Virat Kohli, IPL 2022: గుజరాత్‌ టైటాన్స్‌ (Gujarat Titans) మ్యాచుకు ముందురోజు నెట్స్‌లో 90 నిమిషాలు ప్రాక్టీస్‌ చేశానని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore) మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) అన్నాడు. ఈ సీజన్లో తన జట్టు కోసం ఎక్కువ రాణించకపోవడం నిరాశపరిచిందని తెలిపాడు. గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా అభిమానులు తనపై ప్రేమను ప్రదర్శించారని వెల్లడించాడు. గుజరాత్‌పై విజయం తర్వాత మీడియాతో మాట్లాడాడు. ఛేదనలో విరాట్‌ 54 బంతుల్లోనే 73 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.


'నేనెప్పుడూ ఇలాగే ముందుకు సాగుతాను. ఇది మాకు కీలకమైన మ్యాచ్‌. ఈ సీజన్లో నా జట్టు కోసం ఎక్కువగా చేయలేకపోయినందుకు బాధపడ్డాను. ఈ మ్యాచులో మా జట్టు కోసం నేను ఉనికి చాటుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ గెలుపుతో మేం మెరుగైన స్థితిలో నిలిచాం. ఇంతకు ముందు బాగా ఆడటంతో ఎక్కువ అంచనాలు ఉంటాయి. ఏదేమైనా మన దృక్పథం బాగుండాలి. అంచనాలు అందుకొనేందుకు పరుగెడితే ప్రాసెస్‌ను మర్చిపోవాల్సి ఉంటుంది. నేనెంతో శ్రమించాను. ముందురోజు నెట్స్‌లో 90 నిమిషాలు కష్టపడ్డాను. ఇప్పుడు నేనెంతో ఫ్రీగా, హాయిగా ఉన్నాను' అని కోహ్లీ అన్నాడు.


గడ్డుకాలం అనుభవిస్తున్న సమయంలో తనకు అండగా నిలిచిన అభిమానులకు కోహ్లీ కృతజ్ఞతలు తెలిపాడు. గతంలో ఎన్నడూ లేనట్టుగా ఈ సీజన్లో తనకెంతో మద్దతు లభించిందన్నాడు. 'నేనెంతో సాధించాను. కృతజ్ఞతాభావం లేకుంటే నేనిక్కడ నిలబడలేను. షమి బౌలింగ్‌లో ఫస్ట్‌ షాట్‌ ఆడగానే లెంగ్త్‌ బాల్స్‌ను ఫీల్డర్‌ తలమీదుగా కొట్టగలనని అనిపించింది. ఈ రోజు నాది అనిపించింది. ఈ సీజన్లో నాకెంతో మద్దతు లభించింది. ఇంతకు ముందునెన్నడూ లేనంతగా అభిమానులు నాపై ప్రేమను ప్రదర్శించారు' అని కోహ్లీ అన్నాడు.




ఐపీఎల్‌లో బెంగళూరు ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. గురువారం రాత్రి జరిగిన గుజరాత్ టైటాన్స్‌తో సాగిన మ్యాచ్‌లో బెంగళూరు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అనంతరం ఆర్సీబీ 18.4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. కింగ్ కోహ్లీ (73: 54 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు) ఫాంలోకి రావడం బెంగళూరుకు కలిసొచ్చే అంశం.


కాన్ఫిడెంట్‌గా కనిపించిన కోహ్లీ
170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు ఫాఫ్ డుఫ్లెసిస్ (44: 38 బంతుల్లో, ఐదు ఫోర్లు), విరాట్ కోహ్లీ... గుజరాత్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 115 పరుగులు జోడించారు. ఏకంగా 14.5 ఓవర్లు వీరు క్రీజులో నిలవడం విశేషం. గుజరాత్ బౌలర్లలో సాయికిషోర్ (4-0-20-0) మినహా ఎవరూ వీరికి కట్టడి చేయలేకపోయారు.


చాలా కాలం తర్వాత కోహ్లీ బ్యాట్‌తో చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. తనకు డుఫ్లెసిస్ నుంచి చక్కటి సహకారం లభించింది. వికెట్ పడకుండా మ్యాచ్ ఫినిష్ చేస్తారనుకున్న దశలో రషీద్ ఖాన్ బంతితో మెరిశాడు. ఇద్దరినీ వరుస ఓవర్లలో అవుట్ చేశాడు. అయితే చివర్లో మ్యాక్స్‌వెల్ (40: 18 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో బెంగళూరు తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.