Pawan Kalyan : ఏపీలో కులాలపై విష ప్రచారం జరుగుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆదివారం మంగళగిరి జనసేన కార్యాలయంలో కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... కాపుల సంఖ్యా బలం ఉన్నా, అంత ఆర్థిక బలం, ఐక్యత లేదన్నారు. సమాజంలో కులాలను విడదీసే వాళ్లే ఎక్కువన్నారు. ఐక్యత ఉంటేనే రాజ్యాధికారం సాధ్యం అవుతుందన్నారు. సంఖ్యాబలం ఉంటే అధికారం పంచుకోక తప్పదని అర్థం చేసుకోవాలని పవన్ అన్నారు. ఒక కులం పక్షాన నేను మాట్లాడనన్న పవన్...అధికారం ఒకరి సొంతం కాదన్నారు. సరిగ్గా సినిమాలు చేస్తే రోజుకు రూ.2 కోట్లు సంపాదించే సత్తా తనకు ఉందన్నారు. కుళ్లు, కుట్రలు, కుతంత్రాలు లేనిదే రాజకీయం లేదన్నారు. నేను మెత్తటి మనిషిని కాదన్నారు పవన్. రాయలసీమలో బలిజలు గొంతెత్తాలంటే భయపడతారన్నారు. కాపులు ఎదగడమంటే మిగతా కులాలు తగ్గడం కాదన్నారు. 


ఏ పార్టీతో లోపాయికారి ఒప్పందాలు పెట్టుకోం 


"నేను ఓడిపోతే తొడలు కొట్టింది కాపులే, కుళ్లు, కుట్రలు కుతంత్రాలు లేనిదే రాజకీయం లేదు. ప్రజల్లో మార్పు రానంత వరకు రాజకీయ సాధికారత సాధ్యం కాదు. కాపులు కూడా కొన్ని సంఘాలుగా విడిపోయారు. కాపులు రాష్ట్రంలో పెద్దన్న పాత్ర పోషించాలి. అధికారంలో ఉన్న కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు గౌరవం ఇచ్చి తీరాలి. సమస్యల గురించి గొడవ పెట్టుకుంటే ఇంట్లో వాళ్లను ఇబ్బంది పెడతారనే భయం ఉంటుంది. టీడీపీ మంచిగా ఉంటూనే 20 సీట్లకే పరిమితం చేస్తామని  సంకేతాలు ఇస్తోంది. ఏ పార్టీతో లోపాయికారి ఒప్పందాలు పెట్టుకోను. వాస్తవికతను దృష్టిలో పెట్టుకునే నేను మాట్లాడతాను. అవమానపడుతూ ఎక్కడైనా ఎందుకు ఉండాలి. ఏ పార్టీ అజెండా కోసం మేంపనిచేయాం. జనసేనను నమ్ముకున్న వారి ఆత్మ గౌరవాన్ని తగ్గించం. ఒకరేమో రూ.1000 కోట్లకు ఒప్పందం అని అంటారు. రూ.1000 కోట్లతో రాజకీయాలను నడపొచ్చంటే అంతకంటే హాస్యాస్పదం మరొకటి ఉండదు. డబ్బులతో పార్టీలను నడపలేం. కాపులు పెద్దన్న పాత్ర వహిస్తే ఈ వ్యక్తి సీఎంగా ఉండడు." - పవన్ కల్యాణ్ 


2024 ఎన్నికలు కీలకం 


వైసీపీకి మాత్రం ఎట్టివ పరిస్థితుల్లో ఓటు వేయొద్దని పవన్ కల్యాణ్ అన్నారు.నాయకుడు చనిపోయినప్పుడు జిల్లాకు ఆయన పేరు పెట్టమనడం కాదని, ఆయన బతికున్నప్పుడు వెంట నడవాలని  పవన్ అన్నారు. రాజకీయ సాధికారిత కావాలంటే కాపులంతా ఏకం కావాలని పవన్ అన్నారు. రాష్ట్రంలో కులాలను విడగొట్టి లబ్ధి పొందే నాయకులు ఎక్కువయ్యారన్నారు. 2008-09లో జరిగిన ఘటనలు తనలో పంతం పెంచాయన్నారు. ఉపాధి, ఉద్యోగాలు కావాలని అడిగే స్థితిలోనే ఇంకా ఉన్నామన్నారు. పెద్ద కులాలతో గొడవలు వద్దని, అన్ని కులాలను సమానంగా చూడాలని పవన్ పిలుపునిచ్చారు. కులం నుంచి నేను ఎప్పుడూ పారిపోనన్న పవన్... సంఖ్యాబలం ఉన్న కాపులు అధికారానికి దూరంగా ఉన్నారన్నారు. కాపులు అధికారంలోకి వస్తే మిగతావారిని తొక్కేస్తారని విషప్రచారం చేస్తున్నారన్నారు.  గత ప్రభుత్వంలో రిజర్వేషన్‌ గురించి మాట్లాడినవాళ్లు ఇప్పుడు ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కాపు రిజర్వేషన్‌ గురించి మాట్లాడారా అని నిలదీశారు. కుల ఆత్మగౌరవాన్ని చంపుకుని వైసీపీకి ఎందుకు ఓటేశారని ప్రశ్నించారు. 2024 ఎన్నికలు ఏపీ రాజకీయాలకు చాలా కీలకం అన్నారు. సంఖ్యా బలం ఉన్న వాళ్లు సత్తా చాటాలన్నారు.