Mla Thatikonda Rajaiah : తనపై వస్తున్న లైంగిక ఆరోపణలకు చెక్ పెట్టేందుకు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రయత్నించారు. అధిష్ఠానం ఆదేశాలతో ఆరోపణలు చేసిన సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లి సర్ధిచెప్పారు. అనంతరం సర్పంచ్ తో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య మాట్లాడుతూ...  ఇటీవల జరిగిన పరిణామాలకు చింతిస్తున్నానని తెలిపారు. నాకు నలుగురు చెల్లెళ్లు ఉన్నారని, మహిళల ఆత్మగౌరవం కోసమే తాను పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. ప్రాణం ఉన్నంత వరకు మహిళలకు సహకారం అందిస్తానన్నారు. ఇటీవల జరిగిన కొన్ని పొరపాట్లకుక్షమాపణలు చెబుతున్నానన్నారు. అభివృద్ధి విషయంలోనే నాపై ఆరోపణలు వచ్చాయన్నారు. జానకీపురం అభివృద్ధికి రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నానని చెప్పారు. సర్పంచ్ నవ్య ప్రవీణ్ కుమార్ లను కాపాడుకుంటానన్నారు. పార్టీ అధిష్టానం కూడా జానకీపురం గ్రామం అభివృద్ధి చేయాలని ఆదేశించిందన్నారు. ప్రవీణ్ ను చూసే సర్పంచ్ కు టికెట్ ఇచ్చానని, నవ్యను చూసి కాదన్నారు. స్టేషన్ ఘనపూర్ లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసన్నారు. 


ఎవరికైనా బాధ కలిగితే క్షమాపణలు కోరుతున్నా- ఎమ్మెల్యే రాజయ్య 


 లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ధర్మాసాగర్‌ మండలం జానకీపురం సర్పంచ్ నవ్య ఇంటికి ఆదివారం ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య వచ్చారు. దీంతో సర్పంచి ఇంటి వద్దకు పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అధిష్ఠానం సూచనతో నవ్య భర్త ప్రవీణ్ ఆహ్వానం మేరకు తాను ఇక్కడకు వచ్చినట్లు ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. అధిష్ఠానం తనకు పలు సూచనలు చేసిందన్న ఆయన...అందరూ కలిసి పనిచేయాలని చెప్పిందన్నారు. ప్రవీణ్‌, నవ్య దంపతులతో ఎమ్మెల్యే రాజయ్య ప్రత్యేకంగా మాట్లాడారు. తన వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు. 


అన్యాయం జరిగింది కానీ వాళ్లను క్షమిస్తున్నాను - సర్పంచ్ నవ్య 


 అనంతరం సర్పంచ్ నవ్య మాట్లాడుతూ.. మహిళలకు అన్యాయం జరుగుతోందన్నారు. కొందరి చేతుల్లో మహిళలు మోసపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై వేధింపులు, అరాచకాలు జరిగితే సహించొద్దన్నారు. చిన్న పిల్లలను కూడా లైంగికంగా వేధిస్తున్నారన్నారు. పార్టీలో తనకు విలువ ఉందని, ఎమ్మెల్యే రాజయ్య కారణంగానే సర్పంచ్ అయ్యానని చెప్పారు. పార్టీకి కట్టుబడి ఉంటానని, పార్టీ నాకు అండగా ఉండాలన్నారు. స్థాయిని చూసి, అణచివేయొద్దని, డబుల్ గేమ్ లు ఆడొద్దన్నారు. వేధించిన వాళ్లు ఏ స్థాయిలో ఉన్నా అంతు చూస్తామన్నారు. ఇంటిలోనూ, పార్టీలోనూ మంచి, చెడు ఉంటుందన్నారు. మాకు కష్టం వస్తే ఎమ్మెల్యే రాజయ్య తోడుగా ఉండాలని సర్పంచ్ నవ్య కోరారు. తనకు అన్యాయం జరిగింది కానీ వాళ్లను క్షమిస్తున్నానన్నారు.  ఎమ్మెల్యే రాజయ్యే వల్లే తనకు టికెట్ వచ్చిందని, సర్పంచ్ అయ్యానని జానకీపురం సర్పంచ్ నవ్య అన్నారు. తమ గ్రామాన్ని ఎమ్మెల్యే దత్తత తీసుకున్నారని, కానీ ఆయన వల్ల  గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. తన గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేస్తారో ఎమ్మెల్యే రాజయ్య  మీడియా ముఖంగా చెప్పాలని కోరారు. మహిళలకు అడుగడుగునా అన్యాయం జరుగుతుందని నవ్య అన్నారు. తప్పు చేసిన వారిని క్షమిస్తానని చెప్పారు. అయితే ఆమె రాజయ్య వేధింపులపై మాత్రం నేరుగా స్పందించలేదు. కానీ రాజయ్య పక్కన ఉండగానే ఆయనపై నవ్య తీవ్ర ఆరోపణలు చేశారు. తాను  చేసిన ప్రతి ఆరోపణ నిజం అని నవ్య తెలిపింది. 


నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగింకగా వేధిస్తున్నాడంటూ సర్పంచ్ నవ్య ఆరోపించారు.  ఈ క్రమంలో నవ్య ఆరోపణలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ వేధింపుల ఆరోపణలపై విచారణకు ఆదేశించింది.