IPL 2022 final in Ahmedabad set to start at 8 PM : బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్‌ 2022 ఫైనల్‌ వేళలను మార్చేసింది. గతంలో మాదిరిగా రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ను ఆరంభించనుందని తెలిసింది. అంతేకాకుండా బాలీవుడ్‌ తారలతో క్లోజింగ్‌ సెర్మనీని ప్లాన్‌ చేసినట్టు సమాచారం.


ఐపీఎల్‌ 2022 ఫైనల్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. ఈ మ్యాచ్‌ను రాత్రి 8 గంటలకు నిర్వహించాలని బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. బాలీవుడ్‌ తారలతో అంగరంగ వైభవంగా ముగింపు వేడుక నిర్వహించాలని అనుకుంది. దాదాపు 50 నిమిషాల పాటు ఈ వేడుక ఉంటుందట. సాయంత్రం 6:30 గంటలకు మొదలయ్యే వేడుక రాత్రి 7:20 గంటల వరకు సాగుతుంది. 7:30కి టాస్‌ వేస్తారు. మ్యాచ్‌ 8కి మొదలవుతుంది.


ఐపీఎల్‌ 15వ సీజన్‌ ఆరంభ వేడుకను నిర్వహించేందుకు మొదట బీసీసీఐ ఆలోచించింది. కరోనా దృష్ట్యా మానుకుంది. పరిస్థితులు చక్కబడటం, ఆఖరి మ్యాచే కావడంతో ముగింపు వేడుక నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇక వచ్చే ఏడాది నుంచి అన్ని మ్యాచులను రాత్రి 8 గంటలకే మొదలు పెట్టేందుకు బీసీసీఐ, ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. తొలి పదేళ్లు ఐపీఎల్‌ను ఇదే ఫార్మాట్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. రాత్రి 8 గంటలు, డబల్‌ హెడర్‌ ఉంటే సాయంత్రం 4 గంటలకు మ్యాచ్‌ మొదలయ్యే సంగతి తెలిసిందే.


ఈ ఏడాది ప్లేఆఫ్స్‌ రెండు వేదికల్లో జరుగుతున్నాయి. క్వాలిఫయర్‌ 1, ఎలిమినేటర్‌ మ్యాచులు మే 24, 25న కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌లో జరుగుతాయి. ఇక రెండో క్వాలిఫయర్‌ (మే 27), ఫైనల్‌ మ్యాచ్‌ (మే 29)కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. ఇప్పటికే ఈ సీజన్లో గుజరాత్‌ టైటాన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. మరో రెండు స్థానాలకు రాజస్థాన్‌ రాయల్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పోటీపడుతున్నాయి.