారు.   



అనంతబాబే స్వయంగా తీసుకొచ్చినట్లుగా సీసీకెమెరా దృశ్యాలున్నా ఎందుకు అవాస్తవం చెబుతున్నారు ?


సుబ్రహ్మణ్యాన్ని స్వయంగా అనంతబాబు తీసుకెళ్లారని.. మృతదేహాన్ని కూడా ఆయన తీసుకొచ్చారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. కారులో మృతదేహాన్ని వారికి అప్పగించి వెళ్లిపోదామనుకున్నారు. కానీ వారు ఆందోళన చేసే సరికి ఆ కారు వదిలేసి వేరే కారులో వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయినట్లుగా తెలుస్తోంది. కానీ అనంతబాబు మాత్రం అసలు సుబ్రహ్మణ్యాన్ని తాను తీసుకు రాలేదన్నట్లుగా చెబుతున్నారు. కారు మాత్రం ఇచ్చి పంపించానంటున్నారు. ఇలా ఎందుకు అబద్దం చెబుతున్నారోనన్న అనుమానాలు ఇతరులు వ్యక్తం చేస్తున్నారు.  


కారు నెంబర్ కూడా అసలుది ఎందుకు లేదు ?


ఎమ్మెల్సీ స్టిక్కర్ అంటించిన కారుకు ఉన్న నెంబర్ కూడా ఆ కారుది కాదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ కారుకు తప్పుడు నెంబర్ ప్లేట్ పెట్టాల్సిన అవసరం ఏముందన్నది కొంత మంది వ్యక్తం చేస్తున్న సందేహం. అసలు కారు నెంబర్ ప్లేట్‌ను ఎందుకు మార్చాల్సి వచ్చిందనేదానిపై విచారణ చేయాలన్న డిమాండ్లు విపక్షాల నుంచి వస్తున్నాయి. 


పోలీసులు గోప్యత ఎందుకు పాటిస్తున్నారు ?


ప్రాథమిక ఆధారాలు హత్య అని అనుమానించేలా ఉన్నాయని ఎక్కువ మంది నమ్ముతున్నారు.  సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు కూడా అదే చెబుతున్నారు. అయితే  పోలీసులు మాత్రం ఈ కేసు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో స్పష్టత లేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారు. మరో వైపు రాజకీయ నేతలు, దళిత సంఘాలు ఈ కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఈ కేసు విషయం ఇప్పుడు కాకినాడలో సంచలనంగా మారింది.