ఐపీఎల్‌లో బెంగళూరు ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. గురువారం రాత్రి జరిగిన గుజరాత్ టైటాన్స్‌తో సాగిన మ్యాచ్‌లో బెంగళూరు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అనంతరం ఆర్సీబీ 18.4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. కింగ్ కోహ్లీ (73: 54 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు) ఫాంలోకి రావడం బెంగళూరుకు కలిసొచ్చే అంశం.


హార్దిక్ కెప్టెన్ ఇన్నింగ్స్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్‌కు మూడో ఓవర్లోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (1: 4 బంతుల్లో) మరోసారి విఫలం అయ్యాడు. మాథ్యూ వేడ్ (16: 13 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడకపోవడంతో పవర్‌ప్లే ఆరు ఓవర్లలోపే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే సాహా (31: 22 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) కూడా అవుటయ్యాడు.


ఈ దశలో డేవిడ్ మిల్లర్ (34: 25 బంతుల్లో, మూడు సిక్సర్లు), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (62 నాటౌట్: 47 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 61 పరుగులు సాధించారు. రాహుల్ తెవాతియా (2: 3 బంతుల్లో) నిరాశ పరిచినా... చివర్లో రషీద్ ఖాన్ (19 నాటౌట్: 6 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) సిక్సర్లతో చెలరేగాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగలిగింది. 


కాన్ఫిడెంట్‌గా కనిపించిన కోహ్లీ
170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు ఫాఫ్ డుఫ్లెసిస్ (44: 38 బంతుల్లో, ఐదు ఫోర్లు), విరాట్ కోహ్లీ... గుజరాత్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 115 పరుగులు జోడించారు. ఏకంగా 14.5 ఓవర్లు వీరు క్రీజులో నిలవడం విశేషం. గుజరాత్ బౌలర్లలో సాయికిషోర్ (4-0-20-0) మినహా ఎవరూ వీరికి కట్టడి చేయలేకపోయారు.


చాలా కాలం తర్వాత కోహ్లీ బ్యాట్‌తో చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. తనకు డుఫ్లెసిస్ నుంచి చక్కటి సహకారం లభించింది. వికెట్ పడకుండా మ్యాచ్ ఫినిష్ చేస్తారనుకున్న దశలో రషీద్ ఖాన్ బంతితో మెరిశాడు. ఇద్దరినీ వరుస ఓవర్లలో అవుట్ చేశాడు. అయితే చివర్లో మ్యాక్స్‌వెల్ (40: 18 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో బెంగళూరు తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.