ఐపీఎల్‌లో బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ మంచి స్కోరును సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (62 నాటౌట్: 47 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బెంగళూరు విజయానికి 120 బంతుల్లో 169 పరుగులు కావాలి. ఈ మ్యాచ్‌లో భారీ విజయం సాధిస్తేనే బెంగళూరుకు ప్లేఆఫ్స్ అవకాశాలు ఉంటాయి కాబట్టి వీలైనంత త్వరగా బెంగళూరు మ్యాచ్‌ను ముగించాలి.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్‌కు మూడో ఓవర్లోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (1: 4 బంతుల్లో) మరోసారి విఫలం అయ్యాడు. మాథ్యూ వేడ్ (16: 13 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడకపోవడంతో పవర్‌ప్లే ఆరు ఓవర్లలోపే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే సాహా (31: 22 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) కూడా అవుటయ్యాడు.
ఈ దశలో డేవిడ్ మిల్లర్ (34: 25 బంతుల్లో, మూడు సిక్సర్లు), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (62 నాటౌట్: 47 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 61 పరుగులు సాధించారు. రాహుల్ తెవాతియా (2: 3 బంతుల్లో) నిరాశ పరిచినా... చివర్లో రషీద్ ఖాన్ (19 నాటౌట్: 6 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) సిక్సర్లతో చెలరేగాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగలిగింది.